తెరుచుకున్న ప్రభుత్వ కార్యాలయాలు
Published Sat, Oct 19 2013 3:15 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
ఏలూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్య మం నేపథ్యంలో 66 రోజులపాటు మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం తెరుచుకున్నాయి. ఉద్యోగులంతా విధులకు హాజరుకావడంతో అన్ని కార్యాలయాలు కళకళలాడాయి. ఎన్జీవోలు సమ్మెను తాత్కాలికంగా విరమించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. ప్రతిచోటా పూర్తిస్థాయిలో హాజరు నమోదైంది. కలెక్టరేట్‌లో గల దాదాపు 25 విభాగాలు, ట్రెజరీ, జిల్లా పరిషత్, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, ఏలూరు ఆర్డీవో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల తలుపులన్నీ తెరుచుకున్నాయి.
శుక్రవారం ఉదయాన్నే కార్యాలయ ఆవరణలను శుభ్రం చేయడం, పైళ్లకు పట్టిన బూజుల్ని దులపడం వంటి దృశ్యాలు కనిపించాయి. ఇదిలావుండగా, జ్యుడీషియల్ సిబ్బంది ఈనెల 26 తరువాత తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పడంతో కోర్టు ప్రాంగణాలు తెరచుకోలేదు. ఉద్యమం సందర్భంగా అధికారులు ప్రభుత్వానికి సరెండర్ చేసిన సిమ్ కార్డులను తిరిగి తీసుకున్నారు. రెండు నెలలపాటు నిలిచిపోయిన ఫైళ్లను పరిష్కరించేందుకు ఉద్యోగులు అదనంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. రెవెన్యూ,ట్రెజరీ, పే అకౌంట్స్ ఉద్యోగులు రోజుకు నాలుగైదు గంటల పాటు అదనంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
రూ.450 కోట్ల విలువైన లావాదేవీలు స్తంభన
రాష్ట్రాన్ని విభజించేందుకు సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జీవోలు 66రోజులపాటు అవి శ్రాంతంగా పోరాడారు. ఆగస్టు 12 నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగగా, రెవెన్యూ, పే అండ్ అకౌం ట్స్, ట్రెజరీ, రిజిస్ట్రేషన్లు, ఆర్టీసీ, పశు సంవర్ధక శాఖ, ఆర్‌డ బ్ల్యుఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు సైతం సమ్మెబాట పట్టారు. కాగా సెప్టెంబర్ నెలాఖరు నుంచి ట్రాన్స్‌కో, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు సమ్మెలో భాగస్వాములయ్యారు.
ఈ పరిస్థితుల కారణంగా ట్రెజరీ ద్వారా ఉద్యోగుల జీతాలు, కార్యాలయూల నిర్వహణా బిల్లుల రూపేణా రూ.250 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖల పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి పే అండ్ అకౌంట్ శాఖ ద్వారా చెల్లించాల్సిన బిల్లులు, ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వర్క్‌చార్జిడ్ ఉద్యోగుల జీతాల కింద రూ.200 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. వీటిని పరిష్కరించడానికి నిధులు విడుదల కావాల్సి ఉండటంతో, ప్రభుత్వానికి నివేదించేందుకు అధికారులు ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు.
ఇదిలావుండగా, సమ్మెను తాత్కాలికంగా మాత్రమే విరమించామని, విభజనపై చట్టసభల్లో నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉత్పన్నం అయితే ఆ మరుక్షణమే మెరుపు సమ్మెకు దిగుతామని ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్ హరనాథ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. నిర్విరామంగా సమైక్య ఉద్యమంలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెటింగ్ శాఖలోని ఉద్యోగులందరూ విధుల్లో హాజరై చెక్‌పోస్ట్ తెరిచినట్లు మార్కెటింగ్ సమైక్యాంధ్ర జేఏసీ కో-చైర్మన్ మెహర్రాజ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు.
Advertisement