సాక్షి, అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించిపంపితే శాసనమండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బుధవారం మండలి చైర్మన్ వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నిబంధనలు పాటించకుండా చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారన్నారు. మండలిలో అధికార పార్టీ ఎమ్మెల్సీలతో పాటు, బీజేపీ, పీడీఎఫ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు అందరూ సెలెక్ట్ కమిటీని వ్యతిరేకించినా ఒక టీడీపీ కార్యకర్తలాగా చైర్మన్ వ్యవహరించి ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చారన్నారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసే బిల్లులను అడ్డుకునే అధికారం మండలికి లేదని, కేవలం ఆ బిల్లులపై అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు మాత్రమే చెప్పేహక్కు ఉందన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు అర్హతలేని వారందరినీ దొడ్డిదారిన రాజ్యాంగ పదవుల్లో కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తమను ఉద్దేశించి మాట్లాడుతూ తాగి వచ్చారని అన్నారని, యనమల వ్యాఖ్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళితే నారా లోకేష్ తనపైకి దురుసుగా వచ్చారని వెల్లడించారు.
చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చోని సెల్‌ఫోన్‌లో సూచనలు ఇస్తూ చైర్మన్‌ను ప్రభావితం చేశారని చెప్పారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మండలి పరిణామాలను ఎల్లోమీడియా వక్రీకరించి కథనాలు రాసిందని, తప్పు చేశానని చైర్మనే చెప్పినా కూడా ఆ పత్రికలు ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. ఆ రెండు పత్రికలు రాష్ట్రాన్ని శాసిస్తాయా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అప్రజాస్వామ్యిక విధానాలు అమలు చేస్తుంటే ఎలా సమరి్థంచాలని, దీనిపై ప్రజాస్వామ్యవాదులంతా చర్చించాలని అన్నారు. తాము ప్రజాబలంతో రాజ్యాంగబద్ధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment