‘సమైక్యం’ కోసం ఏకం కావాలి
Published Mon, Oct 21 2013 6:29 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
పాలకొల్లు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి ఒకే గొడుగుకిందకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. స్థానిక గాందీబొమ్మల సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలకు ఆదివారం ఆయన సంఘీబావం తెలిపి మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, ఈ తరుణంలో పార్టీలకతీతంగా రాజకీయనాయకులు ఏకమై ఉద్యమిస్తేనే కేంద్రప్రభుత్వం దిగివస్తుందన్నారు.
రాజకీయపార్టీల్లో ఉద్యమ స్ఫూర్తి కరువవడం శోచనీయమన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యిందని శేషుబాబు విమర్శించారు. మరో ఎమ్మెల్సీ అంగర రామమోహన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) మాట్లాడుతూ రాష్ట్ర విభజనను సీమాంధ్రలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్‌పార్టీ నాయకులకు పట్టకపోవడం దారుణమన్నారు.
పాలకొల్లు, నరసాపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గిన రామశివరావు అధ్వర్యంలో యడ్ల సత్యనారాయణ, రావెళ్ల నాగయ్య, యర్రంశెట్టి నాగబాబు, బండారు కోటేశ్వరరావు, యనముల సత్యనారాయణ, మండెల రాధాకృష్ణ, దేవరపు పెదకాపు, చిట్టూరి నాగేశ్వరరావు, జి.వేణుగోపాలరావు, చింతపల్లి శ్రీరామమూర్తి తదితరులు రిలే దీక్షలు చేశారు. ఏఎంసీ చైర్మన్ ఉన్నమట్ల కబర్థి, కేఎస్‌పీఎన్ వర్మ, ముచ్చర్ల శ్రీరామ్, జి.వెంకటేశ్వరరావు, ఎస్.పాపారావు సంఘీబావం తెలిపారు.
Advertisement