► మాజీ డిప్యూటీ స్పీకర్ పసల ఆస్తుల వ్యవహారం
► రిజిస్ట్రేషన్ శాఖలో మాయజాలం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విశాలాంధ్ర తొలి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత పసల సూర్యచంద్రరావు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అలంపురం, ఆ తరువాత తాడేపల్లిగూడెం శాసనసభా నియోజకవర్గాల నుంచి 1950-1960 సంవత్సరాల మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పసల ఆ తర్వాత శాసనమండలికి కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు సన్నిహితుడిగా ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన పసల సూర్యచంద్రరావు ఆస్తులపై భూబకాసురుల కన్నుపడింది. తాడేపల్లిగూడెంలో ఆయనకు గల కోట్లాది రూపాయల విలువైన భూ విక్రయాలను స్వయంగా ఆయన బంధువులే వివాదాస్పదం చేస్తున్నారు. దీనికి రిజిస్ట్రేషన్ శాఖ కూడా వంతపాడటం గమనార్హం.
2004 జనవరి 17న పసల సూర్యచంద్రరావు మృతి చెందగా, ఆ తర్వాత ఆయన ఆస్తుల వ్యవహారాలు రచ్చకెక్కాయి. తాడేపల్లిగూడెం ఓవర్ బ్రిడ్జికి సమీపంలో ఉన్న ఐదు ఎకరాల 50 సెంట్ల(ఆర్ ఎస్ 216, 217-2బీ) భూమిలో సుమారు 9వేల గజాల స్థలానికి సంబంధించి ఆయన కుమారులైన సిద్ధార్థ, సాయి రూ.95 లక్షలకు చెక్కులు తీసుకుని గుడిమెట్ల బాపిరెడ్డి అనే వ్యక్తికి పవర్ ఆప్ అటార్నీ (జీపీఏ) రాశారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2005 ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే, ఆ రూ.95 లక్షలకు సంబంధించి బాపిరెడ్డి చెల్లని చెక్కులు ఇవ్వడంతో ఆ తర్వాత సిద్ధార్థ, సాయి కోర్టులో కేసు వేశారు. జీపీఏను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారిద్దరూ అడ్డదారి తొక్కారు.
ఏలూరు, పెనుగొండల్లో రిజిస్ట్రేషన్
అదే 9 వేల గజాల స్థలాన్ని విజయవాడకు చెందిన రావిసూర్యప్రకాశ్‌బాబు అనే వ్యక్తికి విక్రయించారు. సూర్య ప్రకాశ్‌బాబు నుంచి రూ.1.20 కోట్లు తీసుకుని ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అతని పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా ఒకే స్థలాన్ని రెండుచోట్ల రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్లు మరోసారి ఇదే స్థలంలో కొంత భాగాన్ని పెనుగొండలో మరో వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. 2016 ఫిబ్రవరిలో పసల సిద్ధార్థ ఉంగుటూరు వాస్తవ్యుడు కె.సత్యనారాయణకు 3,500 గజాల స్థలాన్ని పెనుగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఒకే ఆస్తిని వేర్వేరు వ్యక్తుల పేరిట వేర్వేరు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడం చూస్తుంటే ఆ శాఖ పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే పసల సూర్యచంద్రరావు ఆస్తుల విక్రయాలకు సంబంధించి మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకే ఆస్తి.. మూడు రిజిస్ట్రేషన్లు
Published Sat, Apr 16 2016 5:04 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM
Advertisement