
రుణమాఫీపై కాలయాపన చేయడం దారుణం
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోట: రైతుల రుణమాఫీ హామీ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలయాపన చేయడం దారుణమని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోటమ్మ మహోత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం కోటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు నీతినిజాయితీల కంటే పదవే ముఖ్యమని ఆరోపించారు. అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు స్పష్టత లేని నిర్ణయాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు సంబంధించి అన్ని రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. ఆ హామీని నమ్మి ప్రజలు ఓట్లేశారన్నారు. గెలిచిన తర్వాత ప్రజలకు ముఖం చాటేస్తున్నారన్నారు. రుణమాఫీకి పరిమితులు రూపొందిస్తూ కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్నాన్నారు. తీసుకున్న రుణం మాఫీ కాక కొత్తరుణం పొందలేక రైతులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. మరో వైపు బ్యాంకర్లు రైతులకు నోటీసులు పంపుతున్నారన్నారు. మూడు రోజులుగా చంద్రబాబు వెల్లడిస్తున్న విషయాలు వివిధ పత్రికల్లో వస్తున్న వార్తలను చూసి రైతుల కన్నీరుమున్నీరవుతున్నారన్నారు. చిన్న రైతులెవరో, పెద్ద రైతులెవరో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు. రైతురుణాలను ఆంక్షలు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా, చేనేత రుణాలనూ మాఫీ చేయాలన్నారు.
నిరుద్యోగ భృతి రూ.రెండువేలు, వ్యవసాయానికి తొమ్మిది గంటల కరెంటు, ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వాలన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో పరిపాలన కొనసాగిస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తెలుగు ప్రజల మనోగతమన్నారు. రాజధాని విషయంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉద్యోగుల కాలపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన బాబు, నిరుద్యోగుల విషయంలో నోరుమెదపకుండా ఉండడం శోచనీయమన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి వెంట మండల కన్వీనర్ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, కోట సర్పంచ్ రాఘవయ్య, జగదీష్‌కుమార్‌రెడ్డి, నర్రమాల వెంకటరమణయ్య, పలువురు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.