ఇరిగేషన్(vs) టీడీపీ
►ముదిరిన వివాదం
►ఇరిగేషన్ ఎస్‌ఈపై బదిలీ వేటు...?
►టీడీపీ కార్యాలయానికి స్థలమివ్వలేదంటూ ఆరోపణ
►ఎన్‌ఎస్‌పీ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఆపలేదని అక్కసు
►పట్టించుకోని ఎస్‌ఈ శారద
►శారదపై ఇప్పటికే ఇరిగేషన్ మంత్రికి ఫిర్యాదు
►బదిలీ కోసం ఒత్తిడి
►తనకా విషయం తెలియదంటున్న ఇరిగేషన్ సీఈ వీర్రాజు
ఒంగోలు: టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ ఇరిగేషన్ అధికారుల మధ్య వివాదం పతాకస్థాయికి చేరింది. పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని అప్పగించలేదన్న అక్కసుతో ఇరిగేషన్ ఎస్‌ఈ శారదను బదిలీ చేయించేందుకు టీడీపీ జిల్లా నేత ఇరిగేషన్ మంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు–కర్నూలు హైవే పక్కన సర్వే నం.88లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) 1.92 ఎకరాల విలువైన స్థలం ఉంది. స్థలానికి తూర్పు వైపున ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ కార్యాలయం, పడమర వైపున నాగార్జున యూనివర్సిటీ, దక్షిణం వైపున నెల్లూరు–కర్నూలు హైవే ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ స్థలం విలువ సుమారు రూ.25 కోట్లకుపైనే ఉంటుంది.
ప్రస్తుతం ఈ స్థలంలో రూ.5 కోట్ల నిధులతో ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఒక్కొక్క ఫ్లోర్ 9 వేల చ.అ.ల ప్రకారం రెండు ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. పనులు వేగవంతం చేశారు. అయితే ఆ విలువైన స్థలంపై జిల్లా అధికార పార్టీ నేత కన్నుపడింది. టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం పేరుతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. 99 సంవత్సరాల లీజు కింద తొలుత స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రతిపాదించారు. ఒక ఎకరం స్థలానికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 1.92 ఎకరాల స్థలానికి నెలకు రూ.1800 లీజు కింద చెల్లించే పద్ధతిలో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించాలంటూ తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో దామచర్ల జనార్ధన్ ఇరిగేషన్ ఎస్‌ఈ, సీఈలపై అధికార పార్టీ నేత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికీ ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కావటంతో తామేమీ చేయలేమంటూ ఇద్దరూ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో స్థలం కోసం జనార్ధన్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో ముందు ఎన్‌ఎస్‌పీ భవన నిర్మాణాన్ని ఆపాలని ఆ తర్వాత ఇరిగేషన్ మంత్రి పేషీ ద్వారా స్థలం కోసం అనుమతులు తెప్పిస్తామంటూ టీడీపీ జిల్లా నేత ఎస్‌ఈ శారదపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో ఎస్‌ఈపై అధికార పార్టీ నేత మరింత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పైగా ఎస్‌ఈ శారద కరణం బలరాం వర్గీయురాలంటూ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్న దామచర్ల వర్గం టీడీపీ కార్యాలయానికి స్థలమివ్వలేదన్న సాకు చూపి ఆమె బదిలీకి పట్టుపట్టినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా శారదను బదిలీ చేయించేందుకు సరైన కారణం దొరక్కపోవడంతో జనార్ధన్ మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఈ స్థల వివాదంపై సీఈ వీర్రాజును ‘సాక్షి’ ప్రశ్నించగా ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ కార్యాలయ భవన నిర్మాణం వేగవంతం చేసినట్లు చెప్పారు. ఎన్‌ఎస్‌పీ స్థలం టీడీపీకి ఇవ్వాలన్న అధికార పార్టీ ఒత్తిడి విషయం ఎస్‌ఈ శారదకు మాత్రం తెలుసు అని అన్నారు.
ఒంగోలులో ఎన్‌ఎస్‌పీకి సరైన సొంత భవనం కూడా లేదు. ఉన్న భవనాలు చిన్నపాటి వర్షం కురిసినా జలమయమవుతున్నాయి. అధికారులు వర్షాకాలంలో వాటిలో కూర్చొని పని చేసే పరిస్థితి కూడా లేదు. కార్యాలయం ఎదురుగానే ఉన్న 2 ఎకరాల స్థలంలో సొంత భవనాలు నిర్మించుకోవాలన్న ప్రతిపాదన కూడా ఎన్‌ఎస్‌పీ సిద్ధం చేసుకుంది. అయితే విలువైన స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయం పేరుతో సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్న ఎన్‌ఎస్‌పీ కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల కొమ్ముకాస్తూ స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారని అదే శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు విమర్శలు గుప్పించటం గమనార్హం.