ఆస్పత్రి వ్యర్థాలతో డేంజర్‌ బెల్స్‌! | Dangerous With Discharges From Fospitals Disease | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి వ్యర్థాలతో డేంజర్‌ బెల్స్‌!

Published Tue, Apr 30 2019 4:45 AM | Last Updated on Tue, Apr 30 2019 4:45 AM

Dangerous With Discharges From Fospitals Disease - Sakshi

సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో మురుగు కాల్వల ద్వారా వెళ్లాల్సిన నీటిలో ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థ విష జలాలు కలిసి భయంకర వ్యాధులకు కారణమవుతుండటం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజారోగ్యానికి ఏమాత్రం క్షేమం కాదని.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) హెచ్చరిస్తున్నా ఫలితం ఉండటం లేదు. చిన్న చిన్న ఆస్పత్రులే కాకుండా చివరకు వేయి పడకలు ఉన్న ఆస్పత్రుల్లోనూ సీవరేజీ ట్రీట్‌మెంటు ప్లాంట్లు లేవు. దీంతో ఆస్పత్రులు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా మురుగు కాల్వల్లోకి పంపిస్తున్న తీరు భయాందోళన రేకెత్తిస్తోంది.

ఇప్పటికే ఒకవైపు ఘన వ్యర్థాలను నిర్వీర్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చేష్టలుడిగి దిక్కులు చూస్తోంది. మరోవైపు ఆస్పత్రుల్లో రోజూ వందల లీటర్లలో రోగుల నుంచి రకరకాల జల వ్యర్థాలు వస్తుంటాయి. మున్సిపాలిటీలలో ఇలాంటి వ్యర్థాలన్నిటినీ నేరుగా మురుగు కాల్వల్లోకి వదులుతుండటం వల్ల జబ్బులు తగ్గకపోగా కొత్త జబ్బులు వెంటాడుతున్నాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్, కాలుష్య నియంత్రణ మండలి వంటి వాటి ఆదేశాలను ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.

సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి..
ప్రతి పెద్దాస్పత్రిలో నిబంధనల ప్రకారం.. విధిగా సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఉండాలి. రోగులకు శస్త్రచికిత్సలు చేసినప్పుడు, మహిళలు ప్రసవించినప్పుడు ఎక్కువగా ద్రవ వ్యర్థాలు విడుదలవుతాయి. ఈ వ్యర్థాలను నేరుగా మురుగు కాల్వల్లోకి వదలకూడదు. సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ తర్వాతే నీటిని మురుగు కాల్వల్లోకి వదలాలి. అయితే పెద్ద పెద్ద ఆస్పత్రుల్లోనే సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు లేవు. ఉదాహరణకు.. రాజధాని అమరావతిలో సచివాలయానికి సమీపంలో ఉండే గుంటూరు పెద్దాస్పత్రిలోనే సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ లేదు. రాజధాని నగరంగా భావించే విజయవాడలోనూ ఇదే దుస్థితి.

కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, కాకినాడ వంటి కార్పొరేషన్‌ల పరిధిలో ఉన్న ఏ పెద్దాస్పత్రిలోనూ ఈ ప్లాంట్లు లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వం.. జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు చెబుతూనే ఉన్నా ఎక్కడా నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో ఆ వ్యర్థాలతో జబ్బులను కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు. ఇలా రోగుల నుంచి వెలువడే జల వ్యర్థాలు అత్యంత ప్రమాదకర జబ్బులకు కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు ఇతర సంస్ధలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement