
సాక్షి, కోడుమూరు: తనకు రుణ మాఫీ కాలేదని అడిగిన రైతుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అసహనంతో ‘షటప్.. డోంటాక్.. (నోర్ముయ్.. మాట్లాడొద్దు) నాన్‌సెన్స్.. వింటే విను లేకుంటే వెళ్లిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా! నేను డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తిని. సారా తాగిన నాయాళ్లతో ఇక్కడికొచ్చి అల్లరి చేస్తారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో తిరిగినట్లు మాట్లాడితే కుదరదు. మీ కోసం పనులు చేయడానికి వచ్చా. చేతులు చూపించి మాట్లాడతావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పుడూ మౌనంగా, సున్నితంగా ఉండే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తిలో జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రైతుపై కేకలు వేయడం చూసి కార్యకర్తలు సైతం విస్తుపోయారు. అంతకు ముందు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని వ్యాఖ్యానించారు. ‘1978లో నేను డోన్ నుంచి ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేశా. చంద్రబాబు కూడా అదే సంవత్సరం అదే పార్టీ నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment