సీజన్ ముగుస్తున్నా ఊపందుకోని పనులు
పనుల్లేక అల్లాడుతున్న కూలీలు
డిసెంబర్-ఫిబ్రవరి మధ్య
గతేడాది 39.36 లక్షల పనిదినాలు, 3.73 లక్షల మందికి పనులు
ఈ ఏడాది అదే సీజన్‌లో 8.24 లక్షల పనిదినాలు,
90 వేల మందికే పనులు
పేరుకుపోయిన రూ.3.5 కోట్ల బకాయిలు
అడిగిన వారికల్లా ఉపాధి కల్పించాలన్న ఆశయంతో ప్రారంభించిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. అడిగినవారికి దేవుడెరుగు.. అసలు పనుల కల్పనే ఆశించినస్థాయిలో జరగడం లేదు. పనుల్లేక ఉపాధి కూలీలు అల్లాడి పోతున్నారు. ఒక పక్క ఉపాధి పనుల్లేక..మరోపక్క వ్యవసాయ పనుల్లేక వలసబాట పట్టే పరిస్థితి ఏర్పడింది.
విశాఖపట్నం: ఉపాధి హామీ పథకం గ్రామీణ జిల్లాలోని 39 మండలాల్లో అమలవుతోంది. ఈ పథకం కింద 4,69,090 జాబ్‌కార్డులు జారీచేశారు. జిల్లాలో 31,503 శ్రమ శక్తి సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్) ఉండగా వాటిపరిధిలో 6,74,809 మంది కూలీలున్నారు. ఏటా డిసెంబర్‌లో ఉపాధి పనులు ప్రారంభమవుతుంటాయి. సరాసరిన నాలుగులక్షల మంది కూలీలకు డిసెంబర్ -మార్చి లోపు ఏటా 70 లక్షలకు పైగా పనిదినాలు కల్పిస్తుంటారు. వీరికి వేతనాల కింద సుమారు 75 కోట్ల వరకు చెల్లిస్తుంటారు. కానీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 20 వరకు చూస్తే ఇప్పటి వరకు కేవలం 90,056 మంది కూలీలకు 8,24,006 పనిదినాలు మాత్రమే కల్పించగలిగారు. అదే గతేడాది(2013-14)లో ఇదే సీజన్‌లో డిసెంబర్- ఫిబ్రవరిల మధ్య 3,73,466మంది కూలీలకు 39.36లక్షల పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.39.57కోట్లు చెల్లించారు. కానీ ఈ ఏడాది ఇదే సీజన్‌లో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు రూ.9.31కోట్లు మాత్రమే. జనవరి నుంచి పనిచేసిన సుమారు 35 వేల మంది కూలీలకు రూ.3.50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో...
2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇదే సీజన్‌లో నెల వారీగా చూస్తే డిసెంబర్‌లో 50,527మంది కూలీలకు 6,59,180 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనం కింద రూ.6 కోట్ల 65 లక్షల 90 వేలు చెల్లించారు. జనవరిలో 1,19,688 మంది కూలీలకు 12,29,429 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.11 కోట్ల 26లక్షల 77వేలు చెల్లించారు. ఇక ఫిబ్రవరిలో 2,03, 251 మంది కూలీలకు ఏకంగా 20,48,232 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ. 21కోట్ల 64లక్షల 36వేలు చెల్లించారు. ఇక ఆర్ధిక సంవత్సరం ముగింపు నెల మార్చిలో 77,217 పనుల కల్పన ద్వారా 2,76,694 మంది కూలీలకు ఆ సీజన్‌లోనే అత్యధికంగా 31లక్షల 90వేల 422 పనిదినాలు కల్పించారు. ఈమేరకు వీరికి వేతనాల రూపంలో ఏకంగా రూ.35 కోట్ల 19 లక్షల 49 వేలు చెల్లించారు.
కానరాని పనుల జాడ
2014-15 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌లో 20,564 మంది కూలీలకు 2,28,833 పనిదినాలుకల్పించారు. వీరికి వేతనాల కింద రూ.2కోట్ల 50లక్షల 14వేలు చెల్లించాల్సి ఉంది. జనవరిలో 29,859 మంది కూలీలకు 3,07,618 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల రూపంలో రూ.3 కోట్ల 35 లక్షల 19 వేలు చెల్లించాల్సి ఉంది. ఇక ఫిబ్రవరిలో 39,634 మంది కూలీలకు 2,87,555 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.3 కోట్ల 46 లక్షల 44 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా గ త మూడు నెలల్లో రూ.9 కోట్ల 31 లక్షల 77 వేలు వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.5.85 కోట్లు మాత్రమే చెల్లించారు. గతేడాది మార్చి వరకు చూస్తే పనులు చేసిన 6,50,160 మంది కూలీలకు ఏకంగా 71 లక్షల 27 వేల 263 పనిదినాలు కల్పించగలిగారు. ఈ లెక్కన వేతనాల కింద ఏకంగా రూ.74.76 కోట్లు చెల్లించారు. కానీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం 90,056 మందికి 8,24,006 పనిదినాలు కల్పించగలిగారు. మరో 40రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున గతేడాది స్థాయిలో పనులు కల్పించడం సాధ్యమయ్యే పని కాదని అధికారులే అంగీకరిస్తు న్నారు.
నీరసించిన ఉపాధి
Published Sat, Feb 21 2015 11:57 PM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement
Advertisement