వైఎస్సార్‌సీపీకి దాడి రాజీనామా
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు ప్రకటించారు. తనతోపాటు తన కుమారుడు దాడి రత్నాకర్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెప్పారు. కొంతకాలం ప్రశాంతంగా ఉండి.. ఆ తర్వాత భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. అదే సమయంలో ఆయన తమ రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెప్పడం గమనార్హం. వైఎస్సార్‌సీపీలో చేరి చేసిన తప్పును సరిదిద్దుకునేందుకే తాను ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని దాడి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన ఆరోపణలు గుప్పించారు. విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో తన కుమారుడు రత్నాకర్ ఓడిపోవడం తనకు సంతోషకరమేనని ఆయన చెప్పడం గమనార్హం. విలేకరుల సమావేశంలో దాడి రత్నాకర్ కూడా పాల్గొన్నారు.