పంతంగి రాంబాబు, సాక్షి:
పాత బియ్యపు తిప్ప, పాత చినమైన వాని లంక ఈ గ్రామాలు ఒకప్పుడు ప.గో. జిల్లా నరసాపురం తీరప్రాంతంలో ఉండేవి. కిలోమీటర్ల కొద్దీ ముందుకు చొచ్చుకొస్తున్న సముద్రం ఈ గ్రామాలను పొట్టనపెట్టుకుంది. పాత బియ్యపు తిప్ప ఆనవాళ్లు కూడా ఇప్పుడు మిగల్లేదు. నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో వందల ఎకరాల భూముల్ని, చెట్టు చేమను సముద్రం మింగేసింది. పెదమైనవాని లంకతోపాటు, తూ.గో. జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని సుబ్బంపేట, ఉప్పాడ, సూరాడపేట, పల్లెపేట గ్రామాలు సముద్రపు కోతకు గురవుతూ ప్రమాదం అంచున వేళ్లాడుతున్నాయి. ఈ గ్రామాల జనం కొన్నేళ్లలోనే ఊళ్లు ఖాళీ చేసి వలస పోయి ప్రాణాలు నిలుపుకోవాల్సిందే..
ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే!
ఎన్నేళ్లలో ఎంత తీరప్రాంతం సముద్రం పాలవుతుంది? ఎన్ని గ్రామాలు కనుమరుగవుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెదకాలంటే.. అసలు మన దేశం మొత్తంలో కోస్తా తీర ప్రాంతం ఎంత కరిగిపోయిందో, సముద్రం ఎంత ముందుకొచ్చిందో ముందు లెక్క గట్టాలి. ఖరగ్‌పూర్‌లోని ఐఐటీ, వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిపుణులు ఉమ్మడిగా ఇటీవల ఈ పనే చేశారు. 20వ శతాబ్దంలో మన రాష్ట్ర తీరప్రాంతంలో 9 చ. కి.మీ.ల భూమి సముద్రం పాలైందని తేల్చారు. ఇంతకు ముందూ.. అక్కడక్కడా కొన్ని అధ్యయనాలు జరిగినా.. సముద్రపు కోత ఎంత విస్తీర్ణంలో భూమిని కబళించిందీ మొట్టమొదటిగా లెక్క తేల్చింది మాత్రం ఈ అధ్యయనమే.
శ్రీకాకుళం-కృష్ణా తీరంలో 9 చ.కి.మీ.ల భూమి మాయం
శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ విస్తరించి ఉన్న (1,361 కిలోమీటర్ల) తీరప్రాంతాన్ని విశాఖపట్నం ప్రాంతంగా ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇక్కడ సముద్రపు నీటి మట్టం ఏడాదికి 1.09 మిల్లీ మీటర్ల చొప్పున (వందేళ్లలో 10.9 సెం.మీ.లు) పెరిగింది. సముద్రం సుమారు 7 మీటర్ల మేరకు తీరప్రాంతంలోకి చొచ్చుకు వచ్చింది. అలల తీవ్రతకు తీరంలో భూమి కరిగి సముద్రంలో కలిసిపోతోంది. వందేళ్లలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా మధ్యలోని సుమారు 9 చ.కి.మీ.ల భూమి సముద్రంలో కలిసిపోయినట్లు లెక్క తేలింది. ముంబై తీరంలో సముద్రం 4 మీటర్లు ముందుకు వచ్చి, 17 చ. కి.మీ. భూమిని తనలో ఇముడ్చుకుంది. కొచ్చి తీరంలో 8 మీ. చొచ్చుకొచ్చిన సముద్రం 9 చ.కి.మీ. భూమిని మింగేసింది. చెన్నై తీరం కథ మాత్రం భిన్నంగా ఉంది.
చెన్నై ప్రాంతంలో వెనక్కి తగ్గిన సాగరం!
గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతం పరిస్థితి భిన్నంగా ఉండడం విశేషం. గుంటూరు నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ విస్తరించి ఉన్న (1,278 కిలోమీటర్ల) తీరప్రాంతాన్ని చెన్నై ప్రాంతంగా ఈ అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా ఈ ప్రాంతంలో సముద్రం 3.7 మీటర్లు వెనక్కి జరిగింది. దీనివల్ల సముద్ర గర్భంలోని సుమారు 5 చ.కి.మీ.ల ఇసుక బయటపడింది.
కోస్తాకు పది రెట్లు పెరగనున్న ముప్పు
‘మనుషుల పనుల వల్లనే వాతావరణంలో ప్రతికూల మార్పులొస్తున్నాయి. 2100 నాటికి ఉష్ణోగ్రత 1.5 నుంచి 2 డిగ్రీల సెస్సియస్ వరకూ పెరిగే అవకాశం ఉంది. భూతాపోన్నతి వల్ల సముద్ర నీటిమట్టం గత 40 ఏళ్లలో కన్నా మున్ముందు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది..’అని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న వాతావరణ మార్పులపై అంతర్జాతీయ కమిటీ (ఐపీసీసీ) ఇటీవల వెలువరించిన ఐదో నివేదిక స్పష్టం చేస్తోంది. జర్మనీకి చెందిన పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్(పీఐకే) ఆధ్వర్యంలో ఐదు దేశాల నిపుణులు సముద్ర నీటి మట్టం పెరుగుదల ఈ శతాబ్దంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు.
ఈ తాజా అధ్యయనం ప్రకారం.. గత శతాబ్దంలో కన్నా ఈ శతాబ్దంలో సముద్రపు నీటి మట్టం పెరుగుదల ముప్పు పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చని తేలింది. గత శతాబ్దంలో 0.2 మీటరు ్లపెరిగిన సముద్ర నీటి మట్టం 2100 నాటికి 2 మీటర్ల ఎత్తు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. వాతావరణంలో పెరిగే ఒక్కో డిగ్రీ ఉష్ణోగ్రతకు 2.3 మీటర్ల చొప్పున సముద్ర నీటిమట్టం పెరుగుతుందని మరో అధ్యయనం చెబుతోంది. అమెరికా శాస్త్రవేత్తల సంఘం అంచనాల ప్రకారం.. 1880 తర్వాత సముద్ర నీటిమట్టం 8 అంగుళాలు పెరిగింది. 2050 నాటికి 6 నుంచి 16 అంగుళాలు, 2100 నాటికి 12 నుంచి 48 అంగుళాల వరకూ పెరగొచ్చు
సముద్ర నీటి మట్టం 2 మీటర్లు పెరిగితే..?
గత శతాబ్దంలో సుముద్రపు నీటి మట్టం సుమారు 11 సెం.మీ.లు పెరిగితేనే కిలో మీటర్ల కొద్దీ తీరప్రాంతం కనుమరుగైంది. ఇక 2 మీటర్లు పెరిగితే తీరప్రాంతంలో ఎంత బీభత్సం జరుగుతుందోనన్న ఊహే వెన్నులో చలి పుట్టిస్తోంది. భూతాపాన్ని తగ్గించే పనులు చేపట్టడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు లెక్కగట్టడానికి అత్యాధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడంపైన ప్రజలు, పాలకులు మరింత దృష్టి పెట్టడం అవసరమని ఈ అధ్యయనాలు చెప్పకనే చెబుతున్నాయి. తీరప్రాంత అభివృద్ధి ప్రణాళికల రూపుకల్పనలో సముద్రపు కోతను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాల్సిన తరుణం ఇది.
ఒక గ్రామం వెనుక మరొకటి..
ప.గో.జిల్లా నరసాపురం మండలంలో లంక గ్రామాలు ఒకటి తర్వాత మరొకటి సముద్రం పాలవుతున్నాయి. గత 40 ఏళ్లలో రెండు గ్రామాలు సముద్రం పాలయ్యాయి. ‘పాత బియ్యపు తిప్ప’ గ్రామాన్ని సముద్రం తొలుత పూర్తిగా కబళించింది. సముద్రగర్భంలోకి వెళ్లిపోయిన ఈ గ్రామం ఆనవాళ్లేవీ ఇప్పుడు కనిపించవు. గ్రామస్తులు తరలివెళ్లి మెరక ప్రాంతంలో బియ్యపుతిప్ప పేరుతో గ్రామం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఆ తర్వాత ‘పాత చినమైనవాని లంక’ వంతు వచ్చింది. 130 కుటుంబాలతో కళకళలాడిన ఈ గ్రామంలో పాఠశాల, రామాలయం, ఆరోగ్య ఉపకేంద్రం ఉండేవి. ఎర్రబస్సు కూడా వచ్చేది.
ఈ గ్రామాన్ని సముద్రం మింగేయడం 1992 తర్వాత వేగవంతమైంది. 20 ఏళ్లనాడు తుపాను షెల్టర్‌ను సముద్ర తీరానికి వెయ్యి మీటర్ల దూరంలో నిర్మించారు. ఇప్పుడు సముద్రం దీని దగ్గరకు వచ్చేసింది. జనం గ్రామాన్ని విడిచిపోయి వేరే చోట ఇళ్లు కట్టుకున్నారు. 2011 వరకూ ఒకటి, రెండు కుటుంబాలు గ్రామంలో ఉండేవి. కొబ్బరి చెట్లు, తుపాను షెల్టరు, మొండిగోడల రామాలయం పాతచిన మైనవాని లంకకు ఆనవాళ్లుగా మిగిలాయి. కొన్నాళ్లుంటే అవీ కనుమరుగవుతాయి. 3 వేలకు పైగా జనాభా కలిగిన పెదమైనవాని లంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. సముద్రం నాలుగేళ్లలో అర కిలో మీటరు ముందుకొచ్చింది. కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామం కొన్నేళ్లలో ఖాళీ అయిపోక తప్పదు. నిస్సహాయంగా పొట్టచేతపట్టుకొని మరో చోటకు వెళ్లడం తప్ప వారికి మరో మార్గం కనిపించడం లేదు.
- న్యూస్‌లైన్, నరసాపురం రూరల్, ప.గో.జిల్లా