k.suresh babu
-
హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకోవాలి
కడప కార్పొరేషన్: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని విద్యార్థులు భుజానికెత్తుకోవాలని వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అ«ధ్యక్షుడు ఖాజా రహమతుల్లా అధ్యక్షతన ప్రత్యేక హోదా, ఉక్కు పరిశ్రమ అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథి గా హాజరైన సురేష్‌బాబు మాట్లాడుతూ ఉదయం లేచినప్పటి నుంచి మనం వాడే బ్రష్, పేస్ట్, సబ్బు ఆయిల్‌కు, తినే తిండికి ఇలా ప్రతిదానికి పన్నులు చెల్లిస్తున్నామని, ప్రత్యేకహోదా వస్తే ఈ పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ వం టి చిన్నరాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల బాగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు, టీడీపీ నేతలు కూడా ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తుచేశారు. హోదా వస్తే మన రాష్ట్రం కూడా అంతటి అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు వల్ల అనేక లాభాలు ప్రత్యేక హోదా వస్తే ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుందని, దాని వల్ల ఇక్కడ తయారుచేసే ప్రతి వస్తువుల ధరలు తక్కువ ధరకే లభిస్తాయని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తెలిపారు. విభజన సమయంలో ఐదేళ్లు చాలదు పదేళ్లు కావాలని అడిగిన వెంకయ్య నాయుడు, తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ, చంద్రబాబులు ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఎంతో ముందుచూపుతో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, దాన్ని ప్రభుత్వం సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాల్సిన అవసరముందన్నారు. గుంతకల్‌కు రైల్వే జోన్ ఇవ్వాలని, కడపలో హైకోర్టు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. అగ్రగామిగా ఎదగాలంటే ‘హోదా’ కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు అన్నారు. 1969 నుంచి ప్రత్యేక హోదా ఇస్తున్నారని చెబుతూ ఎన్నికల ముందు మోదీ, వెంకయ్య, చంద్రబాబు ఇచ్చిన హామీలు, చంద్రబాబు పలు దఫాలుగా మాట మార్చిన తీరు, ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు, ఏఏ కారణాలతో ఇస్తారు, హోదా ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, హోదా పొందిన రాష్ట్రాలు ఎలా అభివృద్ధిని సాధించాయని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హోదా వస్తే 90శాతం నిధులు గ్రాంటు రూపంలో వస్తాయని, పది శాతం నిధులు రుణంగా వస్తాయని చెప్పారు. విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీమ ప్రజలు సింహగర్జన చేయాల్సిన సమయం వచ్చింది రాయలసీమ ప్రజలు సింహగర్జన చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాయలసీమ ఉద్యమ నాయకుడు ఐవీఆర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఏ దేశ భవిష్యత్ అయినా విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఆనాడు పార్లమెంటు తలుపులు మూసి అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారన్నారు. నేను తప్పు చేశానని లెంపలేసుకొని ఓట్లేయించుకొన్న సీఎంకు రాజధాని పిచ్చి పట్టిందన్నారు. హోదా వస్తే పన్నులు తగ్గిపోయి పరిశ్రమల స్థాపనకు అవకాశం కలుగుతుందన్నారు. సీమ రైతు ఆత్మహత్యలపై పవన్‌కళ్యాణ్ మాట్లాడక పోవడంపట్ల ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొఫెసర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అందరు సీఎంలు హైదరాబాద్‌లో అభివృద్ధిని కేంద్రీకరించడం వల్లే ఈనాడు మనం రాజధానిని కోల్పోయామని, నేడు అదే తప్పును నేటి పాలకులు చేస్తున్నారన్నారు. నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ బైరెడ్డి రామక్రిష్ణారెడ్డి, హూమన్ రైట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎండీ రసూల్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాకా సురేష్‌కుమార్, పులి సునీల్, చల్లా రాజశేఖర్, షఫీ, దేవిరెడ్డి ఆదిత్య, యాసిన్, అన్సర్ అలీ, శ్రీరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి ఇక ఉండబోదు
కడప కార్పొరేషన్: కడప నగరంలో తాగునీటి ఎద్దడి తీర్చడానికే 90 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భజలాశయం నిర్మిస్తున్నామని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బండికనుమపై రూ. 3.08 కోట్ల 13వ ఆర్థిక సంఘం నిధులతో భూగర్భజలాశయం, పంపింగ్‌మెయిన్ పనులకు మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా, డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, కమీషనర్ చల్లా ఓబులేసులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ కడప నగరంలో ఎక్కువ సమయం నీరు ఇస్తున్నా అది చివరి ఇంటి వరకూ చేరడం లేదన్నారు. ఇంత ఎత్తులో నిర్మిస్తున్న ఈ భూగర్భజలాశయంతో గ్రావిటీ ఆధారంగా ప్రతి ఒక్కరికీ తాగునీరు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎనిమిది నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వీలైనంత త్వరగా నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఎంపీ అధికారులను కోరారు. నిరుపయోగంగా ఉన్న జలాశయం అందుబాటులోకి.. ఆసియా ఖండ ంలోనే అతిపెద్దదైన ఈ భూగర్భజలాశయం సుమారు 8 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని కడప శాసన సభ్యులు ఎస్బి అంజద్‌బాషా తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం, వారు మంజూరు చేసి పంపడం చకచకా జరిగిపోయాయన్నారు. తమ హయాంలో జలాశయ పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రావిటీ అధారంగా డెడ్ ఎండ్ వరకూ నీరు అందించాలన్నదే దీని లక్ష్యమని చెప్పారు. 24 గంటల తాగునీరు.. ఆసియాలోనే పెద్దదైన ఈ జలాశయాన్ని 1970లో ఏపీఐఐసీ వారు నిర్మించారని మేయర్ కె. సురేష్‌బాబు తెలిపారు. నగర ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకూడదనే సదుద్దేశంతో తమ పాలకవర్గం దీన్ని పునర్నిర్మించాలని సంకల్పించిందన్నారను. సామాన్యుడికి 24 గంటలు తాగునీరు అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. అలగనూరు, వెలుగోడు రిజర్వాయర్ల నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేయించి 43 డివిజన్లలో ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని వివరించారు. అంతకుముందు వారు జలాశయ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జున, కార్పొరేటర్లు పాకాసురేష్, బోలా పద్మావతి, నాగమల్లిక, శ్రీలేఖ, అందూరి రాజగోపాల్‌రెడ్డి, ఎంఎల్ఎన్ సురేష్, చైతన్య, ఆదినారాయణ, రామలక్ష్మణ్‌రెడ్డి, కె. బాబు, చినబాబు, బండి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు టీపీ వెంకట సుబ్బమ్మ, నాగమల్లారెడ్డి, ఎంపీ సురేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజగోపాల్‌రెడ్డి, పాండురంగా రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, షేక్ అల్తాఫ్, నిత్యానందరెడ్డి, పులిసునీల్, పత్తిరాజేశ్వరి, ఎస్ఎండీ షఫీ, జి. క్రిష్ణ, బాలస్వామిరెడ్డి, సూర్యనారాయణరావు, ఎన్. ప్రసాద్‌రెడ్డి, కిరణ్, రెడ్డిప్రసాద్, శ్రీరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. -
డిప్యూటీ మేయర్‌పై దురుసు ప్రవర్తనా?
కడప కార్పొరేషన్/ అర్బన్: డిప్యూటీ మేయర్ అనే కనీస గౌరవం లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకుడు అరీఫుల్లాపై దురుసుగా ప్రవర్తించిన సీఐ సదాశివయ్యపై కేసు నమోదు చేయాలని మేయర్ కె.సురేష్‌బాబు డిమాండ్ చేశారు. శుక్రవార ం వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్ఖాన్, ఇతర నాయకులతో కలిసి ఆయన సీఐ రమేష్‌కు రాతమూలకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం రాత్రి రైలుకు వెళ్తున్న బంధువులను విడిచి రావడానికి వెళ్తున్న అరీఫుల్లా చెల్లెలి కుమారుడిని సీఐ సదాశివయ్య ఆపి ఆర్సీ, లెసైన్సు అడిగి రూ. 100 ఫైన్ వేశారన్నారు. ఈ విషయమై డిప్యూటీ మేయర్ ఫోన్ చేసినా, స్వయంగా వెళ్లి మాట్లాడినా సీఐ అసభ్యంగా మాట్లాడి అవమానపరిచారన్నారు. అందుకు సంబంధించిన రికార్డింగ్స్ ఉన్నాయని తెలిపారు. ఇటీవల పెద్దదర్గా ఉరుసు సందర్భంగా కూడా సీఐ.. షాపుల్లో ఉన్న బాటిళ్లు పగులగొట్టి, మహిళలని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని స్థానికులు చెబుతున్నారని చెప్పారు. అరీఫుల్లా అత్యంత సౌమ్యుడని, ఎవరినీ నొప్పించే రకం కాదని, అలాంటి వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయడం భావ్యం కాదన్నారు. డిప్యూటీ మేయర్‌కే ఇలాంటి అనుభవం ఎదురైందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఐపై కేసు నమోదు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు సూర్యనారాయణరావు, ఎస్ఏ కరిముల్లా, ఎస్ఎండీ షఫీ, ఐస్‌క్రీం రవి, బాలస్వామిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, ఆర్ఎన్ బాబుమున్నా పాల్గొన్నారు. -
ఆర్టీసీకి అండగా నిలుస్తాం..
కడప మేయర్ సురేష్‌బాబు కడప అర్బన్ : ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప మేయర్ కె.సురేష్‌బాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకుని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 11 నుంచి ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మె నేపథ్యంలో కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనలో భాగంగా వేల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీ విభాగాన్ని తెలంగాణలో ఉండేలా, కేవలం 10 శాతం ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండేలా విభజన ప్రక్రియ జరగడంతో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కార్మికులు తమ వేతనాల్లో కొంత భాగాన్ని సొసైటీలో దాచుకుంటే ఆ మొత్తాన్ని కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం యాజమాన్యం వాడుకోవడాన్ని తప్పుబట్టారు. ఆర్టీసీకి రోజూ రూ.2.50 కోట్లు నష్టం వాటిల్లుతోందని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అయినా ప్రజలకు సేవలందించడంలో ఏమాత్రం తగ్గడం లేదని చెప్పారు. అలాంటి ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ సమ్మెకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది అజయ్‌కుమార్ వీణా, ఈయూ చీఫ్ డిప్యూటీ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, ఎల్ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు శేఖర్, బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి నరసయ్య, రీజనల్ అధ్యక్షుడు నాగముని, రీజనల్ నాయకులు చెన్నయ్య, శేఖర్, కడప డిపో అధ్యక్ష కార్యదర్శులు మూర్తి, ప్రకాశం, నాగసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
అట్టహాసంగా సురేష్‌బాబు నామినేషన్
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం అప్సర థియేటర్ నుంచి చిన్నచౌకు వార్డు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆయన నామినేషన్ వేశారు. ఈ ర్యాలీలో ఆయన వెంట రాజం పేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్‌బాష ఉన్నారు. మా గెలుపు నల్లేరుపై నడకే: సురేష్‌బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై బండి నడకేనని మేయర్ అభ్యర్థి కె.సురేష్‌బాబు అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనానికి భయపడి ప్రభుత్వం ఏ ఎన్నికలు నిర్వహించడానికి కూడా సాహసించలేకపోయిందన్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలైనా నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీలు కడప కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. వైఎస్సార్సీపీదే విజయం: ఎమ్మెల్యే కొరముట్ల రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కిరణ్ ప్రభుత్వం వైఎస్ పథకాలన్నింటినీ తుంగలో తొక్కిందన్నారు. సార్వత్రిక ఎన్నికలను పక్కదారి పట్టించడానికే మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. సాధారణ ఎన్నికల్లో సీమాంధ్రలో 175 సీట్లకుగాను వైఎస్ఆర్సీపీ 160 సీట్లు కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. జగన్ నాయకత్వం అవసరం: ఎమ్మెల్యే అమర్నాధరెడ్డి కేంద్ర ప్రభుత్వం అసమర్థ విధానాలు, నిర్ణయాల వల్ల రెండు ముక్కలైన రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం అవసరముందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధరెడ్డి అన్నారు. ఏ ఎన్నికల్లోనైనా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో సువర్ణపాలన వస్తుందన్నారు. కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్‌బాషా మాట్లాడుతూ కడపలో తాము నిర్వహించిన గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల మనోభావాలేంటో అర్థమయ్యాయన్నారు. ఎన్నికల్లో విభజనకు పూర్తిగా సహకరించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛెర్మైన్ కె.బ్రహ్మానందరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అఫ్జల్ఖాన్, యానాదయ్య, సర్వేశ్వరరెడ్డి, బంగారు నాగయ్య, కె.శ్రీనివాసులు, బాలమునిరెడ్డి, బివిటి ప్రసాద్, బి.అమర్నాథరెడ్డి, బిహెచ్ ఇలియాస్, పులి సునీల్, ఎంపి సురేష్, సంజీవరాయుడు పాల్గొన్నారు. -
దళితులకే జెడ్పీ పీఠం
సాక్షి, కడప : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దళితులకే దక్కనుంది. జిల్లా పరిషత్‌లకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ కమిషనర్ శనివారం ప్రకటించారు. ఇంతవరకు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి ఓసీ, బీసీలను మాత్రమే వరించింది. తొలిసారిగా దళితులకు దక్కనుండటం గమనార్హం. గతంలో జెడ్పీ అధ్యక్షులుగా తులసిరెడ్డి (జనరల్) కె.సురేష్‌బాబు(బీసి), జ్యోతిరెడ్డి (ఓసి మహిళ) పనిచేసి ఉన్నారు.