అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను తొలగిస్తున్న సిబ్బంది
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక తొలగింపు పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి కొనసాగుతున్నాయి. సీఆర్‌డీఏ అధికారులు అక్కడికి చేరుకుని తొలగింపు పనులపై సిబ్బందికి సూచనలు చేశారు. బుధవారం రాత్రి సమయానికి దాదాపు 80 శాతానికి పైగా అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. పైకప్పును మాత్రం అలాగే ఉంచారు. రేకులను తొలగించాల్సి ఉన్నందున గురువారం నాటికి పైకప్పు కూడా తొలగించి పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రజావేదిక తొలగింపు పనులు సాగుతున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్రమ కట్టడమైనా తొలగించరాదంటూ పట్టుబట్టారు.
బాబు నివాసంలో తర్జనభర్జన
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. రాత్రి 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వీరంతా చంద్రబాబు కాన్వాయ్ వెంట ఆయన నివాసం వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్రమ నిర్మాణం తొలగింపు పనులు కొనసాగుతుండడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు ఆయన కాన్వాయ్‌ను మాత్రమే అనుమతించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటు మరో 10 మంది జిల్లా నాయకులు ఈ వాహన శ్రేణిలోనే చంద్రబాబు నివాసానికి చేరుకుని దాదాపు ఒంటి గంట వరకు ఆయనతో చర్చించారు. అక్రమ నిర్మాణం తొలగింపుపై ఎలా స్పందించాలనే విషయంపై తర్జనభర్జన పడ్డారు. అయితే దీనిపై స్పందించకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం కావడం, అప్పటికే హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేసినందున ఆందోళన చేయడానికి టీడీపీ నేతలు వెనుకాడారు.
భారీ బందోబస్తు ఏర్పాటు
మాజీ సీఎం ఇంటికి అత్యంత సమీపంలోనే ఉన్న ప్రజావేదికను తొలగిస్తున్న నేపథ్యంలో ఘర్షణలు, ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. అక్రమ నిర్మాణ తొలగింపు పనులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి పేర్ని నాని తదితరులు బుధవారం ఉదయం పరిశీలించారు. కాగా ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు రోజంతా తన ఇంటిలోనే గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment