
సాక్షి, భీమవరం: కదులుతున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి, 12 గంటలపాటు నరకయాతన అనుభవించిన యువతిని కాపాడిన రైల్వే సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..
భీమవరంలోని శ్రీరామపురానికి చెందిన రాజేశ్వరి(21) బీఈడీ చదువుతోంది. పని నిమిత్తం గురువారం విజయవాడకు వచ్చిన ఆమె సాయంత్రం పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో భీమవరానికి తిరుగు ప్రయాణమైంది. రైలు ఆకివీడు గుమ్ములూరు స్టేషన్‌కు సమీపం ప్రయాణిస్తున్నప్పుడు.. ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. ట్రాక్ పక్కన బురదగుంటలో పడటంతో అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కినా.. షాక్‌కు గురై, గాయాలతో పైకి లేవలేకపోయింది.
అలా సుమారు 12 గంటలు నరకయాతన అనుభవించింది. శుక్రవారం ఉదయం అటుగా వచ్చిన కీ మ్యాన్ ఒకరు ఆమెను గుర్తించారు. వెంటనే సమీపంలో పనిచేస్తోన్న ట్రాక్‌మన్లను పిలిపించాడు. అందరూ కలిసి యువతిని బయటికి తీసి, బురదను శుభ్రంచేసి, కాసిన్ని నీళ్లు తాగించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మానవత్వాన్ని చూపించిన సిబ్బంది.. యాక్టింగ్ కీ మ్యాన్ గోపాల కృష్ణ, ట్రాక్ మ్యాన్లు మహేశ్, మణికుమార్, కనకేశ్వర్‌రావు, ఎం.రాంబాబులను ఉన్నతాధికారులు, పౌరసమాజం, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment