కడప కార్పొరేషన్/ అర్బన్: డిప్యూటీ మేయర్ అనే కనీస గౌరవం లేకుండా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు అరీఫుల్లాపై దురుసుగా ప్రవర్తించిన సీఐ సదాశివయ్యపై కేసు నమోదు చేయాలని మేయర్ కె.సురేష్‌బాబు డిమాండ్ చేశారు. శుక్రవార ం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్‌ఖాన్, ఇతర నాయకులతో కలిసి ఆయన సీఐ రమేష్‌కు రాతమూలకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం రాత్రి రైలుకు వెళ్తున్న బంధువులను విడిచి రావడానికి వెళ్తున్న అరీఫుల్లా చెల్లెలి కుమారుడిని సీఐ సదాశివయ్య ఆపి ఆర్‌సీ, లెసైన్సు అడిగి రూ. 100 ఫైన్ వేశారన్నారు. ఈ విషయమై డిప్యూటీ మేయర్ ఫోన్ చేసినా, స్వయంగా వెళ్లి మాట్లాడినా సీఐ అసభ్యంగా మాట్లాడి అవమానపరిచారన్నారు. అందుకు సంబంధించిన రికార్డింగ్స్ ఉన్నాయని తెలిపారు. ఇటీవల పెద్దదర్గా ఉరుసు సందర్భంగా కూడా సీఐ.. షాపుల్లో ఉన్న బాటిళ్లు పగులగొట్టి, మహిళలని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని స్థానికులు చెబుతున్నారని చెప్పారు. అరీఫుల్లా అత్యంత సౌమ్యుడని, ఎవరినీ నొప్పించే రకం కాదని, అలాంటి వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయడం భావ్యం కాదన్నారు.
డిప్యూటీ మేయర్‌కే ఇలాంటి అనుభవం ఎదురైందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఐపై కేసు నమోదు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సూర్యనారాయణరావు, ఎస్‌ఏ కరిముల్లా, ఎస్‌ఎండీ షఫీ, ఐస్‌క్రీం రవి, బాలస్వామిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, ఆర్‌ఎన్ బాబుమున్నా పాల్గొన్నారు.
డిప్యూటీ మేయర్‌పై దురుసు ప్రవర్తనా?
Published Sat, Mar 14 2015 2:37 AM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM
Advertisement
Advertisement