Akividu
-
క్లిక్ చేస్తే రూ.2.67 లక్షలు కొల్లగొట్టారు!
ఆకివీడు: వాట్సాప్‌లో వస్తున్న లింక్ మెసేజ్‌లు బ్యాంకు ఖాతాదారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని దుంపగడప గ్రామ శివారు పల్లెపాలెం వాసి కొల్లేటి హరిబాబుకు ఇలాంటి ఘటనే ఎదురైంది. దీంతో శనివారం ఆకివీడు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు..హరిబాబుకు స్థానిక స్టేట్‌బ్యాంకులో ఖాతా ఉంది. ‘ఎకౌంట్ బ్లాక్ అయింది. లింక్‌ను క్లిక్ చేయండి’ అంటూ డిసెంబర్ 15న మెసేజ్ రావడంతో ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. అనంతరం అతని ఖాతాలో ఉన్న రూ.2,67,928 నగదు వేరే ఖాతాకు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అతడు బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అక్కడి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బీవై కిరణ్‌కుమార్ తెలిపారు. ఇటువంటి మెసేజ్‌లను ఓపెన్ చేయవద్దని, లింక్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. -
ఆకివీడులో ప్రైవేటు ఆసుపత్రి సీజ్
ఆకివీడు: అనుమతులతో పాటు, వైద్యులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రిలో సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ పి.బాలు, నర్సాపురం డిప్యూటీ వైద్యాధికారి ప్రసాద్‌లు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీ చేపట్టినట్టు బాలు చెప్పారు. రమేష్ అనే వ్యక్తి తన పేరుతోనే ఆస్పత్రి నడుపుతున్నారని, దీనికి ప్రభుత్వ అనుమతుల్లేవన్నారు. తనిఖీ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంపై ప్రశ్నించగా.. కోవిడ్ కారణంగా రావడం లేదని నిర్వాహకులు చెప్పినట్టు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న మందుల షాపును కూడా సీజ్ చేసినట్టు డాక్టర్ బాలు వివరించారు. దీనిపై రమేష్ మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. -
శీతల్ చేప ధర ఎంతో తెలుసా!
సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి) : శీతల్ చేపలు మార్కెట్లో తళుక్కు మంటున్నాయి. సముద్ర జాతికి చెందిన ఈ చేపల్ని చెరువుల్లో పదుల సంఖ్యలో వేసి పెంచుతున్నారు. ఇది పూర్తి మాంసాహారి చేప. శీతల్ చేప చెరువుల్లోని గురకల్ని, ఇతర చిన్న చేపల్ని తినేస్తుంది. దీంతో ఇది భారీ సైజులో పెరుగుతుంది. 3 కిలోల నుండి 8 కిలోల పైబడి బరువు తూగుతుంది. కిలో చేప ధర రూ.350 వరకూ స్థానిక మార్కెట్లో పలుకుతోంది. కేరళ, అసోం, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఈ చేపకు డిమాండ్ అధికంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం స్థానిక హోల్‌సేల్ మార్కెట్‌కు 5 కిలోల శీతల్ చేపలు అమ్మకానికి తీసుకువచ్చారు. -
చేప చేప.. నువ్వైనా చెప్పవే..!
లాభాలు లేవంటున్నారు దళారులు.. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదంటున్నారు ఎగుమతిదారులు.. కొనలేకపోతున్నామంటున్నారు వినియోగదారులు.. ఇదీ మార్కెట్లో చేపల కథ.. ప్రస్తుతం వీటి ధర చుక్కలనంటుతోంది.. బెత్తులు సైతం కిలో రూ.5 పలుకుతున్నాయి.. ప్రస్తుతం పండుగల సీజన్.. నాన్‌వెజ్‌లకు పెద్ద డిమాండ్ ఉండదు.. కానీ చేపల ధర మాత్రం పెరిగిపోతోంది.. ఎందుకో ఎవరూ సరిగ్గా చెప్పడం లేదు. ఆవివరాలు ఏమిటో చూద్దాం రండి. సాక్షి, ఆకివీడు(పశ్చిమగోదావరి) : మార్కెట్లో ఆదివారం కిలో చేప ధర రూ.120 నుంచి 130 వరకూ పలికింది. శీలావతి, కట్ల చేపలతో పాటు శీతల్, ఫంగస్ ధరలు కూడా అధికంగా ఉన్నాయి. కొరమేను దొరకడమే కష్టంగా ఉంది. వీటి ధర కిలో రూ.650 పలకుతోంది. థిలాఫీ(చైనా గురక) చేప కిలో రూ.50 నుంచి 70 పలకడంతో వ్యాపారులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు. థిలాఫీకి మంచి డిమాండ్ పెరిగింది. శీతల్ చిన్న సైజు చేపలు కిలో రూ.250 ఉండగా పెద్ద సైజు చేపలు రూ.650 వరకూ పలుకుతున్నాయి. ఫంగస్ ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఫంగస్ కిలో రూ.70 నుంచి రూ.80 వరకూ ఉంది. బెత్తులు కిలో రూ.40 వరకూ ధర ఉంది. తగ్గిన పట్టుబడులు చేపల పట్టుబడులు కొద్ది రోజులుగా తగ్గాయి. జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ, కొల్లేరు తీరంలోనూ చేపల చెరువుల్లో చేపలు పట్టుబడి జరగడంలేదు. చేప సైజు పెరుగుదల కోసం రైతులు పట్టుబడులు చేయడం లేదు. చేపల మేత, పచ్చి చెక్క తదితర వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి. చేపల పెంపకం కన్నా రొయ్యల సాగుపై రైతులు దృష్టి పెట్టడంతో చేపల దిగుబడి పడిపోయింది. మరో నెల తరువాత చేపలకు ఇతర రాష్ట్రాలో డిమాండ్ బాగుంటుందని ఎగుమతులు కూడా తగ్గించేశారు. దీపావళి అమావాస్య ప్రభావంతో పాటు కార్తీక మాసంలో చేపకు ఉత్తరాది రాష్ట్రాల్లో అంతగా డిమాండ్ ఉండదని చెబుతున్నారు. సన్నగిల్లిన ఎగుమతులు జిల్లా నుంచి రోజూ 200లకు పైగా లోడులతో చేపల లారీలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం 30 నుంచి 50 లారీల చేపల ఎగుమతి కూడా జరగడం లేదు. వచ్చే నెల నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. జిల్లా నుంచి అస్సోం, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చేపలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. డిమాండ్ అంతంతమాత్రం చేపలు ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఎగుమతులకు అవకాశం లేదు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. పండుగల సీజన్ వల్ల డిమాండ్ అంతగా లేదు. –గంటా సుబ్బారావు, ఎగుమతి ఏజెంట్, ఆకివీడు వ్యాపారులకు లాభాల్లేవ్ ఇతర రాష్ట్రాల్లో చేపల ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో చేపల ధర రూ.130 మాత్రమే ఉంది. రవాణా, ప్యాకింగ్, ఇతరత్రా ఖర్చులు పోను వ్యాపారులకు ఏ విధమైన లాభాలు లభించడంలేదు. –జగ్గురోతు విజయ్‌కుమార్, చేపల ఎగుమతిదారులు -
సత్రం భూములు స్వాహా
సాక్షి, ఆకివీడు (పశ్చిమ గోదావరి): సత్రం భూములంటే చులకన ఎందుకో. పూర్వం సత్రాలను ఏర్పాటు చేసి, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు సత్రాలను ఏర్పాటు చేశారు. సత్రానికి వచ్చే జనంకు ఉచితంగా భోజన వసతి కల్పించేవారు. ఆ ప్రకారంగా నూజివీడు జమిందారులు తమ ఆధీనంలో ఉన్న భూముల్ని సత్రాలకు, దేవాలయాలకు, అర్చకులకు దారాధత్తం చేశారు. తీపర్రు గ్రామంలోని ఈడ్పుగంటి రత్తమ్మ సత్రంకు నూజివీడు జమిందారులు 19 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. సేవా తత్పరతతో ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథలకు, దూర ప్రయాణికులకు వసతులు కల్పించేందుకు ఈ సొమ్మును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. తీపర్రులోని ఈడ్పుగంటి రత్తమ్మ సత్రంకు చెందిన భూమి ఆకివీడు మండలంలోని పెదకాపవరం గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో 19 ఎకరాల మాగాణి భూమి ఉంది. దీని ద్వారా సత్రంకు ఏటా రూ.3.35 లక్షలు ఆదాయం వస్తుంది. రెండు పంటలు పుష్కలంగా పండే పంట భూమి ఏడాదికి ఎకరాకు రూ.20 వేలు లీజు చెల్లిస్తున్నారు. సత్రం భూమి అన్యాక్రాంతం సత్రం భూమి అన్యాక్రాంతం అయ్యింది. సరిహద్దుల్లో ఉన్న రైతుల ఆక్రమణల్లో కుంచించుకుపోతోంది. సత్రం భూమిలో సరిహద్దు రైతు బోరు వేసి తన రొయ్యల చెరువుకు ఉప్పునీటిని తోడుకుంటున్నారు. మరో రైతు కూడా సత్రం భూమిలో అనధికారికంగా బోరు వేశారు. నేనేమీ తక్కువ కాదన్నట్లు మరో సరిహద్దు రైతు ఇంకో రెండు మెట్లు ఎక్కి తన రొయ్యల చెరువుకు ఏకంగా రోడ్డు మార్గాన్నే నిర్మించేశారు. తన చెరువుకు అనువుగా రోడ్డు కూడా నిర్మించారు. మరో సరిహద్దు రైతు తన రొయ్యలచెరువుకు సత్రం భూమిలో విద్యుత్ స్తంభాలు పాతుకుంటూ వెళ్లిపోయి, విద్యుత్ సరఫరా పొందారు. సత్రం భూమిని ఇలా నాలుగు వైపులా ఉన్న సరిహద్దు దారుల ఆక్రమణల చెరలోకి వెళ్లిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సత్రం భూములు సన్నగిల్లి, కుంచించుకుపోతాయని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్రం భూముల ఆక్రమణలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నోటీసులిస్తాం తీపర్రులోని ఈడుపుగంటి రత్తమ్మ సత్రం భూములు పెదకాపవరంలో 19 ఎకరాలున్నాయి. దీనిలో 3 ఎకరాలు చెరువుల సాగుతో నిరుపయోగంగా ఉంది. మరో 16 ఎకరాల భూమిలో వరి సాగుకు లీసుకు ఇచ్చాం. ఎకరాకు రూ.20 వేలు చొప్పున ఏడాదికి రూ.3.64 లక్షలు ఆదాయం వస్తుంది. అన్యాక్రాంతమైన సత్రం భూముల ఆక్రమణదారులకు నోటీసులు అందజేస్తాం. తమ భూముల్ని పరిరక్షించాలని, తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్, ట్రాన్స్‌కో ఏఈడీకి ఫిర్యాదు చేస్తాం. త్వరలోనే సర్వే చేసి సత్రం భూముల్ని రక్షించుకుంటాం. – ఎం.వెంకట్రావు, కార్యనిర్వాహణాధికారి, కానూరు -
ఆకివీడులో వైఎస్ఆర్సీపీ కార్యలయం ప్రారంభం
-
ఆకివీడు జన్మభూమి కార్యక్రమంలో రసాభాస
-
చంద్రబాబుపై టీడీపీ మహిళా కార్యకర్తలు ఫైర్
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని ఆకివీడు మండలం కుప్పనపూడిగ్రామంలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి వచ్చిన అధికారులు, ప్రజాపతినిధులపై సొంత పార్టీ మహిళా కార్యకర్తలే విరుచుపట్టారు. 2015లో ఇల్లు కట్టుకున్న తమకు రూ. 60 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను మోసం చేశారని గగ్గోలు పెట్టారు. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేస్తే తాను మాట్లాడుతానని ఓ మహిళా కార్యకర్త అన్నారు. తమకు న్యాయం చేయకపోతే ఎమ్మెల్యే శివ ఎదురుగా టీడీపీ సభ్యత్వ పుస్తకాలను చింపేస్తామని హెచ్చరించారు. దివంగత నేత వైఎస్సార్‌కు అన్యాయం చేసి టీడీపీకి మద్దతు తెలిపినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. -
నవరత్నాలు అమలు చేస్తాం..
-
ఆక్వా రైతులను ఆదుకుంటా: వైఎస్ జగన్
సాక్షి, ఆకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా) : నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో దారుణంగా చితికిపోయిన రొయ్యల, చేపల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రొయ్యల రైతులకు అండగా సముద్ర తీరానా కోల్డ్ స్టోరేజ్, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. యూనిట్ కరెంటును రూపాయిన్నరకే అందజేస్తామని, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. సీడ్ కొనుగోళ్ల నుంచి రైతు తన పంటను అమ్ముకునే దాకా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను కూల్చేస్తామని, నిర్ణీత కాలంలోగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. 171వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చెరకు రసం కాదు..తాగే నీరు.. ‘‘రైతన్నలు, నా దగ్గరకు వచ్చి.. అన్నా ఇద్దరి నాయకుల గురించి చెబుతామన్నా..ఒకరు నాన్నగారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారన్నా.... విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారన్నా.. నాన్న గారి హయాంలో ఈ నియోజకవర్గంలో 800 కోట్ల పనులు జరిగాయన్నా.. నీరు లేవంటే ప్రాజెక్టులతో ముందుడుగేశాడన్నా అని చెప్పారు. ఇంకో నేత సీఎం చంద్రబాబు నాయుడన్నా.. జిల్లాలోని 15 నియోజక వర్గాలను కట్టబెట్టమన్నా.. అయినా ఈ పెద్ద మనిషి చేసిందేమిలేదన్నా.. ఒక్కరోడ్డు వేయలేదన్నా.. మంచినీళ్లు దొరకని పరిస్థితుల్లో తాగుతున్న నీళ్లు ఇవ్వన్నా అని ఆవేదన చెందుతూ.. బాటిల్ చూపించారు. ఆ బాటిల్ చూపిస్తూ.. చెరకు రసం కాదు చంద్రబాబు గారు తాగె మంచినీళ్లు. చుట్టూ నీళ్లు కనిపిస్తాయి.. తాగాడానికి గుక్కెడుండవ్.. నీటి కోసం ప్రజలు దీక్షలు చేయడానికి పోతుంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. చుట్టు నీళ్లు కనిపిస్తాయి. తాగడానికి గుక్కెడుండవ్. బోర్లు వెస్తే ఉప్పునీరు.. నీరు లేక చేపల చెరువులు సైతం రొయ్యల చెరువుగా మార్చుతున్నారు. జలాలన్ని పూర్తిగా కలుషితమయ్యాని ఎలా బతకాలన్నా అని అడుగుతున్నారు. నాన్న గారి హయాంలో పైపులైన్ల ద్వారా నీళ్లు తీసుకురావాలని దానివల్ల చెరువులు నింపాలని, ఓ స్వప్నాన్ని చూశామన్నా. ముప్పై కిలోమీట్లరు పైపు లైను నాన్నగారున్నప్పుడే జరిగింది. ప్రత్యేక పైపులైన్ల ద్వారా గ్రామాలకు కూడా వచ్చాయి. నాన్న గారి మరణాంతరం పట్టించుకునే నాదుడేలేడన్నా అని వాపోతున్నారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇవ్వరు.. పేదలకు మూడు సెంట్ల భూమి ఇవ్వడానికి సిద్దపడరు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు 350 ఎకరాలు ఇస్తారు. అది కూడా కొటిన్నర విలువ చేసే భూమిని కేవలం రూ.12.50 లక్షలకే కట్టపెడుతారు. నాలుగేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదు. కానీ చెరువులు కబ్జా చేసి మల్టీప్లెక్స్‌లు కడుతాడంటారు. వైఎస్ఆర్ హయాంలో వేల ఇళ్లు కట్టిస్తే.. నాలగేళ్లలో ఒక్క ఇళ్లు కూడా కట్టివ్వలేదు. మీ పాలనలో తాగు నీటికి నెలకు రూ.600 నుంచి 700 ఖర్చుపెడితే.. అన్ని వసుతులు కల్పించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిది రామరాజ్యం కాదా. దళారీ వ్యవస్థతో మోసం.. మధ్దతు ధర లేక రైతన్నలు వరి అమ్ముకుంటున్నారు. ఆక్వా పంట చేతికొచ్చి అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కేజీ రొయ్య 460 ఉండాల్సి రెండు వందలు కూడా పలకడం లేదు. కేజీ చేపలు 110 ఉండాల్సింది 80 కూడా పలకకుండా ఇబ్బంది పడుతున్నారు. పంట చేతిరాక ముందు ధరలు బాగుంటాయని, చేతికి వచ్చిన తర్వాత వ్యాపారులు ఒక్కటై రేటు తగ్గిస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. బాబు దళారీలతో కుమ్మక్కై ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. వర్షకాలం తప్ప నీరు అందుబాటులో ఉండటం లేదు. కాలువల్లో నీరు కనబడక అవస్థలు పడుతున్నారు. రొయ్యలు, చేపలు బతికించుకోవడానికి చెరువులు తవ్వితే నీరు కలుషితమవుతున్నాయి. చేపలు, రొయ్యలు, ఉత్పత్తి లేదని, హ్యార్చరీలు పుట్టగొడుగుల్లా వెలిసాయని, నాణ్యత లేని సీడ్స్ ఇస్తున్నారని, నాణ్యత పరీక్షించుకోవడానికి వెళ్తే ప్రభుత్వ ల్యాబ్‌లు మూసేశారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నియంత్రణ, నాణ్యత లేకపోవడంతో రైతులు మోసపోతున్నారు. మద్దతు ధర లేదు.. కానీ దాణ రేటు మద్దతు ధరలేక అవస్థ పడుతుంటే రొయ్యల, చేపల దాణరేటు మాత్రం విపరీతంగా పెరుగుతుందన్నా అని వాపోతున్నారు.. సోయాబిన్, ఫిష్ ఆయిల్, నువ్వులు, ముడిపదార్థల రేటు తగ్గినా కూడా దాణా రేటు మాత్రం తగ్గడం లేదని అంటుంటే పట్టించుకునే నాదుడు లేడు. దాణా ధరలపై నియంత్రణ ఉంటే రైతులకు మేలు జరిగేది. 15 నియోజకవర్గాలు కట్టబెడితే అండగా ఉండాల్సిన బాబు నాశనం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్, ఫుడ్‌ప్రాసెసింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం.. వైఎస్ఆర్ హయాంలో యూనిట్ కరెంట్ రూ. 90 పైసలుంటే.. ప్రస్తుతం రూ. 3.90 పైసలు వసూలు చేస్తున్నారన్న అని ప్రజలు వాపోతున్నారు. ఆక్వా రంగంలో ఉన్నందరికి ఆ దేవుని ఆశిస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలో వస్తే.. కరెంట్ యూనిట్‌కు 1.50 ఇస్తాము. అనుబంద ఫ్యాక్టరీలు, ఐస్, ప్రాసెంసింగ్ యూనిట్లకు 7 రూ నుంచి 5 రూ.తగ్గిస్తామని హామీ ఇస్తున్నాను. దళారీవ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తాను. అందరికీ తోడుగా ఉంటాను. కోల్డ్ స్టోరేజ్‌లో స్టోర్ చేయగలిగితే ఫుడ్‌ప్రాసెసింగ్‌లు ఉంటే ఈ పరిస్థితి రాదు. వీటిద్వారా 6నెలల వరకు నిల్వ ఉంచవచ్చు. మూడేళ్లలో వీటన్నిటిని సముద్ర తీరాన ఏర్పాటు చేసి మద్దతు ధర తీసుకొస్తాం. ఫోన్ కొడితే మందు బాటిల్.. నాలుగేళ్ల కింద ఎన్నికల్లో బాబు చెప్పిన మాటలను గుర్తుతెచ్చుకోండి. పిల్లలు తాగి చెడిపోతున్నారు అన్నడా లేదా.. అన్నాడు..(ప్రజల సమాధానం), అధికారంలోకి వస్తూ మద్యపాన నిషేదం చేస్తానని, బెల్ట్‌షాప్‌లు లేకుండా చేస్తానని సంతకం కూడా చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్న గ్రామం ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ బెల్ట్ షాప్ లేని ఊరు లేదు. ఈ పెద్ద మనిషి హైటెక్ పాలనలో ఫొన్ కొడితే నీటి బాటిల్ వస్తదో లేదో తెలియదు కానీ మందుబాటిల్ మాత్రం ఇంటికి వస్తుంది. బియ్యం తెచ్చుకోవడానికి రేషన్ షాప్ పోయేవాళ్లం.. బియ్యంతో చక్కెర, కందిప్పు, పామాయిల్,గోధుమ, పసుపు,కారం,చింతపండు,కిరోసిన్‌లను కేవలం రూ.155కే ఇచ్చేవారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రేషన్ షాప్ వెళ్తే బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా? ఈ బియ్యంలో కూడా వేలి ముద్రలు పడటం లేదని కట్ చేస్తున్నారు. పెట్రోల్, డిజిల్ ధరల వ్యత్యాసం.. పెట్రోలు, డిజిల్‌లను మీ ట్రాక్టర్, బైక్‌లలో ఇక్కడ కొట్టించి.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొట్టించుకుంటే వ్యత్యాసం ఎంతో తెలుస్తోంది. ఎంత తెలుసా రూ. 7 ఎక్కువగా బాదుతున్నారు. నాలుగేళ్ల నుంచి ఇతర రాష్ట్రాల కన్నా రూ.7 ఎక్కవగా వసూలు చేస్తున్నారు. కరెంట్ చార్జీలు తగ్గిస్తానన్నారు. కానీ కరెంట్ బిల్లులు బాదుతునే ఉన్నారు. అప్పుడు 100 లోపు కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పడు 500పైగా వస్తుంది. పెనాల్టీ కట్టకుంటే కరెంట్ కట్‌చేస్తున్నారు. ఆయన వచ్చాడు.. మీ బంగారం వచ్చిందా? ఎన్నికల సమయంలో ఓ ప్రకటన వచ్చేది.. ఓ అక్క మెడలోని తాడును గుంజుకోపోతుంటే.. ఒకయాన వచ్చి అడ్డుకుంటాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ రుణాలు మాఫీ చేస్తాడని చెబుతాడు. మరి ఆయన వచ్చాడు మీ బంగారం వచ్చిందా. (ప్రజల నుంచి రాలేదని సమాధానం) పొదుపు సంఘాలు తీసుకొచ్చిందే తానంటారు. అక్కచెల్లెమ్మలు రుణాలు మాఫీకావాంటే బాబు కావాలని అన్నారు. అక్కమ్మ చెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతున్నా. ఆడవాళ్లకు కన్నీరు పెట్టిస్తే ఇంటికి అరిష్టం అంటారు. కానీ ఈ నాలుగేళ్లలో ఎంతమంది కన్నీళ్లు పెట్టారు. జాబు రావాలంటే బాబు రావాలి అన్నారు. మీ పిల్లలు ఏమి చదవక పోయినా ఉద్యోగం ఇస్తాం.. లేకుంటే ఉపాధి ఇస్తాం అదికాకపోతే.. రెండు వేలు ఇస్తానన్నారు. ఇలా ప్రతి ఇంటికి 96 వేలు బాకీ ఉన్నాడు. కనిపిస్తే అడగండి. నవరత్నాలు అమలు చేస్తాం.. మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలు తీసుకొస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఎంత అప్పుంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తాం. అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలను పునరుద్ధరిస్తాం. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇస్తాం. ఆ ఇళ్లను అక్కా చెల్లెమ్మల పేరిట ఇప్పిస్తాం. అవ్వా, తాతలకు రూ.2 వేల పెన్షన్ ఇస్తాం. పెన్షన్ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. అంతేగాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకు స్వాతంత్ర్య సమరయోదుడు,మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడ్తాం’’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
భీమవరం యువతి.. 12 గంటల నరకం
సాక్షి, భీమవరం: కదులుతున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి, 12 గంటలపాటు నరకయాతన అనుభవించిన యువతిని కాపాడిన రైల్వే సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. భీమవరంలోని శ్రీరామపురానికి చెందిన రాజేశ్వరి(21) బీఈడీ చదువుతోంది. పని నిమిత్తం గురువారం విజయవాడకు వచ్చిన ఆమె సాయంత్రం పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో భీమవరానికి తిరుగు ప్రయాణమైంది. రైలు ఆకివీడు గుమ్ములూరు స్టేషన్‌కు సమీపం ప్రయాణిస్తున్నప్పుడు.. ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. ట్రాక్ పక్కన బురదగుంటలో పడటంతో అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కినా.. షాక్‌కు గురై, గాయాలతో పైకి లేవలేకపోయింది. అలా సుమారు 12 గంటలు నరకయాతన అనుభవించింది. శుక్రవారం ఉదయం అటుగా వచ్చిన కీ మ్యాన్ ఒకరు ఆమెను గుర్తించారు. వెంటనే సమీపంలో పనిచేస్తోన్న ట్రాక్మన్లను పిలిపించాడు. అందరూ కలిసి యువతిని బయటికి తీసి, బురదను శుభ్రంచేసి, కాసిన్ని నీళ్లు తాగించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మానవత్వాన్ని చూపించిన సిబ్బంది.. యాక్టింగ్ కీ మ్యాన్ గోపాల కృష్ణ, ట్రాక్ మ్యాన్లు మహేశ్, మణికుమార్, కనకేశ్వర్‌రావు, ఎం.రాంబాబులను ఉన్నతాధికారులు, పౌరసమాజం, నెటిజన్లు అభినందిస్తున్నారు. -
ఆకివీడులో చోరీ
ఆకివీడు (కాళ్ల): ఇంట్లో ఎవరూలేని సమయంలో తలుపులు పగులకొట్టి చోరీకి పాల్పడిన సంఘటన ఆకివీడులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం వేకువజామున స్థానిక ఆంధ్రాబ్యాంక్ ఎదురుగా ఉన్న వీధిలో కోశూరి అక్కయ్య ఇంటి తలుపులు పగులకొట్టి దొంగలు లోనికి చొరబడ్డారు. వెండి వస్తువులను చోరీ చేశారు. అక్కయ్య హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లగా పక్కింటి వారు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆకివీడు ఎస్సై అశోక్ కుమార్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. చుట్టం చూపుగా వచ్చి .. జీలుగుమిల్లి : చుట్టం చూపుగా వచ్చిన వ్యక్తి ఇంట్లో బంగారం కాజేసిన సంఘటన మండలంలోని రామన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.›గ్రామానికి చెందిన వీర్మాల కృష్ణ బంధువు సమిశ్రగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీకాంతం మూడు రోజుల క్రితం చుట్టం చూపుగా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న మంగళ సూత్రం, గొలుసు అపహరించినట్టు బాధితుడు వి.కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ ఇరపం భాస్కర్ తెలిపారు. -
ఓటుకు నోటు కాంగ్రెస్ చలవే
ఆకివీడు : ఓటుకు నోటును అలవాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా మండల పార్టీ అధికార ప్రతినిధి నేరెళ్ల పెదబాబు రైస్ మిల్లు వద్ద కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి వేళ్లూనుకుపోయిందన్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి పనిచేయించుకునే అలవాటును నేర్పించారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో 268 మందికి పరీక్షలు నిర్వహించిన మందులు అందజేశారు. పెదబాబు, పట్టణ కమిటీ అధ్యక్షుడు యర్రా రఘురామ్, రైల్వే బోర్డు మాజీ సభ్యుడు వాడపల్లి రాంబాబు పాల్గొన్నారు. -
కొండ చిలువల కలకలం
ఆకివీడు(పశ్చిమగోదావరి జిల్లా): ఆకివీడులో రెండు కొండ చిలువలు సోమవారం కలకలం సృష్టించాయి. గ్రామంలోని 1వ వార్డులోని ఐబీపీ పెట్రోల్ బంక్ వెనుక ప్రాంతంలోని చేల వద్ద రెండు కొండ చిలువలు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ ప్రాంతానికి చెందిన యువకులు వీటిని కొట్టి చంపారు. ఒక్కో కొండ చిలువ 10 అడుగుల పొడవు ఉంది. కొద్దిరోజులుగా మెట్ట ప్రాంతం నుంచి ఎర్ర కంకరను లారీల్లో తీసుకువచ్చి స్థానిక ఆదర్శ స్కూల్ వద్ద నిల్వ ఉంచారు. ఎర్రకంకరతో పాటు కొండ చిలువలు లారీల్లో వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. -
వినాయకగుడిలో హుండీ చోరీ
ఆకివీడు : స్థానిక శాంతినగర్‌లోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపల ఉన్న రెండు హుండీలను బయటకు తీసుకువచ్చి బద్దలకొట్టారు. వాటిల్లో ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లారు. సుమారు రూ.50వేలకుపైగా సొమ్ము ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ నందిగామ ఫణిశర్మ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అశోక్‌కుమార్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వెనుక లభ్యమైన హుండీలను పరిశీలించారు. గతంలో ఇదే ఆలయంలో రెండు సార్లు హుండీలను దుండగులు దొంగిలించారు. గత ఏడాది డిసెంబర్ 26న హుండీని దోచుకున్న దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. దీంతో తరచూ హుండీల దొంగతనాలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ కార్యదర్శి గంధం ఉమ ఎస్ఐతో చెప్పారు. -
రాష్ట్రపతి పర్యటన స్థలాలు ఎస్పీ పరిశీలన
ఆకివీడు:భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 26వ తేదీన సందర్శించనున్న మండలంలోని అయిభీమవరం గ్రామాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి పరిశీలించారు. మూడు హెలికాప్టర్లు దిగేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. అయితే గత సంవత్సరం రాష్ట్రపతి వస్తారని భావించిన సందర్భంలో హెలిపాడ్ కోసం కేటాయించిన స్థలాన్నే ఇప్పుడు వాడాలని అధికారులు నిర్ణయించారు. ఆ స్థలాన్ని డీఎస్పీ కె.రఘువీరారెడ్డితో కలసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం రాష్ట్రపతి ప్రారంభించబోయే వేదపాఠశాల నూతన భవనం వద్దకు వచ్చారు. అక్కడ టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు రాష్ట్రపతి సందర్శన, కార్యక్రమం వివరాలను ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి సందర్శించబోయే అన్ని ప్రాంతాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ మాజీ సభ్యులు పుత్తూరి ఆంజనేయరాజు, సీఐ కేఏస్వామి, ఎస్ఐ కేఎస్వీ ప్రసాద్, రహదారులు భవనాల శాఖ డీఈఈ డి.దేవేంద్రరాజు, ఏఈ ఏ.వర్మ, సర్వేయర్ విష్ణుమూర్తి స్థానిక ప్రముఖులు బిల్డర్ కె.రామకృష్ణంరాజు, కె.బలరామరాజు (మునసారి రాంబాబు), కె.లక్ష్మణరావు, ఎం.డి. షమీమ్ తదితరులు పాల్గొన్నారు. నరసాపురం ఆర్డీ వో డి.పుష్పమణి మంగళవారం సాయంకాలం హెలిపాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. పర్యటన వివరాలు బాపిరాజు రాష్ట్రపతి పర్యటన వివరాలను ఇలా తెలిపారు... 26వ తేదీ ఉదయం 11.45 గంటలకు అయిభీమవరంలోని వేదపాఠశాల వద్దకు రాష్ట్రపతి చేరుకుంటారు. ముందుగా సాంస్కృతిక వేదిక ముఖ ద్వారం వద్ద వేదపండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలుకుతారు. మొదటగా ప్రవేశద్వారం వద్ద ఉన్న షిర్డీసాయిబాబా దర్శనం, ఆ పక్కనే ఉన్న కంచికామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ప్రధాన ధ్యానమందిరం దర్శనం చేసుకుంటారు. వేద పాఠశాల భవనం ముందున్న సరస్వతీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి భవనాన్ని ప్రారంభిస్తారు. భవన పరిశీలన చేస్తారు. అక్కడ నుంచి విద్యార్థులు, అధ్యాపకుల నివాస భవన ప్రాంగణంలో ఉన్న యాగశాలకు చేరి ఉదయం నుంచి జరిగిన హోమాలకు రాష్ట్రపతి పూర్ణాహుతి సమర్పిస్తారు. అక్కడే ఉన్న గోశాలను సందర్శించి గోపూజ చేస్తారు. అక్కడే ఉన్న పుష్కరిణిని పరిశీలిస్తారు. అనంతరం ఆయన ప్రారంభించిన భవనం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసిస్తారు. దీంతో కార్యక్రమం పూర్తవుతుంది. 12.45 గంటలకు హెలీపాడ్ వద్దకు చేరి అక్కడ నుంచి తిరుపతి వెళతారని బాపిరాజు వివరించారు. -
కాంగ్రెస్ నేతలకు పరాభవం
ఆకివీడు, న్యూస్‌లైన్ : ఆకివీడులో సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన లక్ష గళ గర్జనను విఫలం చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నేతలు సమైక్యవాదుల నుంచి పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సమైక్యాంధ్ర పరిరక్షించాలని కోరుతూ జేఏసీ, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ పోరాట సమితి, సమైక్యవాదులు 15 రోజులుగా లక్ష గళ నిరసన గర్జనకు ఏర్పాట్లు చేశారు. గ్రామ గ్రామానా తిరిగి సమైక్య రాష్ట్రం అవసరాన్ని వివరించారు. లక్ష గళ గర్జన సభా వేదిక వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చీర కట్టినట్టు ఉన్న నర్సాపురం ఎంపీ కనుమూరు బాపిరాజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జేఏసీ గౌరవాధ్యక్షుడు గొంట్లా గణపతి మాట్లాడుతున్న సమయంలో ఫ్లెక్సీని తొలిగించాలంటూ ఆప్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వర రావు(రత్నం) బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జంపన సుబ్రమణ్య రాజువేదికపైకి దూసుకువచ్చారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వారికి అండగా నిలిచారు. ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారో తమకు తెలియదంటూ జేఏసీ నేతలు వివరిస్తున్నా పట్టించుకోకుండా కాం గ్రెస్ నేతలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిం చారు. ఫ్లెక్సీని తొలగించాలంటూ పట్టుబట్టారు. కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా వేదిక కింద ఉన్న సమైక్యవాదులు నినాదాలు చేశారు. ఎంపీ బాపిరాజు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొంటేనే ఫ్లెక్సీ తొలగిస్తామంటూ వారు పట్టుబ ట్టారు. దీంతో సమైక్యవాదులు, కాంగ్రెస్ నేతల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చెలరేగింది. ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఈదశలో భీమవరం రూరల్ సీఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో పోలీ సులు రంగ ప్రవేశం చేశారు. వేదికను ఖాళీ చేయాలంటూ ఆందోళనకారులను హెచ్చరించారు. దీంతో వందలాది మంది యువకులు సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సమైక్య ఉద్యమాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు రత్నం, జేఎస్సార్తో పోలీసులు చర్చలు జరిపి ఎట్టకేలకు వారిని సభా వేదిక వద్ద నుంచి పంపివేశారు. ఈదశలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, బాపిరాజు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య లక్ష గళ గర్జనకు హాజరైన కొందరు విద్యార్థులకు తొక్కిసలాటలో గాయాలయ్యాయి. అనంతరం లక్ష గళ గర్జన యథావిధిగా కొనసాగి విజయవంతమైంది. -
ఆకివీడులో ప్లెక్సీ గొడవ
-
కైకలూరు ఎమ్మెల్యే...‘కొంప’ కొల్లేరు !
కైకలూరు/మండవల్లి, న్యూస్‌లైన్ : కొల్లేటి గ్రామాల ప్రతినిధిగా మెలుగుతున్న కైకలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సతీమణి.. తనను మానసికంగా వేధించి గృహహింసకు పాల్పడ్డారంటూ సోమవారం రాత్రి మండవల్లి పోలీసుస్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కైకలూరు మండలం కొట్డాడ గ్రామానికి చెందిన జయమంగళ వెంకటరమణ మొదటి భార్య మృతిచెందడంతో 1997లో మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు సునీతను తిరుమలలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పూజిత, రమ్య, అనే ఇద్దరు అమ్మాయిలు, తేజ అనే ఒక అబ్బాయి ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నివాసం ఉండే వీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కైకలూరు శివారు లోకుమూడి వద్ద నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత కొంతకాలంగా పుట్టింట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆమె మండవల్లి పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు బిడ్డలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్ గౌడ్ స్టేషన్లో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరు పిల్లలని అబద్ధం చెప్పారు.. ఎన్నికల సమయంలో తనకు ఇద్దరు పిల్లలను తన భర్త అబద్ధం చెప్పారని ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. దీనిపై తాను వారించినా వినలేదని చెప్పారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత ఆయనలో పూర్తి మార్పు వచ్చిందని తెలిపారు. ఆయనకు మద్యం సేవించడంతో పాటు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఒకానొక సందర్భంలో ఆయన సర్వీస్ రివాల్వర్‌తో తనపై ఒక రౌండ్ కాల్పులు జరిపారన్నారు. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గోడకు తగలిందని వివరించారు. తనతో మోసపూరితంగా కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టులో విడాకులకు పంపారన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా బెదిరించారని చెప్పారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పి కోర్డులో న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడితే అనుచరులతో బెదిరించారని పేర్కొన్నారు. చివరకు తనకు పుట్టిన బిడ్డలను సైతం అనుమానించి డీఎన్ఏ పరీక్షను కోరడం తనను మానసికంగా వేధించిందన్నారు. తనకు, బిడ్డలకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498 సెక్షన్ కింద గృహహింసపై కేసు నమోదు చేశారు. బెయిలబుల్ కేసు అయినా నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్షపడే అవకాశముంటుందని పోలీసులు వివరించారు. ఆది నుంచీ సంచలనాలే.. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆది నుంచి సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. కొల్లేరుపై ఆధ్యయనం చేయడానికి వచ్చిన అజీజ్ కమిటీ ముందు గోచీగుడ్డతో మావులు ఎత్తి సంచలనమయ్యారు. ఇటీవల గుడివాడ రైతు సదస్సులో విలేకరులపై మాట తూలడంతో ఆందోళనలు జరిగాయి. కొల్లేరు ప్రజలకు న్యాయంచేస్తే టీడీపీని వీడి కాంగ్రెస్‌కు జై కొడతానని ప్రకటించారు. -
కైకలూరు ఎమ్మెల్యే...‘కొంప’ కొల్లేరు !
కైకలూరు/మండవల్లి, న్యూస్‌లైన్ : కొల్లేటి గ్రామాల ప్రతినిధిగా మెలుగుతున్న కైకలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సతీమణి.. తనను మానసికంగా వేధించి గృహహింసకు పాల్పడ్డారంటూ సోమవారం రాత్రి మండవల్లి పోలీసుస్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కైకలూరు మండలం కొట్డాడ గ్రామానికి చెందిన జయమంగళ వెంకటరమణ మొదటి భార్య మృతిచెందడంతో 1997లో మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు సునీతను తిరుమలలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పూజిత, రమ్య, అనే ఇద్దరు అమ్మాయిలు, తేజ అనే ఒక అబ్బాయి ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నివాసం ఉండే వీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కైకలూరు శివారు లోకుమూడి వద్ద నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత కొంతకాలంగా పుట్టింట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆమె మండవల్లి పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు బిడ్డలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్ గౌడ్ స్టేషన్లో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరు పిల్లలని అబద్ధం చెప్పారు.. ఎన్నికల సమయంలో తనకు ఇద్దరు పిల్లలను తన భర్త అబద్ధం చెప్పారని ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. దీనిపై తాను వారించినా వినలేదని చెప్పారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత ఆయనలో పూర్తి మార్పు వచ్చిందని తెలిపారు. ఆయనకు మద్యం సేవించడంతో పాటు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఒకానొక సందర్భంలో ఆయన సర్వీస్ రివాల్వర్‌తో తనపై ఒక రౌండ్ కాల్పులు జరిపారన్నారు. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గోడకు తగలిందని వివరించారు. తనతో మోసపూరితంగా కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టులో విడాకులకు పంపారన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా బెదిరించారని చెప్పారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పి కోర్డులో న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడితే అనుచరులతో బెదిరించారని పేర్కొన్నారు. చివరకు తనకు పుట్టిన బిడ్డలను సైతం అనుమానించి డీఎన్ఏ పరీక్షను కోరడం తనను మానసికంగా వేధించిందన్నారు. తనకు, బిడ్డలకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498 సెక్షన్ కింద గృహహింసపై కేసు నమోదు చేశారు. బెయిలబుల్ కేసు అయినా నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్షపడే అవకాశముంటుందని పోలీసులు వివరించారు. ఆది నుంచీ సంచలనాలే.. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆది నుంచి సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. కొల్లేరుపై ఆధ్యయనం చేయడానికి వచ్చిన అజీజ్ కమిటీ ముందు గోచీగుడ్డతో మావులు ఎత్తి సంచలనమయ్యారు. ఇటీవల గుడివాడ రైతు సదస్సులో విలేకరులపై మాట తూలడంతో ఆందోళనలు జరిగాయి. కొల్లేరు ప్రజలకు న్యాయంచేస్తే టీడీపీని వీడి కాంగ్రెస్‌కు జై కొడతానని ప్రకటించారు.