నెహ్రూనగర్ నుంచి మంచాలకట్ట వైపు బ్యాక్‌వాటర్‌లో వెళ్తున్న ఇంజిన్ బోటు
పగిడ్యాల: బ్యాక్ వాటర్‌లో ఇంజిన్ బోటుపై ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా ఇటు ప్రయాణికులు, అటు బోటు నిర్వాహకులు కొనసాగిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మండల పరిధిలోని నెహ్రూనగర్ మూర్వకొండ ఘాట్ నుంచి ఇంజిన్ బోట్ ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్ మీదుగా తెలంగాణ ఆవలి ఒడ్డున ఉండే మంచాలకట్ట గ్రామానికి ప్రయాణికులను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. 2007 జనవరి 19న సింగోటం జాతరకు నాటు పుట్టిలో మూర్వకొండ ఘాట్ నుంచి బయలుదేరిన 70 మందికి పైగా భక్తులు ప్రమాదానికి గురయ్యారు. 60 మంది నీటిలో మునిగి మరణించగా మిగతావారు అతికష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నారు. పుట్టి నిర్వాహకుల ధనాశకు అంతమంది బలైపోయారు. అప్పటి నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో నాటు పుట్టిలను అధికారులు నిషేధించారు. అయితే తెలంగాణ, రాయలసీమకు బంధుత్వాలు ఎక్కువగా ఉండడం, మూర్వకొండ ఘాట్ నుంచి నదిపై బోట్లలో వెళ్లడం అవసరం కావడంతో ఘాట్ నిర్వాహకులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజీవ్ యువశక్తి పథకం కింద రెండు ఇంజిన్‌బోట్లను మంజూరు చేయించారు. ఇంజిన్ బోటులో 20 మంది ప్రయాణికులకు మించి తరలించరాదని ఆదేశాలు కూడా జారీ చేశారు.
అధికారుల ఆదేశాలు బేఖాతరు..
ప్రభుత్వ సాయం ద్వారా ఇంజిన్‌బోట్‌లు కొనుగోలు చేసి నిర్వహిస్తున్న నెహ్రూనగర్ వాసులు బోట్‌లో 20 మందికి మించి తరలించరాదనే ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. రూకల ఆశతో అధిక సంఖ్యలో ప్రయాణీకులు, బైక్‌లను ఎక్కించి తరలిస్తున్నారు. ఇదే సమయంలో ఇంజిన్ బోటులో ఆపద సమయంలో ప్రయాణీకుల భద్రత కోసం ఉండల్సిన లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. దీనికితోడు బోటును నడిపేందుకు పెద్దలకు బదులు అనుభవం లేని, ఈత రాని తమ పిల్లలను పంపిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు వారాల క్రితం ఓ విద్యార్థి ఇంజిన్ బోటుకు ఉన్న లంగర్‌ను తొలగించేందుకు నదిలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే 2007 ఘటన మరోసారి చవి చూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది. రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment