ప్రాజెక్టులకు ఆంధ్రా పార్టీల అడ్డుపుల్లలు | Medak TDP leaders into the TRS | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు ఆంధ్రా పార్టీల అడ్డుపుల్లలు

Published Tue, May 10 2016 1:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ప్రాజెక్టులకు ఆంధ్రా పార్టీల అడ్డుపుల్లలు - Sakshi

ప్రాజెక్టులకు ఆంధ్రా పార్టీల అడ్డుపుల్లలు

♦ ధర్నాలు, దీక్షల పేరిట అడ్డంకులు: కేసీఆర్  
♦ సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి మెదక్ టీడీపీ నేతలు
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వడానికి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే ఆంధ్రా పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలు, ధర్నాలు, లేఖలు అంటూ పుల్లలు పెడుతున్నారన్నారు. అందుకే ఆ రెండు పార్టీలు తెలంగాణలో ఖాళీ అయ్యాయని, జనం వాటిని తిరస్కరిస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు టీడీపీ ఇన్‌చార్జి ఎం.సపాన్‌దేవ్, పట్టణ అధ్యక్షుడు ఎం.విశ్వనాథం, నాయకులు ఎం.రవీందర్, మిరాజ్‌ఖాన్, భాస్కర్‌రెడ్డి, ఫరీదుద్దీన్, జగన్, చంద్రశేఖర్, మల్లేశం తదితరులు సోమవారం సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

 ఏవీ కొత్త ప్రాజెక్టులు కావు...
 ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు పక్క రాష్ట్రాలతో నిత్యం చర్చలు జరిపి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం చేశారన్నారు. అయితే ప్రాజెక్టులు ఎట్లయినా ఆపాలని ఆంధ్రా పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. కరెంటు చార్జీల పెంపు, నీటి పంపిణీలో వివక్షను నిరసిస్తూనే తాను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకున్నామని, దాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజక్టులు ఏవీ కొత్తవి కావని, సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, సీఎంలు జీవోలు ఇచ్చిన ప్రాజెక్టులేనని తెలిపారు. సమైక్య ఏపీలో నీరు పారకుండా ప్రాజెక్టులు డిజైన్ చేశారని, తాము తెలంగాణలో ఎప్పటికీ నీటి ప్రవాహం ఉండేలా ప్రాజెక్టులు కడతామన్నారు. రాజకీయాల్లో పనిచేసేవారు ఆషామాషీగా వ్యవహరించవద్దని, ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చేలా పనిచేయాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు బి.వి.పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సీఎం రాజకీయ సలహాదారు సుభాష్‌రెడ్డి, మురళీ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement