వైసీపీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీలు
Published Fri, Oct 18 2013 6:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, ఏలూరు : రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినదించాయి. రాష్ట్రం ముక్కలైతే అభివృద్ధి తిరోగమనం బాట పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. విభజన నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యా ప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆటో, మోటార్ సైకిళ్ల ర్యాలీలు నిర్వహించారు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఆటోలు, మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో 300 ఆటోలతో ర్యాలీ చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆటో నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.
పార్టీ నాయకులు మేడిది జాన్సన్, గ్రంధి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం చౌక్‌లోని వైసీపీ దీక్షా శిబిరంలో దొంగపిండి సర్పంచ్ తిరుమాని బాలచంద్రరావుతోపాటు 50 మంది గ్రామస్తులు దీక్షలో పాల్గొన్నారు. చింతలపూడిలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తాజా మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, మరో సమన్వయకర్త కర్రా రాజారావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆటో ర్యాలీ జరిగింది. బోసుబొమ్మ సెంటర్‌లో ఆటోల హారం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. బోసుబొమ్మ సెంటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కొయ్యలగూడెంలో నిర్వహించిన ఆటోల ర్యాలీలో బాలరాజు రిక్షా తొక్కి నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో రిక్షా, ఆటోల ర్యాలీ నిర్వహించారు.
గోపీ రిక్షా తొక్కి నిరసన తెలిపారు. పోలీస్ ఐలండ్ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 70వ రోజుకు చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ నేత విడివాడ రామచంద్రరావు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. తణుకులో రిలే దీక్షలు గురువారం 16వ రోజుకు చేరాయి. గుమ్మంపాడు సర్పంచ్ పెన్మత్స రామరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట నుంచి మలకపల్లి వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీఈసీ సభ్యుడు, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు ర్యాలీని ప్రారంభించారు. కొవ్వూరు మండలంలో మండల కన్వీనర్ ముళ్లపూడి కాశీవిశ్వనాథ్ ఆధ్వర్యంలో ఐ.పంగిడి నుంచి ప్రారంభమైన ఆటో ర్యాలీ పలు గ్రామాల్లో సాగింది. పార్టీ నాయకులు ముదునూరి నాగరాజు, సుంకర సత్యనారాయణ పాల్గొన్నారు. కొవ్వూరు పట్టణంలో ఆటో ర్యాలీని మోషేన్‌రాజు ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పట్టణ కన్వీనర్ మైపాల రాంబాబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిమి హరిచరణ్, పేరిచర్ల బోసురాజు, వర్రే శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ సమన్వయకర్తలు కండిబోయిన శ్రీనివాస్, మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆచంట, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర మండలాల్లో ఆటో, మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగాయి. ఆచంట, పెనుగొండ గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం, నిడమర్రులో నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ చేశారు.
నిడదవోలు, పెరవలిలో ఆటోల ర్యాలీ నిర్వహించారు. పెరవలిలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. పాలకొల్లులో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి దీక్షలను పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్ ప్రారంభించారు. ఉండిలో ఆటో ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సర్రాజు పాల్గొన్నారు. గోపాలపురంలో ఆటోలు, సైకిల్ రిక్షాల ర్యాలీ నిర్వహించారు. దెందులూరు నియోజవర్గ సమన్వయకర్తలు చలుమోలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు దెందులూరు, పెదవేగి మండలాల్లో ఆటో ర్యాలీలు నిర్వహించారు.
Advertisement