చిన్నారులను మింగేస్తున్న డెంగీ భూతం | Dengue in children | Sakshi
Sakshi News home page

చిన్నారులను మింగేస్తున్న డెంగీ భూతం

Published Wed, Jul 30 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

చిన్నారులను మింగేస్తున్న డెంగీ భూతం

చిన్నారులను మింగేస్తున్న డెంగీ భూతం

 జిల్లాలో డెంగీ భూతం విజృంభిస్తోంది. ముఖ్యంగా చిన్నారులను పొట్టనపెట్టుకుంటోంది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తోంది. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా ఎక్కడికక్కడ చెత్తకుప్పలు పేరుకుపోయి దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి.   పగటి పూట కుట్టే  ఈడిస్ ఈజిప్టు అనే దోమ వల్ల ఈ వ్యాధి సోకుతోంది.  ఇప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పలువురు ఈ వ్యాధి బారిన పడ్డారు.   
 
  సాక్షి ప్రతినిధి, విజయనగరం : నెల్లిమర్ల మండలం జరజాపుపేట గ్రామానికి చెందిన బుగత ప్రసాద్, సునీతల కుమారుడు బుగత సాయి హర్షవర్థన్(5) గత నెల 29న జ్వరం బారిన పడ్డాడు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు స్థానిక మిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు బాలుడికి రక్త పరీక్షలు నిర్వహించగా డెంగీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వైద్యం ప్రారంభించారు. ఈలోగా హర్షవర్థన్ ప్లేట్ లెట్ కౌంట్ ఒక్కసారిగా పడిపోయింది. బాలుడుని రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ నెల ఒకటో తేదీన మృతి చెందాడు. కుమార్తె కుంచు స్నేహ పది రోజుల క్రితం జ్వరం బారిన పడింది. వెంటనే పట్టణంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెంగీ లక్షణాలు కన్పించడంతో విశాఖపట్నం తీసుకెళ్లాలని ఇక్కడి వైద్యులు సూచించారు. దీంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడెళ్లాక డెంగీ సోకిందని నిర్ధార ణైంది. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి మంగళవారం మృతి చెందింది. కుమార్తెను బతికించుకోవాలని రూ. లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోయింది.
 
 ఇవీ తెలిసిన కేసులు. నిర్ధారణ కాకుండా మృతి చెందిన కేసులెన్నో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో డెంగీ భూతం కోరలు సా చి విజృంభిస్తోంది. ముఖ్యంగా చిన్నారులను మింగేస్తోంది. వ్యాధి ఇది అని గుర్తించే లోపే పొట్టన పెట్టుకుంటోంది. నెల రోజుల లోపే ఇద్దరు మృత్యువాత పడ్డారు. మారుమూల, గిరిజన గ్రామాల్లో దీని బారిన పడి ఇంకెంత మంది మృతి చెందారో తెలియని పరిస్థితి. సాలూరు గొల్లవీధికి చెందిన పి.కార్తీక్, బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన ప్రసన్న, మక్కువ మండలం కవిరిపిల్లి గ్రామానికి చెందిన రెడ్డి యమున, నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామానికి చెందిన పి.వి.వరుణ్ , ఎల్.కోట మండలం రంగరాయపురానికి చెందిన వి. మధుశ్రీ డెంగీ వ్యాధి బారిన పడ్డారు. వీరంతా పదేళ్లలోపు పిల్లలే. చికిత్స పొంది కోలుకున్నారు. చిన్నారులకే డెంగీ ఎక్కువగా సోకడంతో దాని తీవ్రతను వెంటనే గుర్తించలేకపోతున్నారు.
 
 ఆ చిన్నారులు తమకొచ్చిన వ్యాధి గురించి చెప్పుకోలేక ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వ్యాధిని గుర్తించేలోపే తీవ్రమవడంతో వైద్యులు కూడా ఏం చేయలేకపోతున్నారు. వ్యాధి సోకిన పదిరోజులకే   మృతి చెందిన   స్నేహనే ఉదాహరణగా తీసుకోవచ్చు. జ్వరం రాగానే తల్లిదండ్రులు   వెంటనే అప్రమత్తమై విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వెంటనే డెంగీ లక్షణాలు కన్పించడంతో విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితి విషమించింది. రోజుల వ్యవధిలోనే  వ్యాధి పాపా ప్రాణాలను హరించివేసింది. కుమార్తెను బతికించుకునేందుకు పాప తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఫలితం లేకపోయింది. ఇప్పుడా తల్లిదండ్రులు రోదన అంతా ఇంతా కాదు.  
 పొంతనలేని ప్రకటనలు....‘చెత్త’శుద్ధి లేని చేతలుస్నేహ పరిస్థితి రోజురోజుకూ విషమిస్తున్నా... ఆ చిన్నారి కోలుకుంటుందని, వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి చెప్పినట్టు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
 
 తొలి రోజు నుంచి వైద్యులు అనుమానమే అని చెప్పినా ఇలా ప్రకటన చేయడం వెనుక కారణమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చేసిన ప్రకటన కూడా హాస్యాస్పదంగా ఉంది. డెంగీ సోకిందని పత్రికల్లో కథనాలొచ్చిన రోజున వైఎస్సార్‌నగర్‌కొచ్చి బ్లీచింగ్, దోమల నివారణ మందు పిచికారీ చేసి వెళ్లారు. ఆ తర్వాత అటువంటి చర్యలేమీ కనిపించలేదు. మున్సిపల్ యంత్రాంగం కూడా అదే రకంగా స్పందించింది. రెండు రోజులు కాస్త హడావుడి చేసినా ఆ తర్వాత పారిశుద్ధ్యం జోలికే పోలేదు. ఇక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతోనే దోమలు వ్యాప్తి చెంది రోగాలకు కారణమవుతున్నాయని వైద్యాధికారులు చెబుతుంటే ఆ దిశగా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఇప్పటికైనా అటు వైద్యాధికారులు, ఇటు మున్సిపల్ యంత్రాంగం స్పం దించకపోతే కాలనీ వాసులకు ప్రమాదం పొంచి ఉన్నట్టే.
 
 డెంగీ   లక్షణాలు:
  వైరల్ జ్వరాల మాదిరిగా తీవ్రంగా వస్తుంది.  
  తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులతో ఎముకల విరిగేటంత నొప్పి కలిగిస్తుంది.
  ఒక్కొక్క సారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావకావడం వల్ల కాళ్లు, చేతులు , ముఖము,వీపు ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కంది నట్టు చిన్నచిన్న మొటిముల కనిపిస్తాయి.
   ప్లేట్ లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది.
 
 దోమలతో డెంగీ వ్యాప్తి
  ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటు వల్ల  ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లుంతా దద్దుర్లు కనిపిస్తాయి. ఇళ్లలోని కుండీలు, గోళాలు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, ఎయిర్ కూలర్లు, తాగి నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కప్పులు, పగిలిన సీసాలు, టైర్లువంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో దోమలు గుడ్లుపెడతాయి, అక్కడే  ఈడిస్ దోమ పెరుగుతుంది. తీసుకోవలసిన జాగ్రత్తలుఇంటి  పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న  వృధానీటిని ఎప్పటికప్పుడూ తొలగించాలి.   చెత్త చెదారాన్ని ఇంటికి దూరంగా వేయాలి. ఇళ్లలో ఉన్న అన్ని గదుల్లో దోమల మందు చల్లించాలి.  దోమ తెరలు వాడడం లేదా ఇంటి కిటీకీల తలుపులకు నెట్‌లు ఏర్పాటు చేసుకోవాలి.
 
  నీరు నిల్వ చేసే పాత్రలను వారానాకి ఒక సారి ఖాళీ చేసి మళ్లీ నింపుకోవాలి.
  తాగి వదిలిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు , ఖాళీ  డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్‌ర్లు, పూలకుండీల్లో నీటిని తరుచు మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. క్రమంగా శుభ్రం చేసుకోవాలి.  దోమ కాటునుంచి రక్షణ కోసం శరీరం అంతా కప్పి ఉండేలా  దుస్తులు ధరించాలి. ముఖ్యంగా దుస్తులు లేకుండా పిల్లల్ని   బయట తిరగనీయరాదు.  కుళాయి దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జ్వరం  వచ్చిన వెంటనే దగ్గరలోగల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement