సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ కోర్‌కమిటీ సమావేశాని కి ముందు ఢిల్లీలో శుక్రవారం యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కలవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లిన అధినేత్రి గురువారమే ఢిల్లీకి వచ్చారు. సోనియా లేకపోవడంతో తెలంగాణ నోట్ తయారీలో జాప్యం జరిగిందన్న అ భిప్రాయాలున్నాయి. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడనున్న ఇబ్బందులను తొలగించే చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆంటోని కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా రాష్ట్ర విభజనతో ఏర్పడనున్న సమస్యలపై ఇరుపక్షాల నుంచి విజ్ఞాపనలు, నివేదికలను స్వీకరించిన కేంద్రమంత్రి ఆంటోని ఇరుప్రాంతాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు వివిధ వర్గాల ప్రజలతో విడివిడిగా సమావేశమై అభ్యర్థనలను స్వీకరించారు. సమస్యలను నేరుగా ఆలకించారు. ఈ నేపథ్యంలోనే ఒక నివేదికను కూడా ఆంటోని కమిటీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను శుక్రవారం సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీకి అందజేసినట్లు సమాచారం. ఇలాంటి కీలక సమయంలోనే రాజకీయ చతురుడిగా పేరొందిన డీఎస్ సోనియాను కలిసి గంటకు పైగా రాజకీయ అంశాలపై చర్చించడం పార్టీ వర్గాల్లో ఉత్కంఠ ను కలిగించింది. ఈ భేటీలో తెలంగాణ ప్రకటన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సోనియాకు డీఎస్ క్షుణ్ణంగా వివరించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని, దీంతో ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్‌పై ప్రేమానురాగాలు పెరిగాయని డీఎస్ వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు, గతంలో తెలంగాణాలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలలో నెలకొన్న తేడాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా డీఎస్ శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో ఢిల్లీ నుంచి ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి రోడ్‌మ్యాప్ ప్రకారం హైకమాండ్ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
సోనియాగాంధీకి ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు తెలుసునని, రాష్ట్ర విభజనలో నెలకొన్న అనుమానాలు, అపోహాలపై అన్ని చర్యలు తీసుకుంటారని వివరించారు. మన కోరికలో వాస్తవముంటే దానికి దగ్గట్లుగానే హైకమాండ్ స్పందిస్తుందన్నారు. రెండు ప్రాంతాల మధ్య రాగద్వేషాలు, ధూషణలు ఉండకూడదన్నారు. తెలంగాణపై ఏ మాత్రం జాప్యం ఉండబోదని పేర్కొన్నారు. రాష్ర్ట విభజనతో ఏదో జరుగుతుందన్న భయం సీమాంధ్రులకు అవసరం లేదన్నారు. రాష్ట్ర విభజనతో అందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సోనియాను కలిసిన డీఎస్
Published Sat, Sep 14 2013 5:14 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement