
కైకలూరు ఎమ్మెల్యే...‘కొంప’ కొల్లేరు !
కొల్లేటి గ్రామాల ప్రతినిధిగా మెలుగుతున్న కైకలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది.
కైకలూరు/మండవల్లి, న్యూస్‌లైన్ : కొల్లేటి గ్రామాల ప్రతినిధిగా మెలుగుతున్న కైకలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సతీమణి.. తనను మానసికంగా వేధించి గృహహింసకు పాల్పడ్డారంటూ సోమవారం రాత్రి మండవల్లి పోలీసుస్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కైకలూరు మండలం కొట్డాడ గ్రామానికి చెందిన జయమంగళ వెంకటరమణ మొదటి భార్య మృతిచెందడంతో 1997లో మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు సునీతను తిరుమలలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పూజిత, రమ్య, అనే ఇద్దరు అమ్మాయిలు, తేజ అనే ఒక అబ్బాయి ఉన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నివాసం ఉండే వీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కైకలూరు శివారు లోకుమూడి వద్ద నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత కొంతకాలంగా పుట్టింట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆమె మండవల్లి పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు బిడ్డలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్ గౌడ్ స్టేషన్‌లో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇద్దరు పిల్లలని అబద్ధం చెప్పారు..
ఎన్నికల సమయంలో తనకు ఇద్దరు పిల్లలను తన భర్త అబద్ధం చెప్పారని ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. దీనిపై తాను వారించినా వినలేదని చెప్పారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత ఆయనలో పూర్తి మార్పు వచ్చిందని తెలిపారు. ఆయనకు మద్యం సేవించడంతో పాటు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఒకానొక సందర్భంలో ఆయన సర్వీస్ రివాల్వర్‌తో తనపై ఒక రౌండ్ కాల్పులు జరిపారన్నారు. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గోడకు తగలిందని వివరించారు. తనతో మోసపూరితంగా కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టులో విడాకులకు పంపారన్నారు.
ఈ విషయమై ప్రశ్నించగా బెదిరించారని చెప్పారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పి కోర్డులో న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడితే అనుచరులతో బెదిరించారని పేర్కొన్నారు. చివరకు తనకు పుట్టిన బిడ్డలను సైతం అనుమానించి డీఎన్‌ఏ పరీక్షను కోరడం తనను మానసికంగా వేధించిందన్నారు. తనకు, బిడ్డలకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498 సెక్షన్ కింద గృహహింసపై కేసు నమోదు చేశారు. బెయిలబుల్ కేసు అయినా నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్షపడే అవకాశముంటుందని పోలీసులు వివరించారు.
ఆది నుంచీ సంచలనాలే..
ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆది నుంచి సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. కొల్లేరుపై ఆధ్యయనం చేయడానికి వచ్చిన అజీజ్ కమిటీ ముందు గోచీగుడ్డతో మావులు ఎత్తి సంచలనమయ్యారు. ఇటీవల గుడివాడ రైతు సదస్సులో విలేకరులపై మాట తూలడంతో ఆందోళనలు జరిగాయి. కొల్లేరు ప్రజలకు న్యాయంచేస్తే టీడీపీని వీడి కాంగ్రెస్‌కు జై కొడతానని ప్రకటించారు.