రాయమాదారం సమీపంలో ప్రమాదకరంగా ఇరుకు వంతెన
ఏన్కూరు : మండలంలోని ఎన్నెస్పీ కాలువలపై ఇరుకు వంతెనలు నిర్మంచడంతో రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని ఎర్రబోడుతండా, రాయామాదారం సమీపంలోని నాగార్జున సాగర్ కాలువలపై ఇరుకు వంతెనలు నిర్మించడంతో గత కొన్ని సంవత్సరాలుగా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ కాలువలపై అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు పొలాలకు, చేలకు వెళ్లలేకపోతున్నారు. రైతులు తమ పొలాలకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తరలించలేక నానా అగచాట్లు పడుతున్నారు. ఇరుకు వంతెనలపై ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంతెనపై నుంచి వెళ్లాల్సిన దుస్థితి కలిగింది. పండించిన పంటలను ఇంటికి తీసుకు రావాలన్నా.. పైర్లను పెంచడానికి అవసరమైన ఎరువులను తీసుకు వెళ్లాలన్నా ఇబ్బంది తప్పడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇరుకు వంతెనలకు సైడ్‌వాల్స్ లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు బయపడుతున్నారు. సాగర్ కాలువలపై వంతెన ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులు, రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నా.. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. నాగార్జున సాగర్ ఆధునీకీకరణ పనులు చేస్తున్నప్పటికీ.. ఇరుకు వంతెనలు ఉన్న ప్రదేశాల్లో మాత్రం పెద్ద వంతెనల నిర్మాణం చేపట్టడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇరుకు వంతెనలున్న ప్రాంతాల్లో పెద్ద వంతెనలు నిర్మించాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment