డెల్టా ఆధునికీకరణ హుళక్కేనా?
మచిలీపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.118 కోట్లు కేటాయించడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. శివారు ప్రాంతాలకు కాలువల ద్వారా సక్రమంగా సాగునీరు అందించాలనే లక్ష్యంతో డెల్టా ఆధునికీకరణకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్లుగా ఆధునికీకరణ పనులు సక్రమంగా జరగడం లేదు. గత ప్రభుత్వం రూపొందించిన ఈ పనులను పక్కనపెట్టి ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుల సూచనల మేరకు కాలువ పనులు చేస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పడం, అందుకు అనుగుణంగా వ్యవహరించడం విమర్శలపాలవుతోంది.
ఈ వేసవిలో జిల్లాలోని ప్రధాన కాలువల ఆధునికీకరణకు తగిన ఏర్పాట్లు జరగలేదు. జనవరిలోనే కాలువలకు నీటి విడుదలను నిలి పివేసినా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు అవసరమైన యంత్రాలు, మెటీరియల్, కూలీలను ఇంకా సిద్ధం చేయని పరిస్థితి. ప్రస్తుతం కేఈబీ కాలువకు రామచంద్రాపురం, పులిగడ్డ, అవనిగడ్డ, నాగాయలంక తదితర ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ రోడ్డు వెంబడి కాలువకు రిటైనింగ్ వాల్ పనులు చేస్తున్నారు. ఆధునికీకరణ నిధులను రిటైనింగ్ వాల్‌కు మళ్లించడం గమనార్హం. గతంలో చేసిన ఆధునికీకరణలో వంతెనలు, వాటికి అప్రోచ్‌లు నిర్మించటం వంటి పనులు అధికంగా చేశారు. మట్టి పనులు, కాలువ లైనింగ్ పనులు అంతంతమాత్రంగానే చేసి చేతులు దులుపుకొన్నారు. మట్టిపని, పూడికతీయటం, కాలువ లైనింగ్, కాలువగట్ల బలోపేతం, రెగ్యులేటర్లు, స్లూయిస్‌ల నిర్మాణం వంటి పనులు చేయాల్సి ఉంది.
ప్రభుత్వ స్పందన ఏదీ?
గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లలో కాలువలకు నీరు సక్రమంగా విడుదల చేయలేదు. వర్షాధారంగానే రైతులు పంటలను సాగు చేశారు. రాష్ట్రం విడిపోయిన అనంతరం సాగునీటి ప్రాజెక్టులు, డెల్టా ఆధునికీకరణపై దృష్టిసారించాల్సిన పాలకులు, రాజకీయ పక్షాలు ఆ దిశగా ముందుకెళ్లడం లేదనే వాదన రైతు సమాఖ్య నాయకుల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో రూ. 30 వేల కోట్లతో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు టెండర్లు పిలిచింది. పాలమూరు ప్రాజెక్టును నిర్మిస్తే డెల్టాకు మరింత కష్టకాలం అని రైతుసంఘ నాయకులు అంటున్నారు.
సెంట్రల్ డివిజన్ పరిధిలో
సెంట్రల్ డివిజన్ పరిధిలో బందరు కాలువ, ఈస్ట్‌సైడ్ కాలువ, రామరాజుపాలెం కాలువ, అప్పర్ పుల్లేరు కాలువ, కేఈబీ కాలువలున్నాయి. వీటి పరిధిలో 2,87,60 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రకాశం బ్యారేజీ కూడా సెంట్రల్ డివిజన్ పరిధిలోనే ఉంది. ప్రకాశం బ్యారేజీ దిగువన ఆప్రాన్ నిర్మించేందుకు రూ. 3150 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఈ పనులకు అనుమతులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ సెంట్రల్ డివిజన్ పరిధిలో కేటగిరీ-ఎలో 117 పనులు రూ. 2.22 కోట్లతో చేయాలని నిర్ణయించారు. బందరు కాలువ 77 కిలోమీటర్ల దూరం మేర ఉండగా పనులు చేపట్టలేదు.
కృష్ణా తూర్పు విభాగం పరిధిలో
కృష్ణా తూర్పు విభాగం పరిధిలో ఏలూరు కాలువ, రైవస్ కాలువ, దోసపాడు కాలువ, గుడివాడ చానల్‌కు సంబంధించిన పనులను తొమ్మిది ప్యాకేజీలుగా విభజించారు. రూ. 641 కోట్ల విలువైన పనులు చేయాల్సిఉండగా ఇప్పటివరకు రూ. 225 కోట్ల విలువైన పనులు చేసినట్లు చెబుతున్నారు. వీటిలో అధిక శాతం రెగ్యులేటర్లు, కల్వర్టులు, రిటైనింగ్ వాల్ వంటి పనులు అంతంతమాత్రంగానే చేశారు.
ఉప్పునీటికయ్యలుగా మారతాయా
కాలువ శివారు ప్రాంతాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో డెల్టా ఆధునికీకరణకు రూపకల్పన చేయగా ఈ పనులు ముందుకు సాగని పరిస్థితి ఉంది. సముద్ర తీరంలోని పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో సాగుకు యోగ్యమైన భూములు రానున్న రోజుల్లో ఉప్పునీటి కయ్యలుగా మారే అవకాశం ఉందనే వాదన వ్యవసాయ రంగ నిపుణుల నుంచి వినబడుతోంది. గుడివాడ, పామర్రు నుంచి ఎగువకు బోరు నీటి ఆధారంగా వ్యవసాయం చేస్తుండగా.. తీరప్రాంతంలో ఈ అవకాశం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులకు భవిష్యత్తు కష్టమే. ఇందుకోసం నీరు-చెట్టు కార్యక్రమం, ఫామ్‌పాండ్స్ పనులు చేపడితే నగదు మిగులుతుండటంతో ఆ దిశగానే పాలకులు, అధికార పార్టీ నాయకులు దృష్టిసారించటం గమనార్హం.