చీకట్లో చక్కెర కర్మాగారం | Dark sugar factory | Sakshi
Sakshi News home page

చీకట్లో చక్కెర కర్మాగారం

Published Sun, Mar 8 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

Dark sugar factory

నిధులున్నా విద్యుత్ బిల్లులు చెల్లించని అధికారులు
ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టేందుకే కరెంట్ కట్
కార్మికులను బయటకు గెంటడమే లక్ష్యం
20 రోజులుగా అంధకారంలో కార్మికుల నివాసాలు
మంత్రి పీతల సుజాతకు చెప్పినా ప్రయోజనం శూన్యం
కలెక్టర్‌తో మాట్లాడుకోమంటున్న ఎండీ  పట్టించుకోని జిల్లా కలెక్టర్

 
చిత్తూరు చక్కెర కర్మాగారం కార్మికులు 20 రోజులుగా విద్యుత్ లేక చీకట్లో  మగ్గుతున్నా అటు కర్మాగారం పాలక వర్గంగానీ, ఇటు జిల్లా అధికారులుగానీ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కార్మికులను ఖాళీ చేయించి చక్కెర కర్మాగారాన్ని అమ్మకానికి  పెట్టేందుకే ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

చిత్తూరు: రెండు నెలల విద్యుత్ బిల్లులు చెల్లించలేదంటూ  విద్యుత్ శాఖవారు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం తోపాటు దాని పరిధిలోని కార్మికుల నివాసగృహాల(క్వార్టర్స్)కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 20 రోజులుగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కర్మాగారం పరిధిలో నివసిస్తున్న 80కి పైగా కార్మిక కుటుంబాలు చీకట్లో నానా కష్టాలు పడుతున్నాయి. విద్యుత్ సౌకర్యం లేక తాగునీరు కూడా అందే పరిస్థితి కేకుండా పోయింది.  ఒక వైపు పిల్లలకు పరీక్షల సమయం కావడం, చీకట్లోనే ఉండాల్సి రావడంతో వారి చదువులు సాగడంలేదు. దీంతో కార్మికుల కటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కర్మాగారంలో కోట్లాది రూపాయల విలువైన సామగ్రి ఉంది. విద్యుత్ లేకపోవడంతో  సామగ్రి  దొంగతనానికి గురయ్యే అవకాశాలు అధికం. గతంలో  కార్మికుల ఇళ్లలో సైతం దొంగలు దోపిడీకి పాల్పడిన సంఘటనలు కోకొల్లలు.  ఇటీవల కర్మాగారం ఇన్‌చార్జ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డీఆర్వో  విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయం పట్టించుకోవడంలేదు. కార్మికులు పలుదఫాలు విన్నవించినా ఆయన స్పందించిన పాపాన పోలేదు. పైగా కలెక్టర్‌తో మాట్లాడుకోమంటూ ఎండీ ఉచిత సలహా ఇచ్చి తప్పించుకుంటున్నారు. కలెక్టర్ వద్దకు వెళితే ఎండీని కలవమంటున్నారు. వారం రోజులుగా కార్మిక కుటుంబాలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నా సైతం చేశారు. ఇటీవల జిల్లాకు వచ్చిన మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాతను సైతం కలిసి న్యాయం చేయాలని మహిళలు మొరపెట్టుకున్నారు.  స్పందించిన మంత్రి చక్కెర కర్మాగారానికి  విద్యుత్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అయినా కలెక్టర్ పట్టించుకోలేదు.

కార్మికులను తరిమేసేందుకే కరెంట్ కట్

కర్మాగారం ఆవరణలో కాపురముంటున్న కార్మికులను బయటకు పంపేందుకే అధికారులు, పాలకవర్గం  కలిసి  విద్యుత్ సరఫరాను నిలిపివేయించినట్లు సమాచారం. కర్మాగారాన్ని అమ్మకం లేదా లీజుకు అప్పగించేందుకు ఇప్పటికే సిద్ధమైన ప్రభుత్వం ఈ తంతును పూర్తిచేసేందుకు డీఆర్వోకు ఇన్‌చార్జ్ ఎండీ బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఎండీగా బాధ్యతలు చేపట్టిన డీఆర్వో ఇప్పటికే కార్యాచరణకు దిగి  కార్మికులను  కర్మాగారం నుంచి బయటకు పంపేందుకు సిద్ధమైనట్లు సమాచారం.  కార్మికులు ఫ్యాక్టరీ పరిధిలోనే కాపురం ఉంటే  ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటారని, అందుకే ముందు కార్మికులను అక్కడి నుంచి వెళ్లేలా చేయాలని అధికారులు వ్యూహం పన్నారు.

ఇందులో భాగంగానే తొలుత బకాయిలు చెల్లించలేదనే సాకుతో కార్మికుల నివాస గృహాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయించినట్లు తెలుస్తోంది. విద్యుత్ లేకపోతే కార్మికులు ఎక్కువ కాలం అక్కడ ఉండే పరిస్థితి లేదు. విద్యుత్ బకాయిలు * 7 లక్షలు మాత్రమే ఉన్నాయి. కర్మాగారం పరిధిలో ఉన్న కల్యాణమండపం ఖాతాలో దాదాపు * 39 లక్షల రూపాయలు నిధులు ఉన్నట్లు కార్మికులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో  రెండు నెలల విద్యుత్ బకాయిలు చెల్లించడం కష్టమేమీ కాదు. కానీ అధికారులు బకాయిలు చెల్లించడంలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement