నీటి ఎద్దడి ఇక ఉండబోదు | water problem | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి ఇక ఉండబోదు

Published Sat, May 2 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

water problem

కడప కార్పొరేషన్: కడప నగరంలో తాగునీటి ఎద్దడి తీర్చడానికే 90 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భజలాశయం నిర్మిస్తున్నామని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బండికనుమపై రూ. 3.08 కోట్ల 13వ ఆర్థిక సంఘం నిధులతో భూగర్భజలాశయం, పంపింగ్‌మెయిన్ పనులకు మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా, డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, కమీషనర్ చల్లా ఓబులేసులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ కడప నగరంలో ఎక్కువ సమయం నీరు ఇస్తున్నా అది చివరి ఇంటి వరకూ చేరడం లేదన్నారు. ఇంత ఎత్తులో నిర్మిస్తున్న ఈ భూగర్భజలాశయంతో గ్రావిటీ ఆధారంగా ప్రతి ఒక్కరికీ తాగునీరు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎనిమిది నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వీలైనంత త్వరగా నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఎంపీ అధికారులను కోరారు.
 
 నిరుపయోగంగా ఉన్న జలాశయం అందుబాటులోకి..
 ఆసియా ఖండ ంలోనే అతిపెద్దదైన ఈ భూగర్భజలాశయం సుమారు 8 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని కడప శాసన సభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం, వారు మంజూరు చేసి పంపడం చకచకా జరిగిపోయాయన్నారు. తమ హయాంలో జలాశయ పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రావిటీ అధారంగా డెడ్ ఎండ్ వరకూ నీరు అందించాలన్నదే దీని లక్ష్యమని చెప్పారు.
 
  24 గంటల తాగునీరు..
 ఆసియాలోనే పెద్దదైన ఈ జలాశయాన్ని 1970లో ఏపీఐఐసీ వారు నిర్మించారని మేయర్ కె. సురేష్‌బాబు తెలిపారు. నగర ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకూడదనే సదుద్దేశంతో తమ పాలకవర్గం దీన్ని పునర్నిర్మించాలని సంకల్పించిందన్నారను. సామాన్యుడికి 24 గంటలు తాగునీరు అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. అలగనూరు, వెలుగోడు రిజర్వాయర్ల నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేయించి 43 డివిజన్లలో ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని వివరించారు. అంతకుముందు వారు జలాశయ పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లికార్జున, కార్పొరేటర్లు పాకాసురేష్, బోలా పద్మావతి, నాగమల్లిక, శ్రీలేఖ, అందూరి రాజగోపాల్‌రెడ్డి, ఎంఎల్‌ఎన్ సురేష్, చైతన్య, ఆదినారాయణ,  రామలక్ష్మణ్‌రెడ్డి, కె. బాబు, చినబాబు, బండి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు టీపీ వెంకట సుబ్బమ్మ, నాగమల్లారెడ్డి, ఎంపీ సురేష్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజగోపాల్‌రెడ్డి, పాండురంగా రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, షేక్ అల్తాఫ్, నిత్యానందరెడ్డి, పులిసునీల్, పత్తిరాజేశ్వరి, ఎస్‌ఎండీ షఫీ, జి. క్రిష్ణ, బాలస్వామిరెడ్డి, సూర్యనారాయణరావు, ఎన్. ప్రసాద్‌రెడ్డి, కిరణ్, రెడ్డిప్రసాద్, శ్రీరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement