విద్యా శాఖ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపమవుతోంది. నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేయాల్సిన అధికారులు తమ పిల్లలు కాదులే అన భావనతో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అనుమతుల్లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా పట్టుకొస్తున్నాయి. చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. ఏటా వీటి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విషయం తెలుసుకునే లోపు విద్యా సంవత్సరం సగానికి పైగా పూర్తవుతుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
సాక్షి, కర్నూలు: అనుమతి లేని పాఠశాలల గుర్తింపులో విద్యాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇలాంటి స్కూళ్లను డైస్ సర్వేలో నమోదు చేయాలనే నిబంధనను పూర్తిగా విస్మరించారు. ఈ ఏడాది కూడా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. సర్వేలో గుర్తించిన అనుమతి లేని పాఠశాలలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది.
అలాంటిది 2011-12 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ అటకెక్కింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కుబడిగా గుర్తించిన అనుమతి లేని పాఠశాలలకు నోటీసులు అందజేయడంతో సరిపెడుతున్నారు. ఆ తర్వాత పాఠశాలలు మూతవేశారా.. లేదా అనే విషయం విద్యా శాఖ వద్దే లేకపోవడం వారి పనితీరుకు నిదర్శనం. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఇలాంటి పరిస్థితే నెలకొంది. గుర్తింపు లేని పాఠశాలలపై మండల విద్యాశాఖ అధికారులే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో వీరి నిర్లక్ష్యం వల్ల పాఠశాలలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. వీరి అండదండలు ఉండటం వల్లే సర్వేల్లో ఇలాంటి పాఠశాలలు వెలుగులోకి రావడం లేదని తెలుస్తోంది.
ఆయా పాఠశాలల గుర్తింపు వ్యవహారం అక్రమాలకు దారితీస్తోంది. ఏడాది పొడవున దుమారం రేగుతున్నా వీటి విషయంలో విద్యా శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పాఠశాలలకు గుర్తింపే లేకపోవడం.. కొన్నింటిని పునరుద్ధరించుకోకపోవడం.. ప్రాథమిక స్థాయిలో అనుమతి పొంది ఉన్నత పాఠశాల నిర్వహించడం జరుగుతున్నా.. ఎవరి స్థాయిలో వారికి అమ్యామ్యాలు ముడుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే గుర్తింపుతో వేర్వేరు పాఠశాలలు నిర్వహించడం కొన్ని కార్పొరేట్ పాఠశాలలకే చెల్లు. డీఈఓ, ఉప విద్యాశాఖాధికారిలు ఉండే జిల్లా కేంద్రంలోనూ అనుమతి లేని పాఠశాలలు లెక్కకు మించి ఉండటం గమనార్హం. విద్యా సంవత్సరం ప్రారంభంలో కర్నూలు నగరంలో విద్యాశాఖ గుర్తించి నోటీసులు జారీ చేసిన పాఠశాలలే ఇందుకు నిదర్శనం.
విజయ మెమోరియల్ (బుధవారపేట), మదర్ థెరిస్సా(సాయిబాబా నగర్), లార్డ్ వెంకటేశ్వర(ఓల్డ్‌బస్టాండ్), లిటిల్ ఫ్లవర్(లాల్‌మసీద్), జవహర్(ఓల్డ్‌బస్టాండ్), మరియా(వీఆర్ కాలనీ), శాంతా(స్టాంటన్‌పురం), వెస్లీ(స్టాంటన్‌పురం), రాయల్(వసంత నగర్), రాయల్ యూపీ స్కూల్(జోహారాపురం), మదర్ థెరిస్సా(దేవమడ) ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు ఈ కోవకు చెందినవే. అయితే విద్యాశాఖ డైస్ సర్వేలో కర్నూలు మండలంలోని లోహిత కాన్వెంట్ యూపీ స్కూల్(పంచలింగాల) మాత్రమే నిబంధనలను విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొనడం విద్యా శాఖ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
గుర్తింపు.. మొక్కు‘బడి’
Published Thu, Dec 19 2013 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement