- ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యం
- కండీషన్ లేని బస్సులు
- నైపుణ్యం లేని డ్రైవర్లు
- ఒక డ్రైవర్‌తోనే సుదూర ప్రాంతాలకు..
- పరిమితికి మించి ప్రయాణికులతో రాకపోకలు
- తరచూ ప్రమాదాలతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు
అధికారిక లెక్కల ప్రకారం గతేడాది రోడ్డు ప్రమాదాలు : 1394
మృతిచెందిన వారి సంఖ్య : 637
గాయపడిన వారు : 2084
అనధికార లెక్కల ప్రకారం : రెట్టింపు స్థాయిలో బాధితులు
- ఫిబ్రవరి 15న తనకల్లు మండలం దేవళంతండా సమీపంలోని మలుపు వద్ద జీటీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు పల్టీలు కొట్టింది. కర్ణాటకలోని బాగేపల్లి నుంచి అనంతపురానికి 40 మంది ప్రయాణికులతో ఈ బస్సు బయలుదేరింది. అతివేగంగా వస్తున్న సమయంలో టైరు పంక్చర్ కావడంతో ఈ ఘటన జరిగింది. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- జనవరి 5న పామిడిలోని అంబేడ్కర్ సర్కిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగమ్మ అనే మహిళ మృత్యువాత పడింది. తన భర్త సుంకన్నతో కలిసి సైకిల్‌పై కూలిపనులకు వెళుతండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టి సుంకమ్మపై దూసుకెళ్లింది. దీంతో ఆమె మాంసపు ముద్దలా తయారైంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
అనంతపురం సెంట్రల్ : ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ధనార్జనే ధ్యేయంగా భావించిన కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. అరకొర సిబ్బందితో సుదూర ప్రాంతాలకు సర్వీసులు నడుపతుండటమే కాకుండా.. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సురక్షిత ప్రయాణానికి చిరునామా అయిన ఆర్టీసీ సంస్థను దెబ్బతీసేందుకు పలువురు ట్రావెల్స్ నిర్వాహకులు కుట్ర పన్నుతున్నారు. జిల్లాలో సగటున జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే ఆర్టీసీ బస్సులకంటే ప్రైవేటు వాహనాల ప్రమాదాలే అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీలో శిక్షణ తీసుకున్న డ్రైవర్లు పనిచేస్తున్నారు.
కానీ తక్కువ జీతం కోసం కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నైపుణ్యం లేని వారితో బస్సులు నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. కొన్ని ట్రావెల్స్ ఈ నిబంధనను తుంగలోకి తొక్కుతున్నాయి. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి ప్రతి రోజూ దాదాపు 25 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు హెదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు తిప్పుతున్నాయి. ప్రతి స్టేజీలోనూ ప్రయాణికులను తామే ఎక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో అతివేగంగా బస్సులు నడుపుతున్నారు. వీటికి తోడు ఆటోలు, జీపులు తదితర ప్రైవేటు వాహనాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆర్టీసీబస్సులు లేని గ్రామీణ ప్రాంతాలకు వందలాది ప్రైవేట్ వాహనాలు ప్రజలను తీసుకెళుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం అనుభవం లేని డ్రైవర్లు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఫిట్‌నెస్ లేని వాహనాలు అనేకం :
జిల్లాలో అనేక వాహనాలు ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. రోడ్డు రవాణా శాఖ అధికారుల కళ్లుగప్పి రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం సరుకు రావాణా ఉపయోగించే గూడ్స్ వాహనాలే ఉన్నాయి. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు కాంట్రాక్టు క్యారేజ్ పేరుతో అనుమతి ఒకదానిపై తీసుకుని వేరే వాహనాలను కూడా తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న వాహనాల వివరాలు
ట్రాక్టర్ ట్రాలీలు - 452
గూడ్స్ లారీలు - 639
గూడ్స్ వ్యాన్‌లు - 49
మ్యాక్సిక్యాబ్‌లు - 78
మోటార్‌క్యాబ్‌లు - 28
త్రీవీలర్స్ గూడ్స్ వాహనాలు - 313
ప్రమాదకర ప్రయాణం
Published Wed, Mar 1 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement