సీఈసీ కోర్టుకు కేబినెట్‌ బంతి! | Decision to send a letter to the CEC to allow the Cabinet to meet | Sakshi
Sakshi News home page

సీఈసీ కోర్టుకు కేబినెట్‌ బంతి!

Published Fri, May 10 2019 1:53 AM | Last Updated on Fri, May 10 2019 5:11 AM

Decision to send a letter to the CEC to allow the Cabinet to meet - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ(కేబినెట్‌) సమావేశం ఈ నెల 14వ తేదీన జరుగుతుందా? లేదా? అనేది కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నిర్ణయంపై ఆధారపడి ఉంది. ముఖ్యమంత్రి కా ర్యాలయం(సీఎంవో) పంపిన నాలుగు ఎజెండా అంశాలతో ఈ నెల 14న కేబినెట్‌ భేటీ నిర్వహణకు అనుమతించాలంటూ సీఈసీకి లేఖ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది. ‘‘ఫొని తుపాను సçహాయక చర్యలు, రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, కరువుతోపాటు వాతావరణ పరిస్థితులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ఉపాధి పరిస్థితి అనే అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి ఆయా శాఖల అధికారులంతా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయండి’’అంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మంగళవారం లేఖ సమర్పించిన విషయం విదితమే. దీనిని ఆయన సాధారణ పరిపాలన(జీఏడీ–పొలిటికల్‌) కార్యదర్శితోపాటు ఆయా శాఖల కార్యదర్శులకు పంపించి, గురువారం స్క్రీనింగ్‌ కమిటీ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఈ నాలుగు అజెండా అంశాలపై చర్చించిన సీఎస్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ సీఎంవో పంపిన ఎజెండాను యథాతథంగా ఆమోదించి, సీఈసీ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించింది. ‘‘ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇచ్చి, ఈ నాలుగు అజెండా అంశాలపై ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనుమతించాలి’’అని కోరుతూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేది ద్వారా నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.
 
కొత్తగా విధానపరమైన  నిర్ణయాలు తీసుకోలేరు  
స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయం మేరకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ పంపుతారు. దీనిని సీఈవో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. లేఖ అందిన 48 గంటల్లోగా కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల బృందం సమావేశమై, ఈ వినతిని పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్‌ నిర్వహించాల్సిన అవసరం ఉందా? లేదా? అంత ప్రాధాన్యం ఉందా? అనే అంశాలను సీఈసీ బృందం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. సీఈసీ అనుమతిస్తే ఈ నెల 14న కేబినెట్‌ సమావేశం ఉంటుంది. తిరస్కరిస్తే ఉండదు. ‘‘ఇప్పుడు బంతి సీఈసీ కోర్టుకు చేరింది. సీఈసీ కోర్టులో అది గోల్‌ అవుతుందో, ఫౌల్‌ అవుతుందో తేలాల్సి ఉంది’’అని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అన్నారు. ఒకవేళ 14వ తేదీన కేబినెట్‌ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతించినా.. ఎజెండాలోని నాలుగు అంశాలపై చర్చించడం తప్ప కొత్తగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదని మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement