హైదరాబాద్: ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా డీసీ గోవిందరెడ్డి బుధవారం తన నామినేషన్ పత్రాలు అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. ఏపీ ఎమ్మెల్సీ నాలుగు స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగున్నాయి. నామినేషన్లు ఉపసంహరణ గడువు ఈ నెల 23తో ముగియనుంది.
డీసీ గోవిందరెడ్డి గతంలో రోడ్డు రవాణాశాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించి డీసీ గోవిందరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు మే 14వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంతో శాసనమండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు పెరిగాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అకస్మిక మృతి చెందారు. దాంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.