సాక్షి, కర్నూలు: రవాణా శాఖ గాడితప్పింది. నకిలీ పత్రాలతో పరువు బజారున పడుతోంది. లెసైన్స్‌లు.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు.. ఇతరత్రా సేవలకు వసూళ్లు సరేసరి. ఇప్పుడు ఆర్టీఏ ఏజెంట్లు సరికొత్త దందాకు తెరతీశారు. ఇన్సూరెన్స్ పత్రాల ఫోర్జరీ వ్యవహారం ఆ శాఖను కుదిపేస్తోంది. ఇరువురు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ముఖ్య సూత్రధారులుగా సాగుతున్న బాగోతానికి జిల్లా రవాణా శాఖ ఉద్యోగులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుండటం గమనార్హం. ఆరు రోజుల క్రితం కర్నూలు నగరంలో వీరి గుట్టు రట్టయింది. స్థానిక ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు మహమ్మద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంటు. ఇతను నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయిస్తూ 15 రోజుల క్రితం రవాణా శాఖ అధికారులకు పట్టుబడ్డాడు.
ఇతన్ని విచారించగా మరికొందరి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. డీటీసీ శివరాంప్రసాద్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు రంగంలో దిగారు. ఈ నెల 7న ఆర్టీఏ ఏజెంట్లుగా పనిచేస్తున్న నరేష్, రమేష్ శెట్టి, జాకీర్ హుస్సేన్ కార్యాలయాలపై దాడులు చేసి పలు ఫైళ్లను తీసుకెళ్లడం తెలిసిందే. ఆ తర్వాత సీసీఎస్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టగా.. నగరంలోనే ఉంటున్న మరో ఆటో యూనియన్ నేతకూ ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన ఇంటిపై దాడి చేసి పలు నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిని ద్వారా కోడుమూరు కేంద్రంగా నడుస్తున్న నకిలీ ఇన్సురెన్స్ పత్రాల బాగోతం బట్టబయలవుతోంది.
నిబంధనలేంటి.. ఏం జరుగుతోంది
జిల్లాలో 23,966 ఆటోలు ఉండగా.. కర్నూలు నగరంలోనే 16వేలకు పైగా ఉన్నాయి. వీటికి ప్రతిఏటా ఫిట్‌నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కండీషన్‌తో పాటు ఇన్సురెన్స్ ధ్రువపత్రం తప్పనిసరి. వీటి ఆధారంగా రవాణా శాఖ వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తోంది. ఇన్సూరెన్స్ పత్రాల కోసం ఆయా కంపెనీలకు ఆటో యజమానులు రూ.2,500 నుంచి రూ.3,500 చెల్లించాల్సి ఉంది. ఇదంతా ఎందుకని భావించిన రవాణా శాఖ ఏజెంట్లు కొందరు ఆటో యూనియన్ నేతలతో కలిసి నకిలీ ధ్రువపత్రాల కుంభకోణానికి తెరతీశారు. కోడుమూరు కేంద్రంగా ఓ ముఠా వీటిని సృష్టిస్తూ నగరంలోని కొందరు ఆర్టీఏ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుల ద్వారా చెలామణి చేస్తోంది. ఒక్కో పత్రానికి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం తాజా ఘటనతో వెలుగుచూసింది. త్వరలోనే ఈ రాకెట్‌కు సంబంధం ఉన్న వారందరినీ ఆరెస్టు చూపే అవకాశం ఉంది.
50 శాతం ఇన్సూరెన్స్ పత్రాలు
నకిలీవే
గత ఏడాది ఆర్టీఏ కార్యాలయంలో 7,500 ఆటోలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేశారు. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు ఆయా ఆటోల యజమానులు సమర్పించిన ఇన్సూరెన్స్ పత్రాలు నకిలీవా? అసలైనవా? అనే విషయమై విచారణ కొనసాగుతోంది. ఈ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీల సహకారం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే 50 శాతం ఇన్సూరెన్స్ పత్రాలు నకిలీవని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఒక్కో ధ్రువపత్రాన్ని రూ.1000 చొప్పున విక్రయించినట్లయితే అక్రమార్కులు రూ.35 లక్షలకు పైగా ఆర్జించినట్లు లెక్కకడుతున్నారు. ఈవిధంగా కంపెనీలు రూ.70 లక్షలకు పైగా నష్టపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నకిలీ.. మకిలీ
Published Sun, Jan 12 2014 4:21 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM
Advertisement
Advertisement