కూచిపూడిని పాఠ్యాంశంగా చేరుస్తాం | dance | Sakshi
Sakshi News home page

కూచిపూడిని పాఠ్యాంశంగా చేరుస్తాం

Published Sun, Apr 19 2015 3:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

dance

 - రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా
 నెల్లూరు (అర్బన్): తెలుగువారి ప్రాచీన నాట్యమైన కూచిపూడిని పాఠ్యాంశంగా చేర్చే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం నెల్లూరుకు సమీపంలోని గొలగమూడి రోడ్‌లో ఉన్న వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) వారు కూచిపూడి నాట్య కళావైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల మనం సంస్కృతికి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టలేకపోతున్నామన్నారు. దీనిని బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని విశాఖపట్టణంలోనూ నిర్వహించాలని సమాఖ్య ప్రతినిధుల్ని కోరారు. కలెక్టర్ ఎం.జానకి మాట్లాడుతూ మన సంస్కృతికి సంబంధించిన కళాకారులకు ప్రోత్సాహం తగ్గుతోందని, ఈ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ అభినందనీయమన్నారు.
 
  ఇక నుంచి జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో మొదటగా కూచిపూడి నాట్యాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు వీఎల్.ఇందిరాదత్ మాట్లాడుతూ 1992లో అప్పటి సీఎం ఎన్‌టీ రామారావు సమాఖ్యను ప్రారంభించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూచిపూడి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమం చేయాలని అనుకుంటున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో చెప్పగా, ఆయన నెల్లూరులో చేయాలని, కార్యక్రమాన్ని తానే దగ్గరుండి జరిపిస్తాననడంతో ఇక్కడ పెట్టామన్నారు.
 
  సమాఖ్య ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కూచిపూడి గురించి యువతకు తెలియ చెప్పాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. కాగా సమాఖ్య ప్రతినిధులు నెల్లూరులోని సంగీత కళాశాలల్లో నృత్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, ఆయన తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వేమిరెడ్డి దంపతులు ఇందిరాదత్‌ను ఘనంగా సన్మానించారు. సమాఖ్య ప్రతినిధులు మంత్రి గంటా, కలెక్టర్ ఎం.జానకి తదితరులను సత్కరించారు. సమాఖ్య భాషా, సాహిత్య కమిటీ చైర్‌పర్సన్ డి.మంజులత, కార్యదర్శి ఆదిశేషయ్య, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
 
 తెలంగాణలో 30 సెంటర్లు
 తెలంగాణలో ఆంధ్రా విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్ పరీక్ష కేంద్రాల విషయమై తెలంగాణ సీఎంతో మాట్లాడామని, పరీక్ష నిర్వహణకు ఒప్పుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఐఐటీ లాంటి ఏడు జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొల్పడంలో భాగంగా ఇప్పటికే మూడింటికి శంకుస్థాపన చేశారన్నారు.  పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై త్వరలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పట్టిసీమ విషయంలో ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement