
పట్టపగలే ఆభరణాల అపహరణ
- షాపు తెరుస్తుండగా ఎత్తుకెళ్లిన దుండగులు
- చోరీ సొత్తు రూ.8 లక్షలు
ఎస్.రాయవరం : మండల కేంద్రం ఎస్.రాయవరం బజారులో బుధవారం పట్టపగలే దుండగులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ సంఘటనపై స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలివి. గ్రామంలోని బజారు షాపింగ్ కాంప్లెక్స్‌లో పర్సవేది వెంకటరమణ సాయి జ్యుయలరీ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు.
బుధవారం వెంకటరమణ షాపు తెరచేందకు వచ్చారు. తన చేతిలోని ఆభరణాల బ్యాగును పక్కనపెట్టి షట్టరు తెరచేందుకు ప్రయత్నించారు. ఇంతలో దొంగలు గుట్టుచప్పుడు కాకుండా బ్యాగును అపహరించుకు పోయారు. షాపు తెరచి వెంకటరమణ బ్యాగుని గమనించే సరికి బ్యాగు కనిపించలేదు. ఆ బ్యాగులో సుమారు రూ 8 లక్షలు విలువచేసే బంగార వస్తువులు, రూ 10 నగదు ఉన్నాయంటూ యజమాని లబోదిబోమన్నాడు.
రోజూ షాపు మూసే ముందు విలువైన బంగారం నగలు బ్యాగులో సర్దుకుని ఇంటికి తీసుకెళ్లి, మర్నాడు ఉదయం షాపు తెరచేముందు షాపుకి తీసుకువస్తామని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న యలమంచిలి సీఐ మళ్లేశ్వరరావు, నర్సీపట్నం ఏఎస్పీ సత్యేసుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ చోరీ మిస్టరీని ఛేదించి బాధితునికి న్యాయం చేస్తామని ఏఎస్పీ విలేకరులకు తెలిపారు. కాగా ఆభరణాల బ్యాగును ఎత్తుకెళ్లిన దుండగులు మోటారు సైకిల్‌పై పరారయినట్టు స్థానికులు చెబుతున్నారు.