danger journey
-
పెళ్లి కోసం యువతి ప్రమాదకర ప్రయాణం
పట్నా : బిహార్‌కు చెందిన ఓ యువతి తన పెళ్లి కోసం ప్రమాదకరమైన ప్రయాణాన్ని కూడా లెక్కచేయలేదు. కతిహర్ జిల్లాలోని నిమా గ్రామానికి చెందిన సునీత తుడుకు జార్ఖండ్‌లోని మర్రో గ్రామానికి చెందిన మాన్వేల్ మరండితో జూలై 6వ తేదీన విహహం నిశ్చయమయింది. కానీ ఇరు రాష్ట్రాల మధ్య నడవాల్సిన పడవ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో నదికి ఇరువైపుల ఉన్న గ్రామాల మధ్య రవాణా స్తంభించింది. వరుడి ఇంటికి వెళ్లాలంటే నది దాటక తప్పని పరిస్థితి. 8 రోజులకు మించి పడవ సర్వీసులు రద్దవ్వడం, గంగా నదిలో వరద తీవ్రత అధికంగా ఉండటంతో వరుడి కుటుంబం ఈ పరిస్థితుల్లో వధువు కుటుంబం నది దాటి రావడం ప్రమాదకరమని భావించింది. అయితే పెళ్లి వాయిదా వేయాల్సింది పోయి.. రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆందోళన చెందిన పెళ్లి కూతురు తన పెళ్లి ఆగిపోకూడదని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన కుటుంబసభ్యులకు వివరించింది. పడవ సర్వీసులు నిలిచిపోయినప్పటికీ.. ఓ పడవ తీసుకుని పెళ్లి కూతురు బంధువులంతా ప్రయాణానికి సిద్ధమయ్యారు. నదిలో వరద పోటు అధికంగా ఉన్న లెక్కచేయకుండా.. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా వారు పడవలో నది దాటి పెద్ద సాహసమే చేశారు. చివరకు వరుడి ఇంటికి చేరారు. దీంతో సునీత వివాహం అనుకున్న సమయానికి కంటే మూడు రోజులు ఆలస్యంగా జూలై 9వ తేదీన జరిగింది. -
కాలువలపై ఇరుకు వంతెనలు
ఏన్కూరు : మండలంలోని ఎన్నెస్పీ కాలువలపై ఇరుకు వంతెనలు నిర్మంచడంతో రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని ఎర్రబోడుతండా, రాయామాదారం సమీపంలోని నాగార్జున సాగర్ కాలువలపై ఇరుకు వంతెనలు నిర్మించడంతో గత కొన్ని సంవత్సరాలుగా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ కాలువలపై అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు పొలాలకు, చేలకు వెళ్లలేకపోతున్నారు. రైతులు తమ పొలాలకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తరలించలేక నానా అగచాట్లు పడుతున్నారు. ఇరుకు వంతెనలపై ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంతెనపై నుంచి వెళ్లాల్సిన దుస్థితి కలిగింది. పండించిన పంటలను ఇంటికి తీసుకు రావాలన్నా.. పైర్లను పెంచడానికి అవసరమైన ఎరువులను తీసుకు వెళ్లాలన్నా ఇబ్బంది తప్పడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇరుకు వంతెనలకు సైడ్‌వాల్స్ లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు బయపడుతున్నారు. సాగర్ కాలువలపై వంతెన ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులు, రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నా.. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. నాగార్జున సాగర్ ఆధునీకీకరణ పనులు చేస్తున్నప్పటికీ.. ఇరుకు వంతెనలు ఉన్న ప్రదేశాల్లో మాత్రం పెద్ద వంతెనల నిర్మాణం చేపట్టడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇరుకు వంతెనలున్న ప్రాంతాల్లో పెద్ద వంతెనలు నిర్మించాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. -
బాబోయ్ బోటు ప్రయాణం
పగిడ్యాల: బ్యాక్ వాటర్‌లో ఇంజిన్ బోటుపై ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా ఇటు ప్రయాణికులు, అటు బోటు నిర్వాహకులు కొనసాగిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మండల పరిధిలోని నెహ్రూనగర్ మూర్వకొండ ఘాట్ నుంచి ఇంజిన్ బోట్ ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్ మీదుగా తెలంగాణ ఆవలి ఒడ్డున ఉండే మంచాలకట్ట గ్రామానికి ప్రయాణికులను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. 2007 జనవరి 19న సింగోటం జాతరకు నాటు పుట్టిలో మూర్వకొండ ఘాట్ నుంచి బయలుదేరిన 70 మందికి పైగా భక్తులు ప్రమాదానికి గురయ్యారు. 60 మంది నీటిలో మునిగి మరణించగా మిగతావారు అతికష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నారు. పుట్టి నిర్వాహకుల ధనాశకు అంతమంది బలైపోయారు. అప్పటి నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో నాటు పుట్టిలను అధికారులు నిషేధించారు. అయితే తెలంగాణ, రాయలసీమకు బంధుత్వాలు ఎక్కువగా ఉండడం, మూర్వకొండ ఘాట్ నుంచి నదిపై బోట్లలో వెళ్లడం అవసరం కావడంతో ఘాట్ నిర్వాహకులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజీవ్ యువశక్తి పథకం కింద రెండు ఇంజిన్బోట్లను మంజూరు చేయించారు. ఇంజిన్ బోటులో 20 మంది ప్రయాణికులకు మించి తరలించరాదని ఆదేశాలు కూడా జారీ చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు.. ప్రభుత్వ సాయం ద్వారా ఇంజిన్‌బోట్లు కొనుగోలు చేసి నిర్వహిస్తున్న నెహ్రూనగర్ వాసులు బోట్లో 20 మందికి మించి తరలించరాదనే ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. రూకల ఆశతో అధిక సంఖ్యలో ప్రయాణీకులు, బైక్‌లను ఎక్కించి తరలిస్తున్నారు. ఇదే సమయంలో ఇంజిన్ బోటులో ఆపద సమయంలో ప్రయాణీకుల భద్రత కోసం ఉండల్సిన లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. దీనికితోడు బోటును నడిపేందుకు పెద్దలకు బదులు అనుభవం లేని, ఈత రాని తమ పిల్లలను పంపిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు వారాల క్రితం ఓ విద్యార్థి ఇంజిన్ బోటుకు ఉన్న లంగర్‌ను తొలగించేందుకు నదిలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే 2007 ఘటన మరోసారి చవి చూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది. రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
ప్రమాదకర ప్రయాణం
- ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యం - కండీషన్ లేని బస్సులు - నైపుణ్యం లేని డ్రైవర్లు - ఒక డ్రైవర్‌తోనే సుదూర ప్రాంతాలకు.. - పరిమితికి మించి ప్రయాణికులతో రాకపోకలు - తరచూ ప్రమాదాలతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు అధికారిక లెక్కల ప్రకారం గతేడాది రోడ్డు ప్రమాదాలు : 1394 మృతిచెందిన వారి సంఖ్య : 637 గాయపడిన వారు : 2084 అనధికార లెక్కల ప్రకారం : రెట్టింపు స్థాయిలో బాధితులు - ఫిబ్రవరి 15న తనకల్లు మండలం దేవళంతండా సమీపంలోని మలుపు వద్ద జీటీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు పల్టీలు కొట్టింది. కర్ణాటకలోని బాగేపల్లి నుంచి అనంతపురానికి 40 మంది ప్రయాణికులతో ఈ బస్సు బయలుదేరింది. అతివేగంగా వస్తున్న సమయంలో టైరు పంక్చర్ కావడంతో ఈ ఘటన జరిగింది. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. - జనవరి 5న పామిడిలోని అంబేడ్కర్ సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగమ్మ అనే మహిళ మృత్యువాత పడింది. తన భర్త సుంకన్నతో కలిసి సైకిల్‌పై కూలిపనులకు వెళుతండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టి సుంకమ్మపై దూసుకెళ్లింది. దీంతో ఆమె మాంసపు ముద్దలా తయారైంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అనంతపురం సెంట్రల్ : ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ధనార్జనే ధ్యేయంగా భావించిన కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. అరకొర సిబ్బందితో సుదూర ప్రాంతాలకు సర్వీసులు నడుపతుండటమే కాకుండా.. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సురక్షిత ప్రయాణానికి చిరునామా అయిన ఆర్టీసీ సంస్థను దెబ్బతీసేందుకు పలువురు ట్రావెల్స్ నిర్వాహకులు కుట్ర పన్నుతున్నారు. జిల్లాలో సగటున జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే ఆర్టీసీ బస్సులకంటే ప్రైవేటు వాహనాల ప్రమాదాలే అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీలో శిక్షణ తీసుకున్న డ్రైవర్లు పనిచేస్తున్నారు. కానీ తక్కువ జీతం కోసం కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నైపుణ్యం లేని వారితో బస్సులు నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. కొన్ని ట్రావెల్స్ ఈ నిబంధనను తుంగలోకి తొక్కుతున్నాయి. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి ప్రతి రోజూ దాదాపు 25 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు హెదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు తిప్పుతున్నాయి. ప్రతి స్టేజీలోనూ ప్రయాణికులను తామే ఎక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో అతివేగంగా బస్సులు నడుపుతున్నారు. వీటికి తోడు ఆటోలు, జీపులు తదితర ప్రైవేటు వాహనాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆర్టీసీబస్సులు లేని గ్రామీణ ప్రాంతాలకు వందలాది ప్రైవేట్ వాహనాలు ప్రజలను తీసుకెళుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం అనుభవం లేని డ్రైవర్లు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిట్నెస్ లేని వాహనాలు అనేకం : జిల్లాలో అనేక వాహనాలు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. రోడ్డు రవాణా శాఖ అధికారుల కళ్లుగప్పి రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం సరుకు రావాణా ఉపయోగించే గూడ్స్ వాహనాలే ఉన్నాయి. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు కాంట్రాక్టు క్యారేజ్ పేరుతో అనుమతి ఒకదానిపై తీసుకుని వేరే వాహనాలను కూడా తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న వాహనాల వివరాలు ట్రాక్టర్ ట్రాలీలు - 452 గూడ్స్ లారీలు - 639 గూడ్స్ వ్యాన్లు - 49 మ్యాక్సిక్యాబ్‌లు - 78 మోటార్క్యాబ్లు - 28 త్రీవీలర్స్ గూడ్స్ వాహనాలు - 313 -
డేంజర్ జర్నీ
-
ప్రమాదకర ప్రయాణం
పల్లెలకు వెళ్లని ప్రగతి రథచక్రాలు ఇబ్బందుల్లో గ్రామీణులు, విద్యార్థులు ప్రమాదమని తెలిసినా ప్రైవేటు వాహనాల ఆశ్రయం జోగిపేట: ‘ఆటోల్లో ప్రయాణించడం ప్రమాదకరం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ అంటూ ప్రచారం చేస్తున్న ఆర్టీసీ ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జోగిపేట పట్టణంలోని కళాశాలలు, పాఠశాలలకు అందోలు, పుల్కల్, రేగోడ్, టేక్మాల్, అల్లాదుర్గం, కౌడిపల్లి, హత్నూర మండలాల నుంచి 600 మంది వరకు విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారు. అందోలు మండలం పరిధిలోని కన్సాన్పల్లి, నేరడిగుంట, రాంసానిపల్లి, చింతకుంట, అన్నాసాగర్, అల్మాయిపేట, డాకూర్, తాలెల్మ, బ్రాహ్మణపల్లి, అక్సాన్‌పల్లి, సంగుపేట, అందోలు గ్రామాలకు చెందిన విద్యార్థులు జోగిపేటకు వచ్చి చదువుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు పాఠశాలలు, కళాశాలలకు చేరుకోవాల్సి ఉండగా సకాలంలో బస్సులు లేకపోవడంతో ఉదయం 10.30 గంటల వరకు కూడా చేరుకోలేని పరిస్థితి. ఉదయం పూట ముస్లాపూర్, పెద్దాపూర్ రూట్లో ఒక బస్సును నడుపుతారు. ఆ బస్సులోనే వందకుపైగా విద్యార్థులు ఎక్కుతున్నారు. ప్రాణాలకు తెగించి మరీ అందుటో ప్రయాణిస్తున్నారు. బస్సుటాపు, ఫుడ్‌బోర్డుపై ప్రయాణించాల్సి వస్తోంది. ఆ బస్సు కూడా 9.30 నుంచి 10 గంటల ప్రాంతంలో జోగిపేటకు చేరుకుంటుంది. ప్రైవేటు వాహనాలే దిక్కు జోగిపేట పట్టణంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐలకు ప్రతి రోజూ వందల సంఖ్యలో వస్తుంటారు. బస్‌పాస్‌లు తీసినప్పటికి విద్యార్థులకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. సమయానికి బస్సులు రావడం లేదు. ఒకటి, రెండు బస్సులే ఉండటంతో అవి దొరకకపోతే ఏదో ఓ వాహనాన్ని ఆశ్రయించి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. చింతకుంట, కన్సాన్పల్లి , రాంసానిపల్లి, అన్నాసాగర్ గ్రామాలకు చెందిన విద్యార్థులకు సకాలంలో బస్సులు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అన్నాసాగర్, అందోలు ప్రాంతాలకు చెందిన వారు కాలినడకనే రావాల్సి వస్తోంది. అల్లాదుర్గం మండలానికి చెందిన ముస్లాపూర్, పెద్దాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా బస్సు టాప్‌పై ఎక్కి ప్రయాణించి వస్తున్నారు. గంటలకొద్దీ బస్సులు కోసం నిరీక్షిస్తున్నారు. టేక్మాల్ మండలానికి చెందిన పల్వంచ, ధన్నారం గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా జోగిపేటకు రావడానికి నరకయాత పడుతున్నారు. బస్సులు సమయానికి లేకపోవడంతో కొద్ది దూరం కాలినడకన వచ్చి ఆటోల్లో వెళ్తున్నారు. కౌడిపల్లి మండలానికి చెందిన చండూర్, చిలప్‌చెడ్, సిలాంపల్లి, చిట్కుల్ గ్రామాలకు చెందిన విద్యార్థులు జోగిపేటలోని కళాశాలల సమయానికి బస్సులు లేకపోవడంతో ఉదయం 10 గంటలు దాటిన తరువాత వస్తున్నారు. అప్పటికే తరగతులు ప్రారంభం కావడంతో నష్టపోతున్నారు. ఉదయం పూట బస్సులు లేకపోవడంతో రేగోడ్ మండలానికి చెందిన ఖాదిరాబాద్, రేగోడ్, నిర్జప్ల, దేవ్నూర్, గజ్వాడ, గట్పల్లి, ఉసిరికపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సులను నడపాలి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులను నడపాలి. ఉదయం 8.30 గంటల వరకు ముస్లాపూర్ నుంచి బయలుదేరే విధంగా బస్సును నడిపించాలి. చింతకుంట, చండూర్ ప్రాంతాల విద్యార్థులకు సమయానికి బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. - టి.నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆందోళన చేపడతాం విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులను నడపకుంటే ఆందోళన చేపడతాం. సంగారెడ్డి, మెదక్ డిపోలకు చెందిన బస్సులను నడపాలి. ఆలస్యంగా కళాశాలలు, పాఠశాలలకు వెళ్లడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలి. - పి.మొగులయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సమస్యను పరిష్కరించాలి బస్సుల కోసం రాస్తారోకోలు చేయడంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్యార్థులు రాస్తారోకోలు చేయకుండా ఆర్టీసీ అధికారులు స్పందించాలి. విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి సమస్యను పరిష్కరించాలి. ప్రయానికులను ఇబ్బంది పెట్టొద్దు. - వెంకటయ్య, సీఐ -
డేంజర్ జర్నీ
ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనచోదకులు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రమాదభరిత ప్రయాణం సాగిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్‌పై ఒకరికి ముగ్గురు కూర్చుని హెల్మెట్ కూడా లేకుండా రయ్..రయ్‌మని హైవేపై దూసుకుపోతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి స్కూలు పిల్లలు, ప్రయాణికులను ఎక్కించుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏదో ఒక ఘటన జరిగిన సమయంలో హడావుడి చేసే రవాణా శాఖ, పోలీసు అధికారులు ఈ నిబంధనల ఉల్లంఘనను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ఖాళీ సమయాల్లో మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతుండటంతో వాహనచోదకులు ఇలా ప్రమాదభరిత ప్రయాణం సాగిస్తున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్