బాలుడు జారిపడిన నేల బావి , యువకిరణ్
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: ఆడుకుంటూ నేలబావిలో పడిన బధిర బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. మండలంలోని హుకుంపేట గ్రామానికి చెందిన కొమర యువ కిరణ్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. బధిరుడైన యువకిరణ్ ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఆడుకుంటున్నాడు. సమీపంలోనే పురాతన బావి నందపైకి ఎక్కడంతో దానిపై నుంచి జారి బావిలో పడిపోయాడు. కేకలు వేయలేని స్థితిలో గంట పాటు బావిలోనే ఉండిపోయాడు. అటుగా వెళ్లిన కొమర సింహాచలం అనే యువకుడు.. బావిలోకి దూకాడు. ఇంతలో గ్రామస్తులందరూ కలసి బావిలో నిచ్చెన వేసి ఇద్దరనీ బయటకు తీశారు. బావిలో మోకాలు ఎత్తులో తక్కువ స్థాయిలో నీరు ఉందని, దీనివల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని స్థానికులు వివరించారు. పూర్తిస్థాయిలో నీరు ఉంటే ప్రమాదమే జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బావి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రాణాపాయం నుంచి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ బావిని మూసివేయాలని లేనిపక్షంలో వాడుకలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment