పట్టపగలే దోపిడీ | Daylight robbery | Sakshi
Sakshi News home page

పట్టపగలే దోపిడీ

Published Sun, Sep 13 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

Daylight robbery

♦ అప్పాడిప్యూటీ డెరైక్టర్ రత్నపై దాడి
♦ బంగారం, రూ. 2 వేల నగదు అపహరణ
♦ చికిత్స కోసం నెల్లూరు అపోలోకు తరలింపు
 
 గూడూరు/నెల్లూరు(అర్బన్) : సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో పట్టపగలే దారుణం... హైదరాబాద్‌లోని అప్పాలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌ఎం రత్నపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి బంగారం, నగదు అపహరించాడు. సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయాణిస్తున్న ఆమెపై  నెల్లూరు రైల్వే స్టేషన్‌లో రైలు కదులుతుండగా దుండగుడు అకస్మాత్తుగా ప్రవేశించి దాడి చేశాడు.

 అసలేం జరిగింది?
 సూళ్లూరుపేటకు చెందిన అప్పాలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న రత్న చెన్నైకు వెళ్లేందుకు చార్మినర్ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ చేసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే సరికి రైలు వెళ్లిపోవడంతో గూడూరు వరకూ వచ్చేందుకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లోని వికలాంగుల బోగీలో ఎక్కారు. ఉదయం 9 గంటల సమయానికి రైలు నెల్లూరుకు చేరుకోవడంతో బోగీలోని వికలాంగులందరూ దిగారు.. బోగీలో ఆమె ఒక్కరే మిగిలారు. కదులుతున్న రైలులోకి ఓ దుండగుడు అకస్మాత్తుగా ఎక్కి మనుబోలు దాటిన తర్వాత ఆమెపై తీవ్రంగా దాడిచేసి రెండు బంగారు గొలుసులు, రెండు గాజులు, రెండు ఉంగరాలతో పాటు రూ. 2 వేల నగదు, ఐడీకార్డులు లాక్కొని.. చల్లకాలువ దగ్గర రైలు నెమ్మదిగా వెళుతుండటంతో దిగి పారిపోయాడు. గూడూరు రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఆమె అరుపులు విని పక్కబోగీ ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ రత్నను మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలోకు తరలించారు.  

 ఆయుధాలు లేకుండా ఎలా ప్రయాణం?
 సాధారణంగా ఐపీఎస్ హోదా పొంది తే తగిన సెక్యూరిటీతో ప్రయాణం చేస్తారు. కనీసం ఆయుధాన్నైనా పక్కన ఉంచుకుంటారు. అలాంటిది ఏమరుపాటుతో అదీ ఒంటరిగా ఎవరూ లేని వికలాంగుల బోగీలో ప్రయాణించడమే ఆమె చేసిన పాపమైంది.  పట్టపగలే ఒక అధికారి దొంగల బారిన పడ్డారంటే  రైళ్లలో భద్రతా లోపాలు మరోసారి వెలుగుచూశాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement