సాక్షి, అమరావతి: వ్యసనపరులు మద్యం జోలికెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ధరలను భారీగా పెంచి మద్యాన్ని దూరం చేసే ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు కొనుగోళ్లపై పలు నిబంధనలు విధించారు. నగరాలు/పట్టణాల్లో ఆధార్ కార్డు చూపిస్తేనే మద్యం విక్రయాలు జరపనున్నారు. రెడ్‌జోన్లు, కంటైన్మెంట్ క్లస్టర్ల నుంచి వచ్చే వారిని గుర్తించేందుకు ఆధార్ కార్డు చూపాలనే నిబంధన విధించారు. గొడుగులు, మాస్కులు ధరించకుంటే మద్యం విక్రయించరాదనే ఆంక్షలు విధించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లు తగ్గిపోయాయి. కొన్ని చోట్ల దుకాణాలు వెలవెలబోయాయి. చదవండి: మద్యం ఇక హోం డెలివరీ..!
► రాష్ట్రంలో మొత్తం 3,463 మద్యం షాపులుండగా 2,330 దుకాణాలను మాత్రమే తెరిచారు.
► 663 మద్యం దుకాణాలు కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలో ఉండటంతో వీటిని తెరవలేదు. సాంకేతిక కారణాలతో మరో 18 షాపులను తెరవలేదు. ప్రజల ఆందోళనలతో 16 షాపులను, శాంతి భద్రతల సమస్యల కారణంగా 69, ఇతర కారణాలతో 284 మద్యం షాపులను మూసివేశారు. స్టాకు లేకపోవడంతో 83 షాపులు తెరుచుకోలేదు.
ఏటా 25 శాతం పెంచుతాం
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతులిచ్చినట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి దశలవారీగా రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేసి తీరుతారన్నారు. ఇందులో భాగంగానే మద్యం జోలికి వెళ్లాలంటే షాక్ కొట్టేలా ధరలను 75 శాతం పెంచామన్నారు. ఏటా 20 శాతం మద్యం షాపులను తొలగిస్తూ వస్తున్నామని వెల్లడించారు. వీటితో పాటు ఏటా 25 శాతం మద్యం ధరలు పెంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment