తాను బతికున్నానని రేషన్, ఆధార్, పింఛను కార్డులు చూపిస్తున్న వనుం సుబ్బాయమ్మ పంచాయతీ కార్యదర్శి నారాయణాచార్యులు మంజూరు చేసిన డెత్ సర్టిఫికెట్
రామచంద్రపురం రూరల్:ఆమె బతికుంది. పింఛను సొమ్ము అందుకుంటోంది. కానీ ఆమె చనిపోయినట్టుగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది.అతడు బతికున్నాడు. భార్యను విడిచిపెట్టి వేరే ఊరిలో ఉంటున్నాడు. అయితే అతను చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు.ఇలా రామచంద్రపురం మండలంలో పలు గ్రామాల్లో బతికుండగానే చనిపోయినట్టుగా కొందరు పంచాయతీ కార్యదర్శులు డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామానికి చెందిన వనుం సుబ్బాయమ్మకు ప్రస్తుతం 66 ఏళ్లు. ఆమె ప్రభుత్వం అందిస్తున్న పింఛను తీసుకుంటోంది. గత ఏడాది మార్చిలో ఆమె చనిపోయినట్టుగా పంచాయతీ కార్యదర్శి బి.నారాయణాచార్యులు డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. విశేషమేంటంటే సుబ్బాయమ్మది తాళ్లపొలం గ్రామమైతే పక్క గ్రామమైన ఉట్రుమిల్లికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఈ డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. ఆధార్ కార్డు నంబరు, ఇంటి నంబరు, భర్త పేరు, అన్నీ ఒక్కటే కానీ, కేవలం గ్రామం పేరు మాత్రమే మార్చి ఈ డెత్ సర్టిఫికెట్ మంజూరు చేయడం గమనార్హం. అయితే దీని మంజూరు వెనుక గల కారణాలు తెలియరాలేదు.
ఇక్కడ కూడా..
తాళ్లపొలం గ్రామానికే చెందిన మరో మహిళను ఆమె భర్త విడిచిపెట్టి వేరే గ్రామంలో ఉంటున్నాడు. అయితే ఆమె రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉట్రుమిల్లి అడ్రస్‌కు మార్పించి, ఆమె భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశారని చెబుతున్నారు. ఈ అక్రమ డెత్ సర్టిఫికెట్ల మంజూరు వెనుక కారణాలను ఉన్నతాధికారులు బయటపెట్టాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment