అతివేగం ప్రాణాలు తీసింది | Death of four engineering students in Road Accident | Sakshi
Sakshi News home page

అతివేగం ప్రాణాలు తీసింది

Published Tue, Jan 1 2019 4:57 AM | Last Updated on Tue, Jan 1 2019 7:10 PM

Death of four engineering students in Road Accident - Sakshi

ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు వేగాన్ని చూపుతున్న స్పీడోమీటర్, మృతులు ధనుష్, సాయిరాం, షేక్‌ గఫూర్, కోటేశ్వరరావు(ఫైల్‌)

సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్‌/గుంటూరు ఈస్ట్‌: అప్పటివరకూ ఆనందంగా గడిపిన స్నేహితులు కొన్ని క్షణాల్లో మృత్యుఒడిలోకి చేరుకున్నారు. సరదాగా షాపింగ్‌కు వెళదామని ప్రయాణమైన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.కళాశాలకు వెళ్లొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన తమ కుమారులను మృత్యువు కబళించింది అని తెలిసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలోకి మునిగిపోయారు. కొన్ని నిమిషాల ముందు తరగతి గదిలో తమకు అడ్వాన్స్‌ హ్యాపీ న్యూ ఇయర్‌ అని చెప్పిన స్నేహితులు ఇక తిరిగిరారని తెలుసుకున్న తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు.

మితిమీరిన వేగం.. తరగతులకు తిరిగి హాజరవ్వాలనే ఆతృత నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. గుంటూరు రూరల్‌ మండలంలోని లాలుపురం శివారు ప్రాంతంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు బీటెక్‌ విద్యార్థులు దుర్మరణం పాలుకాగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గుంటూరు రూరల్‌ మండలం చౌడవరం గ్రామంలోని ఆర్‌వీఆర్‌ జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం (ఈసీఈ) చదువుతున్న గుంటూరు విద్యానగర్‌కు చెందిన సాదినేని వెంకట సుబ్బారావు కుమారుడు సాదినేని ధనుష్‌ (18), శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామ శివారు తుమ్మలగుంట గ్రామ మాజీ సర్పంచ్‌ గుంటూరు సాంబశివరావు కుమారుడు కోటేశ్వరరావు (19), పెదకూరపాడు మండలం, కంభంపాడు గ్రామానికి చెందిన చిరుమామిళ్ల రమేశ్‌ కుమారుడు సాయిరాం(18), పిడుగురాళ్లకు చెందిన షేక్‌ బాలసైదా కుమారుడు షేక్‌ గఫూర్‌ (18) మృతి చెందగా, గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఆలోకం తారక్‌ హీరేంద్ర, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దొప్పలపూడి సత్య కౌశిక్, ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన ఆళ్ల శివాజీ గాయపడ్డారు. 

సంఘటన జరిగిందిలా...
ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్‌ క్లాస్‌ లేకపోవడంతో గుంటూరు నగరంలో న్యూఇయర్‌ షాపింగ్‌ చేసుకుని తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వేరే క్లాస్‌కు హాజరవుదామని తోటి విద్యార్థి దొప్పలపూడి సత్య కౌశిక్‌కు చెందిన ఏపీ27 బీటి 0567 నంబర్‌ గల ఐ–20 కారులో బయల్దేరారు. అయితే కారు గుంటూరు నగర శివారులోని బైపాస్‌ చేరుకోగానే విజయవాడలో షాపింగ్‌ చేద్దామని నిర్ణయించుకుని కారు ఎన్‌హెచ్‌16 మీదుగా అటువైపు మళ్లించారు. హైవే రెండు కిలోమీటర్లు ప్రయాణించాక ముందు వెళ్తున్న మున్సిపల్‌ చెత్త తరలించే లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి లారీ వెనుక భాగంలో కారు బలంగా ఢీ కొంది. అప్పటికే 160 కి.మీ వేగంలో ఉన్న కారు పక్కనే ఉన్న డివైడర్‌ ఎక్కి సుమారు 30 మీటర్లు దూసుకెళ్లి డివైడర్‌లోని స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం సుమారు 20–30 అడుగుల ఎత్తులో గాలిలో పల్టీలు కొట్టుకుంటూ 50 మీటర్ల దూరంలో పడింది. కారు ఢీకొట్టడంతో లారీ సైతం బైపాస్‌ ఎడమ వైపునున్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో లారీ డ్రైవర్‌ దేవరపల్లి కిరణ్‌కుమార్, క్లీనర్‌ దూపాటి రాంచరణ్, మున్సిపల్‌ కార్మికుడు భూపతి రుద్రయ్య గాయపడ్డారు. వీరికి గుంటూరు జీజీహెచ్‌లో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం డిశ్చార్జి చేశారు.  

ఘటనా స్థలంలో ముగ్గురి మృతి...
కారు నుజ్జునుజ్జు కావడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. కారు వేగానికి వీరి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. తీవ్ర గాయాలపాలైన షేక్‌ గఫూర్‌ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. తీవ్ర గాయాలపాలైన తారక్‌ హీరేంద్రను మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్‌ నుంచి స్థానిక రమేశ్‌ హాస్పిటల్‌కు తరలించారు. సీటు బెల్టు పెట్టుకుని డ్రైవింగ్‌ చేస్తున్న సత్య కౌశిక్‌  క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు, ఏఎస్పీ వైటీ నాయుడు వచ్చి పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. సౌత్‌ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, ఆర్డీవో వీరబ్రహ్మం, తహసీల్దారు నాగిరెడ్డి జీజీహెచ్‌కు వచ్చి విచారణ జరిపారు.  

జీజీహెచ్‌ వద్ద మిన్నంటిన రోదనలు 
రోడ్డు ప్రమాదం ఘటన సమాచారం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, సహ విద్యార్థులు, మిత్రులు పెద్ద సంఖ్యలో జీజీహెచ్‌కు చేరుకున్నారు. మృతిచెందిన, గాయపడిన విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గఫూర్‌ తండ్రి బాలసైదా, తల్లి సైదాబి, బంధువులు తమ కుమారుడి మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించారు. తాము ఇంకెవరి కోసం జీవించాలంటూ కన్నీరు మున్నీరయ్యారు. ధనుష్‌ తండ్రి వెంకటసుబ్బారావు ఇంటి వద్దే కుప్పకూలి పడిపోయారు. కోటేశ్వరరావు తండ్రి సాంబశివరావు, తల్లి మల్లేశ్వరి మార్చురీలోని కుమారుడి మృతదేహం చూసి పడిన వేదన వర్ణనాతీతం. చిరుమామిళ్ల సాయిరామ్‌ తండ్రి రమేష్‌బాబు గుండెలవిసేలా రోదించి స్పృహ తప్పిపడిపోగా, ఆయన్ను వాహనంలో కంభంపాడుకు తరలించారు. 

రోడ్డు ప్రమాదాల్లోనే ఇద్దరు కుమారులను కోల్పోయిన ధనుష్‌ తల్లిదండ్రులు
పట్నంబజారు (గుంటూరు): ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఇద్దరు కుమారులినీ రోడ్డు ప్రమాదాలే బలితీసుకున్నాయి. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందిన పెద్ద కుమారుడి స్మృతులను మరువలేకుండా ఉన్న సాధినేని వెంకట సుబ్బారావు, జ్యోతి దంపతులకు ఇప్పుడు చిన్న కుమారుడు ధనుష్‌ మృతి అంతులేని విషాధాన్ని మిగిల్చింది. బిల్డర్‌ అయిన వెంకటసుబ్బారావు ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు శ్రీకళ్యాణ్‌ (24), చిన్నకుమారుడు ధనుష్‌. చెన్నైలో బీటెక్‌ నాలుగో సంవత్సరం అభ్యసిస్తున్న సమయంలో 2017 డిసెంబర్‌ 16న శ్రీకళ్యాణ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పదిహేను రోజుల క్రితమే శ్రీకళ్యాణ్‌ సంవత్సరీకం జరిగింది. ఆ బాధను మరువక ముందే.. చిన్నకుమారుడు ధనుష్‌ కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని విషయం తెలిసి ఆ దంపతులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మృత్యువాత పడ్డ షేక్‌ గఫూర్‌ తండ్రి బాల సైదా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడి తన కుమారుడిని బీటెక్‌ చదివిస్తున్నాడు. చిన్నతనం నుంచే గఫూర్‌ చదువులో ప్రతిభ చూపేవాడని ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించాడని బంధువులు తెలిపారు. సివిల్స్‌ లక్ష్యమని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.  

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌ 
గుంటూరు జిల్లాలో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృతి చెందారన్న విషయం తెలిసి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించి పోయారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement