సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులను మోసం చేశారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆరోపించారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్‌లు చెల్లించకుండ విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ బిల్లులను కూడా చంద్రబాబు మళ్లీంచారని మండిపడ్డారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి చంద్రబాబు హయాంలోని బకాయిలన్నింటిని తీర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీల అమలుకు పెద్ద పీట వేస్తూ.. విద్యార్థులకు 20 వేల చొప్పున హాస్టల్, మెస్ చార్జీలను ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గిరిజన హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు తొమ్మిది రకాల ప్రమాణాలను రూపొందిస్తున్నామని అన్నారు. గురుకుల హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తి చేస్తామని, మానిఫెస్టోలో చెప్పిన ప్రకారం గిరిజన యూనివర్సిటీ, మేడికల్ కాలేజిలు ఏర్పాటు చేస్తామని పుష్ప శ్రీ వాణి పేర్కొన్నారు.
కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారని, త్వరలోనే దానికి ఆయన శంఖుస్థాపన చేయనున్నట్లు పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులను, అలాగే నామినేషన్ వర్కులలోను యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంతో వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. దీని కింద ఏడాదికి 18,750 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వెంటనే తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment