పంచాయతీ నామినేషన్ల గడువు పూర్తి
Published Tue, Jan 7 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
శ్రీకాకుళం సిటీ,న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 18న జరగనున్న పలు పంచాయతీల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో మొత్తం 18 మండలాల్లోని 8 గ్రామ సర్పంచ్‌లు, 76 వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 3 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజునే అత్యధికంగా దాఖలయ్యాయి. 8 సర్పంచ్‌లకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు కాగా, అందులో కంచిలి మండలం శాసనం సర్పంచ్ స్థానానికి 2, బుడితి (సారవకోట)కు 5, కొల్లివలస (ఆమదాలవలస)కు 7, చల్లయ్యవలస (పోలాకి)కు 6, సంతబొమ్మాళి సర్పంచ్ స్థానానికి 7 నామినేషన్లు దాఖలు కాగా, బుడుమూరు (లావేరు) స్థానానికి ఒకేఒక్క నామినేషన్ దాఖలయ్యింది.
కోటబొమ్మాళి మండలంలోని పట్టుపురం గ్రామ సర్పంచ్ స్థానంతో పాటు, పంచాయతీలో ఉన్న మొత్తం 8 వార్డులకు కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అలాగే, కొత్తూరు మండలంలో ఎన్నికలు జరగాల్సిన పొన్నుటూరు సర్పంచ్, 7వవార్డు స్థానాలకు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. ఇక వార్డు సభ్యుల స్థానాల్లో మొత్తం 76 వార్డులకు గాను 67 నామినేషన్లు దాఖలయ్యాయి. మెళియాపుట్టి మండలం గంగరాజుపురంలో ఎన్నికలు జరగాల్సిన 4,5 వార్డులకు, సారవకోట మండలం తొగిరిలోని 3,4,7 వార్డులకు, అలాగే కరడశింగిలో 1,4,7 వార్డులకు, రామకృష్ణపురంలో 7వ వార్డుకు, లావేరు మండలం పెదరావుపల్లిలో 2వార్డు, కోటబొమ్మాళి మండలం కస్తూరిపాడులో 7వ వార్డు, దంతలోని 4వవార్డుకు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. నేడు ఉదయం 11 గంటల నుంచి అధికారుల సమక్షంలో నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ జరుగనుంది.
పట్టుపురంలో ఎన్నిక లేనట్టే
కోటబొమ్మాళి: మండలంలోని పట్టుపురం పంచాయతీలోని సర్పంచ్, 8 వార్డులకు, దంతలోని నాలుగో వార్డు, కస్తూరిపాడులో ఏడో వార్డుకు నామినేషన్లు వేయలేదు. ఈ సారికూడా ఎన్నికలు లేనట్టేనని ఎన్నికల అధికారి చింతాడ లక్ష్మీబాయి తెలిపారు. ఈ పంచాయతీల్లో గడిచిన జూలైలో కేటాయించిన రిజర్వేషన్లే మళ్లీ కేటాయించడంతో సంబంధిత కేటగిరీకి చెందిన అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పంచాయతీల్లో ఉన్న ఏనేటికొండలు సామాజిక వర్గానికి చెందిన వారికి గడచిన 2002 వరకు రెవెన్యూ యంత్రాంగం ఎస్టీలుగా కులధ్రువపత్రాలను మంజూరు చేసినా, తర్వాత కాలం నుంచి ధ్రువపత్రాలను జారీచేయడం నిలిపివేసింది. గత ఎన్నికల్లోనూ ఇదే రిజర్వేన్‌పై ఒక్క నామినేషనూ దాఖలుకాక ఎన్నిక ఆగిపోగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంతో మళ్లీ అదే రిజర్వేషన్లు కేటాయించడంతో మళ్లీ నామినేషన్లు పడలేదని ఆయా గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఎస్టీలు లేనప్పుడు వారికి ఎలా రిజర్వు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement