
ఎచ్చెర్ల క్యాంపస్ విజయనగరం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం ఇంకా బాలారిష్టాల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వర్సిటీ ఏర్పాటై ఇన్నేళ్లయినా డిగ్రీలో కనీస స్థాయి ఫలితాలు సాధించలేకపోతోంది. కొత్త కొత్త ప్రయోగాలు ఎన్ని చేస్తున్నా ఉత్తీర్ణత శాతం మాత్రం పెరగడం లేదు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మూడు, ఐదు సెమిస్టర్ల క్లాస్ వర్క్ ప్రారంభం కానుంది. గతంలో వార్షిక పరీక్షలు నిర్వహించేవారు.
ప్రస్తుతం సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2016లో సెమిస్టర్ విధానం ప్రారంభం కాగా, ఈ ఏడాది సెమి స్టర్ విధానంలో మొదటి బ్యాచ్ విద్యార్థులు రిలీవ్ అయ్యారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం 2008 జూన్ 25న ఏర్పాటు జరగ్గా, అఫిలియేషన్ కళాశాలలు 2010లో ఏయూ నుంచి విభజించి స్థానిక వర్సిటీకి అప్పగించారు. 2013లో మొదటి డిగ్రీ బ్యాచ్ రిలీవ్ అయ్యింది.
ప్రస్తుతం వర్సిటీ పరిధిలో 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 1 ఎయిడెడ్ కళాశాల, 88 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీ ఫలితాలు మాత్రం ఏటా నిరాశాజనకంగానే ఉన్నాయి.
మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఆరో సెమిస్టర్ పరీక్ష రాసిన విద్యార్థులు 1, 2, 3, 4, 5 అన్ని సెమిస్టర్లలో ఉత్తీర్ణత సాధించి, ఆరో సెమిస్టర్ పాస్ అయితేనే డిగ్రీ పాస్ కిందకు లెక్క. విద్యార్థులు డిగ్రీ చివరి ఏడాది ఐదు, ఆరు సెమిస్టర్లలో 60 శాతం దాటి ఉ త్తీర్ణత సాధిస్తున్నా, బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉండిపోతున్నాయి.
ఆరో సెమిస్టర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి మొదటి సెమిస్టర్‌లో బ్యాక్‌లాగ్‌తో సతమతమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సెమిస్టర్లలో డిటెన్షన్ విధానం లేకపోవటం వల్ల హాజరు ప్రాతిపదికన విద్యార్థులు ఆరో సెమిస్టర్ వరకు ప్రమోట్ అవుతున్నారు. దీంతో చివరి సెమిస్టర్ నాటికి విద్యార్థులకు బ్యాక్ లాగ్ సబ్జెక్టులు ఉండిపోతున్నాయి.
తరగతుల నిర్వహణే ప్రధాన సమస్య
వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ తరగతుల నిర్వహణ ఎక్కడా సక్రమంగా సాగడం లేదు. బయోమెట్రిక్ హాజరు విద్యార్థులకు అమలు చేయనున్నట్లు చెబుతున్నా అమలు మాత్రం జరగడం లేదు. ప్రతి సెమిస్టర్‌కు తప్పని సరిగా 100 రోజులు తరగతులు నిర్వహించాలి. ఈ స్థాయిలో తరగతులు జరగటం లేదు. విద్యార్థులకు హాజరు మాత్రం చాలా కళాశాలల్లో నడుపుతున్నారు. దీంతో ఈ ప్రభావం ఉత్తీర్ణత శాతంపై పడుతుంది. ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ గల విద్యార్థులు చేరుతున్నా ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో రావటం లేదు.
అర్హులు ఉన్నారా..?
ప్రైవేట్ కళాశాలల్లో చాలా కళాశాలల్లో అర్హులైన అధ్యాపకుల కొరత ప్రధాన సమస్యగా ఉంది. పార్ట్ టైం అధ్యాపకులతో తరగతులు నెట్టుకువస్తున్నారు. వేతనాలు తక్కువగా ఇవ్వటం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు మాత్రమే విద్యా ప్రమాణాలు పాటిస్తున్నాయి. కొన్ని కళాశాలలు నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యత బోధనకు ఇవ్వటం లేదు.
దీంతో పరీక్షల్లో ఎక్కువగా కెమిస్ట్రీ, ఫిజిక్స్, గణితం, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఫౌండేషన్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ అన్ని కోర్సులతో పోల్చి చూస్తే డిగ్రీ ఉత్తీర్ణత అట్టడుగున ఉంటోంది.
బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ ఉలా అన్ని కోర్సుల్లో సైతం కనీసం 50 శాతం ఉత్తీర్ణత సాధ్యం కావటం లేదు. ఈ ఏడాది విడుదలైన ఆరో సెమిస్టర్‌లో 9664 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 6032 మంది ఉత్తీర్ణత సాధించారు. 63.74 శాతం ఫలితాలు నమోదు కాగా, 1, 2, 3, 4, 5 సెమిస్టర్లతో బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉన్న కారణంగా 34.77 శాతం మంది వరకు మాత్రమే రిలీవ్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment