ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ
- ప్రధాని మోదీకి బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి లేఖ
- ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చారు
- పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారు
- టీడీపీ తీరుతో మిత్రపక్షం బీజేపీకి సైతం చెడ్డపేరు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడా లని, బీజేపీకి చెడ్డపేరు రాకూడదనే సదుద్దేశం తో ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానని లేఖలో వివరించారు. లేఖ ముఖ్యాంశాలు..
‘‘ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఈ నెల 2వ తేదీన 11 మందిని కొత్తగా చేర్చు కున్నారు. ఇందులో నలుగురు వేరే పార్టీ నుంచి ఫిరాయించిన వారున్నారు. ఈ నలు గురు ఏ పార్టీ గుర్తుపై గెలుపొందారో ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. ఇది రాజ్యాంగం పదో షెడ్యూల్ లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమే. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు ఆ పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి వెళ్లడానికి వీల్లేదని పదో షెడ్యూల్‌లో ఫిరాయింపుల నిరోధక చట్టం చెబుతోంది. రెండు రాజకీయ పార్టీలు కలిసి పోవడానికే ఇందులో వెసులుబాటు ఉంది.
హామీలు, ఆశల వల
చట్టాలిలా ఉండగా కొన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వా నించేందుకు రకరకాల ఆశలు చూపుతున్నా యి. ఫిరాయింపుదారులతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడానికి అంగీక రించనని గవర్నర్ ఓ నేతతో తెగేసి చెప్పినట్లు మార్చి 2న మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పదవు లకు రాజీనామా చేయకుండానే మంత్రులుగా ఇదే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక పార్టీపై అభిమానంతో ప్రజలు ఓట్లువేసి గెలిపిస్తే ఆ పదవులకు రాజీనామా చేయ కుండా వేరే పార్టీలోకి ఫిరాయించడమంటే ప్రజాస్వామ్య విలువలను, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మంటగలపడమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ మిత్రపక్షమైన బీజేపీకి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి మోదీకి రాసిన లేఖలో దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
ఫిరాయింపుదారులకు పదవులివ్వడం రాజ్యాంగ విరుద్ధం
మార్కాపురం: వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడంపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గు బాటి పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. ఆమె మంగళవారం ప్రకాశం జిల్లా మార్కా పురంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేస్తోందని విమర్శించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. టీడీపీ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టడం మంచి సంప్ర దాయం కాదన్నారు.