* రూ.20 వేలు తీసుకున్నారంటూ తాలూకా
* పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఒంగోలు : ‘మీరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు.. మీ గుట్టు రట్టుచేస్తాం.. మిమ్మల్ని బజారుకీడుస్తాం.. మర్యాదగా రూ.40 వేలు ఇవ్వండి.. లేకుంటే జైలుకెళ్లక తప్పదు’... అని మీడియా పేరుతో ముగ్గురు యువకులు హల్‌చల్ చేశారు. వారిదెబ్బకు బెంబేలెత్తి రూ.20 వేలు ముట్టజెప్పి బయటపడిన బాధితుడు శనివారం ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ సంఘటన తమ పరిధిలోది కాదని తాలూకా పోలీసులు స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగిందంటే...
మూడు రోజుల క్రితం చీమకుర్తి మండలం గోగినేనివారిపాలెంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఆ గ్రామం మొత్తానికి తెలిసినా పోలీసుల దృష్టికి మాత్రం రాలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన డ్రైవర్ జె.శ్రీనుయాదవ్, క్లీనర్ షేక్ ఫజుల్లాలు ఒంగోలులోని ఓ డీజిల్ ట్యాంకర్‌కు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం స్థానిక సూరారెడ్డిపాలెం ఐవోసీ కార్యాలయం నుంచి ట్యాంకర్ ఆళ్లగడ్డకు బయలుదేరింది. సూరారెడ్డిపాలెం, ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, బేస్తవారిపేట, గిద్దలూరు మీదుగా ఆళ్లగడ్డ వెళ్లాల్సి ఉండగా, మెయిన్‌రోడ్డును వదిలి చీమకుర్తి మండలం గోగినేనివారిపాలెం చేరుకుంది.
దందా ఇలా...
ట్యాంకర్ దారితప్పిందని ముగ్గురు వ్యక్తులు గమనించారు. రెండు మోటారు బైకులపై నేరుగా గోగినేనివారిపాలెం చేరుకున్నారు. అక్కడ వీడియో కెమేరాలో షూట్‌చేస్తూ దందా ప్రారంభించారు. అక్రమ వ్యాపారం చేస్తున్నారని, జాతీయ చానళ్లలో చూపించాల్సి వస్తుందని డ్రైవర్, క్లీనర్లను బెదిరించారు. తాము భోజనం చేసేందుకు గ్రామంలో తమకు తెలిసిన చిన్నా ఇంటికి వచ్చామని డ్రైవర్ వారించినా వినిపించుకోలేదు. దీంతో చిన్నా అనే వ్యక్తి కల్పించుకుని దందా చేస్తున్న వారితో చర్చించారు. వారు రూ.40 వేలు డిమాండ్ చేయగా, రూ.20 వేలు ఇప్పించాడు. ప్రస్తుతం మరో రూ.5 వేలు కూడా ఇవ్వాలని డ్రైవర్‌కు ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో ట్యాంకర్ యజమాని దృష్టికి డ్రైవర్ తీసుకెళ్లాడు. సంబంధిత యజమాని ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనేక అనుమానాలు...
ఈ సంఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్నా ఎవరు.? అతనికి, ట్యాంకర్ డ్రైవర్‌కు సంబంధం ఏంటి.? మీడియా పేరుతో ట్యాంకర్‌ను వెంబడించిన వారు ఎవరు.? నిజంగా మీడియాలో పనిచేసేవారేనే..కాదా..? వారు బెదిరిస్తే డబ్బు ఎందుకు ఇచ్చారు.? లాంటి ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ సమాధానం లేదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించాల్సిన పోలీసులు.. తమ పరిధిలోది కాదని చేతులెత్తేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
మీడియా పేరుతో దందా
Published Sun, Jan 25 2015 5:28 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement