రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేపట్టిన మలివిడత సమ్మెకు మద్దతుగా తాము కూడా సమ్మెలోకి వెళ్లాలనే విషయంపై ఏపీఎస్ ఆర్టీసీ యూనియన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ సమ్మెపై అనిశ్చితి
సాక్షి, విజయవాడ :
రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేపట్టిన మలివిడత సమ్మెకు మద్దతుగా తాము కూడా సమ్మెలోకి వెళ్లాలనే విషయంపై ఏపీఎస్ ఆర్టీసీ యూనియన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే మళ్లీ ప్రైవేటు బస్సులు విజృంభిస్తాయని, ఇది సంస్థ మనుగడకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో ఉద్యోగులు ఉన్నాయి.
దీంతో సమ్మెలోకి వెళ్లేందుకు యూనియన్లు కూడా వెనకాడుతున్నాయి. బుధవారం ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్యుల సమావేశం రాజధానిలో జరిగింది. దీనికి జోనల్ కార్యదర్శి వైవీ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తంకావడంతో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.
విజయవాడలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని, పార్లమెంట్‌లో చోటు చేసుకునే పరిణామాలను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని వైవీ రావు ‘సాక్షి’కి తెలిపారు మరో కార్మిక సంఘం ఎన్‌ఎంయూ ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు అందచేసింది. ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో భవిష్యత్ కార్యాచరణను చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని ఎన్‌ఎంయూ భావిస్తోంది.