కాంగ్రెస్ నేతలకు పరాభవం
Published Tue, Sep 17 2013 3:22 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
ఆకివీడు, న్యూస్‌లైన్ : ఆకివీడులో సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన లక్ష గళ గర్జనను విఫలం చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నేతలు సమైక్యవాదుల నుంచి పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సమైక్యాంధ్ర పరిరక్షించాలని కోరుతూ జేఏసీ, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ పోరాట సమితి, సమైక్యవాదులు 15 రోజులుగా లక్ష గళ నిరసన గర్జనకు ఏర్పాట్లు చేశారు. గ్రామ గ్రామానా తిరిగి సమైక్య రాష్ట్రం అవసరాన్ని వివరించారు. లక్ష గళ గర్జన సభా వేదిక వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చీర కట్టినట్టు ఉన్న నర్సాపురం ఎంపీ కనుమూరు బాపిరాజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
జేఏసీ గౌరవాధ్యక్షుడు గొంట్లా గణపతి మాట్లాడుతున్న సమయంలో ఫ్లెక్సీని తొలిగించాలంటూ ఆప్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వర రావు(రత్నం) బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జంపన సుబ్రమణ్య రాజువేదికపైకి దూసుకువచ్చారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వారికి అండగా నిలిచారు. ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారో తమకు తెలియదంటూ జేఏసీ నేతలు వివరిస్తున్నా పట్టించుకోకుండా కాం గ్రెస్ నేతలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిం చారు. ఫ్లెక్సీని తొలగించాలంటూ పట్టుబట్టారు. కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా వేదిక కింద ఉన్న సమైక్యవాదులు నినాదాలు చేశారు. ఎంపీ బాపిరాజు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొంటేనే ఫ్లెక్సీ తొలగిస్తామంటూ వారు పట్టుబ ట్టారు.
దీంతో సమైక్యవాదులు, కాంగ్రెస్ నేతల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చెలరేగింది. ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఈదశలో భీమవరం రూరల్ సీఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో పోలీ సులు రంగ ప్రవేశం చేశారు. వేదికను ఖాళీ చేయాలంటూ ఆందోళనకారులను హెచ్చరించారు. దీంతో వందలాది మంది యువకులు సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సమైక్య ఉద్యమాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు రత్నం, జేఎస్సార్‌తో పోలీసులు చర్చలు జరిపి ఎట్టకేలకు వారిని సభా వేదిక వద్ద నుంచి పంపివేశారు. ఈదశలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, బాపిరాజు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య లక్ష గళ గర్జనకు హాజరైన కొందరు విద్యార్థులకు తొక్కిసలాటలో గాయాలయ్యాయి. అనంతరం లక్ష గళ గర్జన యథావిధిగా కొనసాగి విజయవంతమైంది.
Advertisement
Advertisement