
మాట్లాడుతున్న సురేష్‌బాబు
కడప కార్పొరేషన్: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని విద్యార్థులు భుజానికెత్తుకోవాలని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అ«ధ్యక్షుడు ఖాజా రహమతుల్లా అధ్యక్షతన ప్రత్యేక హోదా, ఉక్కు పరిశ్రమ అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథి గా హాజరైన సురేష్‌బాబు మాట్లాడుతూ ఉదయం లేచినప్పటి నుంచి మనం వాడే బ్రష్, పేస్ట్, సబ్బు ఆయిల్‌కు, తినే తిండికి ఇలా ప్రతిదానికి పన్నులు చెల్లిస్తున్నామని, ప్రత్యేకహోదా వస్తే ఈ పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ వం టి చిన్నరాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల బాగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు, టీడీపీ నేతలు కూడా ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తుచేశారు. హోదా వస్తే మన రాష్ట్రం కూడా అంతటి అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు.
ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు వల్ల అనేక లాభాలు
ప్రత్యేక హోదా వస్తే ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుందని, దాని వల్ల ఇక్కడ తయారుచేసే ప్రతి వస్తువుల ధరలు తక్కువ ధరకే లభిస్తాయని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తెలిపారు. విభజన సమయంలో ఐదేళ్లు చాలదు పదేళ్లు కావాలని అడిగిన వెంకయ్య నాయుడు, తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ, చంద్రబాబులు ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఎంతో ముందుచూపుతో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, దాన్ని ప్రభుత్వం సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాల్సిన అవసరముందన్నారు. గుంతకల్‌కు రైల్వే జోన్ ఇవ్వాలని, కడపలో హైకోర్టు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
అగ్రగామిగా ఎదగాలంటే ‘హోదా’ కావాల్సిందే
ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు అన్నారు. 1969 నుంచి ప్రత్యేక హోదా ఇస్తున్నారని చెబుతూ ఎన్నికల ముందు మోదీ, వెంకయ్య, చంద్రబాబు ఇచ్చిన హామీలు, చంద్రబాబు పలు దఫాలుగా మాట మార్చిన తీరు, ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు, ఏఏ కారణాలతో ఇస్తారు, హోదా ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, హోదా పొందిన రాష్ట్రాలు ఎలా అభివృద్ధిని సాధించాయని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హోదా వస్తే 90శాతం నిధులు గ్రాంటు రూపంలో వస్తాయని, పది శాతం నిధులు రుణంగా వస్తాయని చెప్పారు. విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
సీమ ప్రజలు సింహగర్జన చేయాల్సిన సమయం వచ్చింది
రాయలసీమ ప్రజలు సింహగర్జన చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాయలసీమ ఉద్యమ నాయకుడు ఐవీఆర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఏ దేశ భవిష్యత్ అయినా విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఆనాడు పార్లమెంటు తలుపులు మూసి అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారన్నారు. నేను తప్పు చేశానని లెంపలేసుకొని ఓట్లేయించుకొన్న సీఎంకు రాజధాని పిచ్చి పట్టిందన్నారు. హోదా వస్తే పన్నులు తగ్గిపోయి పరిశ్రమల స్థాపనకు అవకాశం కలుగుతుందన్నారు. సీమ రైతు ఆత్మహత్యలపై పవన్‌కళ్యాణ్ మాట్లాడక పోవడంపట్ల ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొఫెసర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అందరు సీఎంలు హైదరాబాద్‌లో అభివృద్ధిని కేంద్రీకరించడం వల్లే ఈనాడు మనం రాజధానిని కోల్పోయామని, నేడు అదే తప్పును నేటి పాలకులు చేస్తున్నారన్నారు. నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ బైరెడ్డి రామక్రిష్ణారెడ్డి, హూమన్ రైట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎండీ రసూల్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాకా సురేష్‌కుమార్, పులి సునీల్, చల్లా రాజశేఖర్, షఫీ, దేవిరెడ్డి ఆదిత్య, యాసిన్, అన్సర్ అలీ, శ్రీరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment