సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంవల్ల తూర్పు గాలులు బలంగా ఉంటున్నాయి. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం లేనప్పటికీ శుక్రవారం నాటి వాతావరణం ఆధారంగా అంచనాలు మారుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి నాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. ఉత్తర కోస్తాంధ్రలో దాదాపు పొడి వాతావరణమే నమోదు కావచ్చునని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఢిల్లీలోని వాతావరణశాఖ కూడా అల్పపీడనం బలపడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.