
అంతంత మాత్రంగా ఎగుమతులకు సిద్ధమవుతున్న ఆకివీడులో ప్యాకింగ్ కేంద్రం
లాభాలు లేవంటున్నారు దళారులు.. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదంటున్నారు ఎగుమతిదారులు.. కొనలేకపోతున్నామంటున్నారు వినియోగదారులు.. ఇదీ మార్కెట్‌లో చేపల కథ.. ప్రస్తుతం వీటి ధర చుక్కలనంటుతోంది.. బెత్తులు సైతం కిలో రూ.5 పలుకుతున్నాయి.. ప్రస్తుతం పండుగల సీజన్.. నాన్‌వెజ్‌లకు పెద్ద డిమాండ్ ఉండదు.. కానీ చేపల ధర మాత్రం పెరిగిపోతోంది.. ఎందుకో ఎవరూ సరిగ్గా చెప్పడం లేదు. ఆవివరాలు ఏమిటో చూద్దాం రండి.
సాక్షి, ఆకివీడు(పశ్చిమగోదావరి) : మార్కెట్‌లో ఆదివారం కిలో చేప ధర రూ.120 నుంచి 130 వరకూ పలికింది. శీలావతి, కట్ల చేపలతో పాటు శీతల్, ఫంగస్ ధరలు కూడా అధికంగా ఉన్నాయి. కొరమేను దొరకడమే కష్టంగా ఉంది. వీటి ధర కిలో రూ.650 పలకుతోంది. థిలాఫీ(చైనా గురక) చేప కిలో రూ.50 నుంచి 70 పలకడంతో వ్యాపారులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు. థిలాఫీకి మంచి డిమాండ్ పెరిగింది. శీతల్ చిన్న సైజు చేపలు కిలో రూ.250 ఉండగా పెద్ద సైజు చేపలు రూ.650 వరకూ పలుకుతున్నాయి. ఫంగస్ ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఫంగస్ కిలో రూ.70 నుంచి రూ.80 వరకూ ఉంది. బెత్తులు కిలో రూ.40 వరకూ ధర ఉంది.
తగ్గిన పట్టుబడులు
చేపల పట్టుబడులు కొద్ది రోజులుగా తగ్గాయి. జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ, కొల్లేరు తీరంలోనూ చేపల చెరువుల్లో చేపలు పట్టుబడి జరగడంలేదు. చేప సైజు పెరుగుదల కోసం రైతులు పట్టుబడులు చేయడం లేదు. చేపల మేత, పచ్చి చెక్క తదితర వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి. చేపల పెంపకం కన్నా రొయ్యల సాగుపై రైతులు దృష్టి పెట్టడంతో చేపల దిగుబడి పడిపోయింది. మరో నెల తరువాత చేపలకు ఇతర రాష్ట్రాలో డిమాండ్ బాగుంటుందని ఎగుమతులు కూడా తగ్గించేశారు. దీపావళి అమావాస్య ప్రభావంతో పాటు కార్తీక మాసంలో చేపకు ఉత్తరాది రాష్ట్రాల్లో అంతగా డిమాండ్ ఉండదని చెబుతున్నారు.
సన్నగిల్లిన ఎగుమతులు
జిల్లా నుంచి రోజూ 200లకు పైగా లోడులతో చేపల లారీలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం 30 నుంచి 50 లారీల చేపల ఎగుమతి కూడా జరగడం లేదు. వచ్చే నెల నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. జిల్లా నుంచి అస్సోం, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చేపలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి.
డిమాండ్ అంతంతమాత్రం
చేపలు ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఎగుమతులకు అవకాశం లేదు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. పండుగల సీజన్ వల్ల డిమాండ్ అంతగా లేదు.
–గంటా సుబ్బారావు, ఎగుమతి ఏజెంట్, ఆకివీడు
వ్యాపారులకు లాభాల్లేవ్
ఇతర రాష్ట్రాల్లో చేపల ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో చేపల ధర రూ.130 మాత్రమే ఉంది. రవాణా, ప్యాకింగ్, ఇతరత్రా ఖర్చులు పోను వ్యాపారులకు ఏ విధమైన లాభాలు లభించడంలేదు.
–జగ్గురోతు విజయ్‌కుమార్, చేపల ఎగుమతిదారులు
Comments
Please login to add a commentAdd a comment