నేను ప్రకృతి ప్రేమికురాలిని
కాలానుగుణంగా మార్పులు సహజం
పాటలను ప్రేమించేవారికి కొదవ లేదు
సుమధుర గాయని సునీత
సంగీత ప్రపంచంలో ఆమె స్వరం మధురం. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలం. ఏ పాట పాడినా.. ఏ భావం పలికినా.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. భయానకం, కరుణ, వీరత్వం, హాస్యం.. ఇలా సన్నివేశం ఏదైనా సరే దానికి ఆమె గళం తోడైతే ఇక ఆ పాట.. ఆ మాటా ఓ అద్భుతం అనాల్సిందే. పాటల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సంపాదించుకుంది సునీత ఉపద్రష్ట. విశాఖకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు.
సంగీతాన్ని ప్రేమించాలి
సంగీతం అనేది భగవదత్తంగా రావాలి. నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. స్వరం మాత్రం జన్మతహా వస్తుంది. సంగీతాన్ని భక్తి గా, శ్రద్ధగా స్వీకరించాలి. సంగీతాన్ని ప్రేమించాలి. నేటి తరం గాయకులకు ఇవే లక్షణాలు ఉండాలన్న నిబంధనలు లేవు. ఎవరు పాడినా తక్కువ సమయంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి.
నేను అదృష్టవంతురాలిని
చాలా కాలంగా పాటలు పాడటం వలన అనేక వైవిధ్యమైన పాటలు పాడే అవకాశం కలిగింది. అనేకమంది సంగీత దర్శకులు ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించారు. నా ముందుతరం వారు పాడిన కొన్ని పాటలు వింటుంటే కొన్ని సార్లు ఫీలైన సందర్భాలు ఉన్నాయి. ఇంతమంచి పాట నేను పాడలేకపోయాను అనే భావన కలిగింది.
విశాఖలో బంధువులున్నారు
మా అమ్మవాళ్లది విశాఖ. చిన్న తనం నుంచి అమ్మ ఈ నగరం గురించి చెబుతుంటే విశాఖపట్నం ఇలా ఉంటుందా అని ఊహించుకునే దాన్ని. అమ్మ చిన్నతనం ఇక్కడే సాగింది. అమ్మచెప్పినవి వింటూ ఊహల్లో పెరిగాను. ఆ విధంగా విశాఖ నగరంపై ప్రేమ పెరిగింది. నా ఊహలకంటే ఎంతో అందంగా విశాఖ ఉంది. కై లాసగిరి, రుషికొండ మీద నుంచి నగరాన్ని చూడటం, కొండ పక్కనుంచి వెళ్లే రహదారి చూడటానికి ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మా పెద్దమ్మ వాళ్లు విశాఖలో ఉండేవారు. ప్రకృతి అంతా ఇక్కడే ఉందని అని అనిపిస్తోంది. విశాఖ ప్రజలు ఎంతైనా అదృష్టవంతులు.
పరిధి పెరిగింది
నేడు సంగీత ప్రపంచం పరిధి విస్తరించింది, సినిమాల్లో పాత్ర, సంగీత దర్శకుడి ఆసక్తి, పరిస్థితులు ఆధారంగా పాటలు పెట్టడం జరుగుతోంది. సంగీతం నేర్చుకోవడం, గాయకులుగా స్థిరపడటంతో పాటు ఈ రంగంలో స్థానాన్ని నిలుపుకోవడం ఎంతో అవసరం.
కాలంతో పాటు మార్పుల్లో భాగంగా ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఆదరణ, ప్రాముఖ్యత పెరిగింది. నేను కూడా దీనిలో భాగం అవుతున్నాను. సంగీత కార్యక్రమాలకు వచ్చే ప్రేక్షకులు సంఖ్యమాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇది చాలా సంతోషాన్నిచ్చే అంశం.
ఇండిపెండెంట్ మ్యూజిక్‌కు ఆదరణ
నాకు కొండలు, సముద్రం అంటే ఎంతో ఇష్టం, నేనొక ప్రకృతి ప్రేమికురాలిని. నిజంగా చెప్పాలంటే ప్రకృతి మధ్యలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి కూడా ఎంతో ఇష్టపడతాను. విశాఖకు వచ్చే సమయంలో విమానంలోంచి చూస్తే కొండలు, పక్కనే సముద్రం ఎంతో అందంగా కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment